- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వ్యాక్సిన్ పంపిణీకి ప్లాన్ రెడీ: మోడీ
న్యూఢిల్లీ: ప్రపంచాన్ని కలవరపెడుతున్న కరోనా మహమ్మారిని నిలువరించే మూడు టీకాలు మన దేశంలో వివిధ ప్రయోగదశల్లో ఉన్నాయని, ఈ వ్యాక్సిన్‌ల సమర్థతపై శాస్త్రజ్ఞులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే భారీగా ఉత్పత్తి మొదలవుతుందని దేశ ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడించారు. టెస్టులన్నీ పూర్తి కాగానే టీకాల ఉత్పత్తి, పంపిణీకి ప్లాన్ రెడీగా ఉన్నదని వివరించారు. అత్యల్పసమయంలోనే టీకాను ప్రజల ముందుకు తీసుకువచ్చే ప్రణాళికను సిద్ధం చేశామని తెలిపారు.
స్వాతంత్ర్య దినోత్సవాన్ని పుస్కరించుకుని ప్రధాని మోడీ ఢిల్లీలోని ఎర్రకోట నుంచి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. సుమారు గంటన్నరపాటు చేసిన ఈ ప్రసంగంలో ప్రజలకు ఆరోగ్యకరమైన ప్రకటన చేశారు. నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ కార్యక్రమాన్ని పంద్రాగస్టు సందర్భంగా ప్రకటించారు.
ఇది భారత ఆరోగ్యరంగంలో విప్లవకరమైన మార్పులను తీసుకొస్తుందన్నారు. ఈ మిషన్ కింద ప్రతిపౌరుడు ఒక యూనిక్ హెల్త్ ఐడీ పొందుతాడని ప్రధాని చెప్పారు. ప్రతి పౌరుడి టెస్టులు, చికిత్స, ఇతర ఆరోగ్య సమాచారాన్నంతా డిజిటల్‌గా డేటాబేస్‌గా నిల్వచేసి దేశవ్యాప్తంగా ఎక్కడినుంచైనా ఆ వివరాలను పొందే వీలుకలుగుతుంది. వైద్యుడి దగ్గరకు లేదా ఫార్మసీకి వెళ్లిన ప్రతిసారీ ఆ వివరాలు ఈ ఐడీలో నిక్షిప్తమవుతాయని, ఆరోగ్యానికి సంబంధించిన ప్రతివివరం హెల్త్ ప్రొఫైల్‌లో ప్రోది అవుతాయని ప్రధాని వివరించారు.
ముడి సరుకుల ఎగుమతి.. వస్తువుల దిగుమతి ఇంకెన్నాళ్లు?
భారత్ తలుచుకుంటే ఏదైనా సాధించి తీరుతుందని, చరిత్ర చూస్తే ఈ విషయం బోధపడుతుందని ప్రధాని మోడీ అన్నారు. ‘కరోనా మహమ్మారికి ముందు ఎన్95 మాస్కులు, పీపీఈ కిట్లు, వెంటిలేటర్లు మన దేశంలో తయారయ్యేవికావు. కానీ, ఇప్పుడు వేరే దేశాలకు వీటిని ఎగుమతి చేసే దశకు చేరుకున్నాం. కరోనా విలయం సాగిస్తుండగానే మనమంతా దేశ స్వావలంబనకు తీర్మానం చేసుకున్నాం. ఇప్పుడు దేశ స్వయం సమృద్ధత 130 కోట్ల ప్రజల మంత్రం.
మనమంతా స్థానిక ఉత్పత్తులపట్ల సానుకూలంగా ఉండాలి. వాటిని ప్రోత్సహించేలా నడుచుకోవాలి. ముడి సరుకులను వేరే దేశాలకు ఎగుమతి చేసి తయారైన వస్తువులను దిగుమతి చేసుకునే విధానాన్ని ఇంకెన్నాళ్లు పాటిద్దాం. ఆత్మ నిర్భర్ భారత్‌లో భాగంగా దిగుమతులను తగ్గించి దేశంలోనే వస్తువులను ఉత్పత్తి చేసుకుందాం. దీనికోసం ప్రభుత్వం అనేక నిర్ణయాలు తీసుకుంటున్నది. ఇటీవలే రక్షణ శాఖ 101 వస్తువుల దిగుమతిపై నిషేధాన్ని ప్రకటించింది. ఇదంతా సులువు కాకపోవచ్చు. లక్షల సవాళ్లు ఎదురుకావచ్చు. కానీ, దేశంలో కోట్లల్లో పరిష్కారాలున్నాయి’ అని ప్రధాని వివరించారు.
స్వయం సమృద్ధతా అంటే కేవలం దిగుమతులను కుదించుకోవడమే కాదు.. నైపుణ్యాలను, సృజనాత్మకతనూ పెంచుకోవడమని ప్రధాని అన్నారు. నేడు పెద్ద పెద్ద కంపెనీలు భారత్‌వైపు చూస్తున్నాయని, ఆ అవకాశాలను భారత్ అందిపుచ్చుకోవాలని సూచించారు. మౌలిక రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలు సాగుతూనే ఉన్నాయని, వివిధ రంగాల్లో సుమారు ఏడు వేల కోట్ల కొత్త ప్రాజెక్టులను గుర్తించామని వెల్లడించారు. వీటిలో పెట్టుబడుల కోసం రూ. 1.10 లక్షల కోట్ల ఫండ్‌లను ఏర్పాటు చేశామని చెప్పారు.
