స్వావలంబన భారత్‌కు తొలి అడుగు : ప్రధాని

by Shamantha N |
స్వావలంబన భారత్‌కు తొలి అడుగు : ప్రధాని
X

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి దేశానికి ఒక గుణపాఠం నేర్పిందని, అందుకు అనుగుణంగా దిగుమతులను తగ్గించే నిర్ణయాలను తీసుకుంటున్నామని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. ఎనర్జీ రంగంలో భారత్ స్వయం సమృద్ధి సాధించేందుకు ఈరోజు కీలక అడుగు పడిందని పేర్కొన్నారు. ప్రస్తుతం దిగుమతి చేసుకుంటున్న వాటిని సమీప భవిష్యత్తులో ఎగుమతి చేసే స్థాయికి భారత్ చేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

కమర్షియల్ మైనింగ్‌ కోసం బొగ్గు గనుల వేలం విధానాన్ని గురువారం ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. స్వావలంబన భారత్‌కు తొలి అడుగు పడిందని వ్యాఖ్యానించారు. పారిశ్రామిక వృద్ధికి ఊతమివ్వడానికి, స్వయం సమృద్ధిని సాధించేందుకు ఈ అడుగు కీలకమని తెలిపారు. ఈ యాక్షన్ ప్రాసెస్‌లో దేశీయ కంపెనీలతోపాటు ఎఫ్‌డీఐల కింద విదేశీ సంస్థలకూ అవకాశం ఉంటుంది.

బొగ్గు ఉత్పత్తిదారుల్లో భారత్ నాలుగో అతిపెద్ద దేశమని అయితే, అతిపెద్ద బొగ్గు ఎగుమతిదారుగా ఎందుకు ఎదగకూడదని ప్రశ్నించారు. ఈ-వేలం విధానం ప్రైవేటు రంగానికి ప్రభుత్వానికీ కలిసొస్తుందని చెప్పారు. ప్రభుత్వాలకు అదనపు ఆదాయం లభిస్తుందన్నారు. 2030 వరకు 10కోట్ల టన్నుల బొగ్గును గ్యాసిఫై(కోల్ గ్యాస్‌గా మార్చడం) చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్టు వెల్లడించారు. ఇందుకు నాలుగు ప్రాజెక్టులను గుర్తించినట్టు తెలిపారు. ఈ ప్రాజెక్టుల్లో రూ.20వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్టు చెప్పారు. ఇది బొగ్గుకు సంబంధించిన విషయం కావొచ్చు కానీ, దీని ద్వారా వజ్రాలను సాధించాలని భావిస్తున్నట్టు వివరించారు. ఈ-వేలం విధాన ప్రకటనలు ‘ఆత్మ నిర్భర్ భారత్‌ అభియాన్‌’లో భాగమని బొగ్గు గనులశాఖ ఓ ప్రకటనలో పేర్కొంది.

Advertisement

Next Story