ఛాలెంజ్ విసిరిన సామాన్యుడు.. గవర్నర్ నోటా ఆ మాట

by Anukaran |
ఛాలెంజ్ విసిరిన సామాన్యుడు.. గవర్నర్ నోటా ఆ మాట
X

దిశ, న్యూస్ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం ఆరో విడత హరితహారం జోరుగా నడిపిస్తోంది. అయితే ఓ సామాన్యుడు కూడా మొక్కలు నాటాలని పిలుపునిచ్చాడు. కానీ, తన సామాజిక వర్గమంతా ఆర్థిక వనరులను పెంచుకోవడానికి అవసరమైన మొక్కలను నాటాలని కోరాడు. టి.కంఠ పేరిట (తెలంగాణ కంఠమయ్య ఈత అండ్ టాడీ హారం) ఛాలెంజ్ కు రూపకల్పన చేశాడు. అయితే సామాజిక మాధ్యమాల ద్వారానే ఈ అంశంపై తన మనోగతాన్ని పంచుకున్నాడు. కానీ అద్భుతమైన ఫలితాలు రావడం విశేషం. ఐదు రోజుల్లో ఏకంగా 2.50 లక్షల ఈత, తాటి మొక్కలను నాటేందుకు ముందుకొచ్చారు. వరంగల్ జిల్లాకు చెందిన ఆర్.ప్రసాద్ గౌడ్ దీని రూపకర్త. ఈ నెల 21 నుంచి ఆరంభించారు. తొలుత గౌడ సంఘాలు, నీరా ఉత్పత్తిదారులకు ఛాలెంజ్ విసిరారు. తనతో మొదలైన ఈ ఛాలెంజ్ ను కొనసాగిస్తున్నారు.

‘‘ఇప్పుడున్న చెట్లను కాపాడుకోవాలి. మరిన్నిచెట్లను పెంచాలి. శాస్త్రవేత్తలు నీరా పానీయం ఎక్కువ కాలం పాడవకుండా పరిశోధనలు చేయాలి.’’ వ్యవసాయ యూనివర్సిటీలో తెలంగాణ గవర్నర్ డా.తమిళిసై సౌందర్ రాజన్ అన్న మాటలివి. తాటి, ఈత చెట్ల ద్వారా తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో కుటీర పరిశ్రమలుగా విలసిల్లుతున్నాయి. ఎంతో మంది ఉపాధి పొందుతున్నారు. తాటి చెట్టును తమిళనాడు రాష్ట్ర అధికారిక చెట్టుగా ప్రకటించింది. అలాగే ఈ చెట్లను తరతరాలుగా మన పూర్వీకులు ఓ కల్పవృక్షంగా భావించారు. ఈ చెట్టులోని ప్రతి భాగం ఎన్నో రకాలుగా సమాజానికి ఉపయోగపడుతుంది. అలాంటి చెట్లనే హరితహారం కింద పెట్టాలని ప్రసాద్ గౌడ్ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. దాంతో వందలాది మంది స్పందించారు. తాము నాటుతామని, విస్తృతంగా ప్రచారం కల్పిస్తామని పోస్టు చేస్తున్నారు. తెలిసిన వారికి మొక్కలు నాటాలంటూ ఛాలెంజ్ విసురుతున్నారు. ఇదంతా ఫోన్ చేసి వాళ్లకు చెబుతుండడంతో అనివార్యంగానే ఈత చెట్లను నాటేందుకు ముందుకొస్తున్నారు. ఇదేదో ఒకటీ రెండు జిల్లాలకు పరిమితం కాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఊపందుకున్నది.

టి.కంఠ ఛాలెంజ్ మొక్కల వివరాలు
సొంత భూమిలో నాటేందుకు
సిద్ధమైన ఈత మొక్కలు – నాటినవి

21న … 12,820- 1,750
22న .. 1,650- 1,500
23న .. 5,100- 1,100
24న.. 4,530- 1,200
25న.. 4,200- 1,050
26న.. 4,800- 1,090
27న.. 4,650- 1,330

ప్రభుత్వ భూమిలో నాటేందుకు సిద్ధంగా ఉన్న ఈత మొక్కలు : 2.50 లక్షలు
నాటిన మొక్కలు : 6,800

– ఛాలెంజ్ ద్వారా ఒక్కొక్కరు ఎన్నేసి మొక్కలను ఎన్ని ఎకరాల్లో నాటుతారో, నాటారో అన్న విషయాలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. కొందరు నాటిన మొక్కలను ఫొటోలు తీసి పెట్టారు. సామాన్యుడి పిలుపునకు నాటిన మొక్కల సంఖ్య లక్షలకు చేరడం విశేషం. అయితే మొక్కలు నాటేందుకు ఉపాధి హామీ పథకం కిందనే గుంతలు తీయించే వ్యవస్థ ప్రభుత్వం కల్పించింది. దాని వల్ల డబ్బులు ఖర్చయ్యే అవకాశం లేదు. కేవలం స్థలాన్ని ఎంచుకుంటే ఎక్సైజ్ శాఖనే మొక్కలను సప్లయ్ చేస్తోంది.

గౌడల్లో చైతన్యం కోసమే: ఆర్.ప్రసాద్ గౌడ్

నేను టి.కంఠ ఛాలెంజ్ను రూపొందించినప్పుడు ఇంతగా స్పందన లభిస్తుందని ఊహించలేదు. తొలుత గౌడ సంఘాలు, ట్రస్టుల నిర్వాహకులకే ఛాలెంజ్ విసిరా. ఆ తర్వాత సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం వచ్చింది. మొక్కలు కావాలని అడగ్గానే అధికారులు వారికి సప్లయి చేస్తున్నారు. హరితహారంలో మొక్కలు నాటాలి. కానీ ఆర్థిక వనరుగా ఎదిగే చెట్ల పెంపకం ద్వారా రెట్టింపు లాభాలను పొందొచ్చునని ప్రతి ఒక్కరూ గుర్తించాలి.

Advertisement

Next Story

Most Viewed