పాక్, చైనాలకు వార్నింగ్
పాకిస్తాన్‌తో సరిహద్దు ఎల్‌వోసీ(సరిహద్దు నియంత్రణ రేఖ) నుంచి చైనా సరిహద్దు ఎల్ఏసీ(సరిహద్దు వాస్తవాధీన రేఖ) వరకు భారత్ తన సార్వభౌమత్వానికి, సమగ్రతకు కట్టుబడి ఉన్నదని, ఎట్టిపరిస్థితుల్లో సరిహద్దులో మార్పులను సహించదని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. పాకిస్తాన్‌ను పరోక్షంగా ఉటంకిస్తూ తీవ్రవాదాన్నైనా, చైనాను పరోక్షంగా ప్రస్తావిస్తూ విస్తరణవాదాన్నైనా భారత్ సమర్థంగా తిప్పికొడుతుందని అన్నారు.
ప్రపంచమంతా కరోనాతో కకావికలమవుతుంటే విస్తరణవాదానికి కొన్ని దేశాలూ పూనుకుంటున్నాయని తెలిపారు. దేశ సార్వభౌమత్వంపై ఎల్ఏసీ, ఎల్‌వోసీల నుంచి కన్నేసినా వారి భాషలోనే భారత సైనికులు జవాబు చెబుతారని స్పష్టం చేశారు. దేశ సార్వభౌమత్వం, సమగ్రతను కాపాడటానికి దేశ పౌరులందరూ బలంగా తీర్మానం తీసుకుని ఉన్నారని అన్నారు. లడాఖ్‌లో భారత వీర జవాన్ల సాహసాన్ని యావత్ ప్రపంచం చూసిందని తెలిపారు.
జమ్ము కశ్మీర్‌లో ఎన్నికలు
జమ్ము కశ్మీర్ విభజన ప్రక్రియ పూర్తయ్యాక అక్కడ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తామని ప్రధాని మోడీ ప్రకటించారు. జమ్ము కశ్మీర్‌కు సొంత ముఖ్యమంత్రి ఉంటారని, ఈ నిర్ణయానికి తాము కట్టుబడి ఉన్నామని వివరించారు. జమ్ము కశ్మీర్ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజిస్తూ తీసుకున్న నిర్ణయానికి ఏడాది నిండిన సంగతి తెలిసిందే. గడిచిన ఏడాదిని పేర్కొంటూ జమ్ము కశ్మీర్ అభివృద్ధికి, మహిళలు, దళితుల హక్కులు, శరణార్థుల ఆత్మగౌరవానికి ప్రతీకగా ఏడాది కాలం సాగిందని అన్నారు. గతేడాది ఆగస్టు 5న జమ్ము కశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి కల్పించే అధికరణం 370ని నిర్వీర్యం చేసిన సంగతి తెలిసిందే.
5 కోట్ల మంది మహిళలు రూపాయికే శానిటరీ ప్యాడ్లు పొందారు
పేదలు, మహిళల ఆరోగ్యంపై తమ ప్రభుత్వం జాగ్రత్తగానే వ్యవహరిస్తున్నదని వివరించారు. సుమారు ఆరు వేల జనఔషధీ సెంటర్ల ద్వారా దాదాపు ఐదు కోట్ల మంది మహిళలు శానిటరీ ప్యాడ్లు పొందారని ఈ సందర్భంగా తెలిపారు. మహిళలకు కనీస వివాహ వయసు నిర్ధారణకు ఓ కమిటీని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ కమిటీ నివేదిక సమర్పించిన తర్వాత సరైన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
మహిళల్లో పౌష్టికాహారలోపానికి పరిష్కారాలను ఈ కమిటీ సూచించనుందని వివరించారు. మహిళలకు ఉపాధి, స్వయం ఉపాధి కల్పించడానికి నిశ్చయించుకున్నదని ప్రధాని వివరించారు. శానిటరీ న్యాప్కిన్లపై ప్రధాని మోడీ బహిరంగంగా ఎర్రకోట నుంచి మాట్లాడటంపై పౌరులు సోషల్ మీడియాలో ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇన్నాళ్లు బ్లీడింగ్‌పై అప్రకటిత రహస్యాన్ని పాటించిన సమాజం ఇకనైనా హుందాగా వ్యవహరించడం నేర్చుకోవాలని నెటిజన్లు కామెంట్లు చేశారు.
1000 రోజుల్లో ఆరులక్షల గ్రామాలకు ఆప్టికల్ ఫైబర్
గ్రామాలకు టెక్నాలజీని తీసుకెళ్లడంలో సర్కారు కృషి చేస్తున్నదని ప్రధాని వివరించారు. 1000 రోజుల్లో ఆరు లక్షల గ్రామాలకు ఫైబర్ నెట్‌వర్క్‌ను విస్తరిస్తామని ప్రకటించారు. ఇదే కాలంలో లక్షదీవుల్లోనూ హైస్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెస్తామని తెలిపారు. జల్‌జీవన్ మిషన్ కింద ఒక లక్ష కుటుంబాలకు తాగు నీటి సదుపాయం కల్పించామని, ఏడు కోట్ల పేద కుటుంబాలకు ఉచిత గ్యాస్ సిలిండర్లను అందించామని వివరించారు. 80 కోట్లమందికి ఉచితంగా ఆహార ధాన్యాలను పంపిణీ చేశామని వివరించారు.