కరోనాపై ఫేక్ న్యూసా? పీఐబీకి ఫిర్యాదు చేయండిలా!

by  |
కరోనాపై ఫేక్ న్యూసా? పీఐబీకి ఫిర్యాదు చేయండిలా!
X

దిశ వెబ్ డెస్క్: కరోనా వైరస్ అసత్య ప్రచారాలు చేస్తే కఠినచర్యలు తీసుకుంటామని ప్రభుత్వాలు, పోలీసులు ఎన్ని హెచ్చరికలు చేసినా కొందరు మాత్రం వాటిని పట్టించుకోవడం లేదు. వైరస్ కంటే ఈ వదంతులే ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నాయి. ఇలాంటి పుకార్లు ప్రజల్ని భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ కు మాత్రమే కాకుండా కరోనాకు సంబంధించిన అబద్ధపు ప్రచారాన్ని నిరోధించడానికి ముందుకు రావాలని ప్రభుత్వరంగ సంస్థ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) నెటిజన్లకు విజ్ఞప్తి చేసింది. కరోనా వైరస్ కు సంబంధించిన అవాస్తవాలను సోషల్ మీడియాలో గమనిస్తే తమకు తెలియజేయాలని సంస్థ యూజర్లను కోరింది.

సోషల్ మీడియా నిండా ఫేక్ న్యూస్ లే వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు కూడా అనవసరంగా ఫార్వార్డ్ చేయకుండా వచ్చిన సమాచారంలో నిజమెంత ఉందో తెలుసుకునే ప్రయత్నం చేయాలని పోలీసులుతో పాటు, ప్రభుత్వాలు సూచిస్తున్నాయి.

తమిళనాడులో: కొన్ని రోజుల క్రితం తిరుత్తణిలో బైక్‌ మెకానిక్ గా పనిచేసే ఓ యువకుడు.. వాట్సాప్ ద్వారా వదంతులు వ్యాప్తి చేశాడు. తిరుత్తణిలో కరోనా వైరస్‌ ఎక్కువగా ఉందని, ఇప్పటికే ఎంతోమందికి కరోనా సోకిందనే సమాచారాన్ని వాట్సాప్ గ్రూపుల్లో ఫార్వార్డ్ చేశాడు. దీన్ని గమనించిన పోలీసులు ఆ యువకుణ్ణి అరెస్టు చేశారు. ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ సీరియస్‌గా తీసుకోవడంతో పాటు, ఆయన ఆదేశాల మేరకు పోలీసులు విచారణ చేపట్టారు.

ఒడిషాలోనూ: కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో వదంతులను వ్యాప్తి చేస్తున్న ఓ మహిళ సహా ముగ్గురిపై ఒడిశా పోలీసులు కేసు నమోదు చేశారు. ఒడిశా రాష్ట్రంలోని భద్రాక్ పట్ణణంలో ఓ మహిళతో సహా ముగ్గురు కరోనాపై ప్రజల్లో భయాందోళనలు రేపేలా వదంతులు వ్యాప్తి చేయడంతో పోలీసులు వారిపై కఠిన చర్యలు తీసుకున్నారు.

ఈ నెంబర్ కు ఫిర్యాదు చేయండి:

కరోనా వైరస్ మహామ్మారి ప్రపంచానికే ప్రమాదంగా మారిందని, ఈ నేపథ్యంలో తప్పుడు సమాచారానికి, అబద్ధపు వార్తలకు సోషల్ మీడియా వేదదిక కారాదని ప్రభుత్వం ఇటీవలే మార్గదర్శకాలు జారీ చేసింది. కాగా ఈ విధమైన సమాచారాన్ని తమ ప్లాట్ ఫాం ల నుంచి తొలగించాలని, వాస్తవ సమాచారాన్ని మాత్రమే ఉంచాలని సోషల్ మీడియా సంస్థలకు సూచించింది. తప్పుడు సమాచారం ఎవరైనా పెడితే.. ఆ వార్త స్క్రీన్ షాట్ లేదా లింక్ ను 8799711259 అనే వాట్సాప్ నెంబర్ కు లేదా.. [email protected] మెయిల్ ఐడీకీ పంపించాలని పీఐబీ తెలిపింది.

Tags : corona virus, social media, corona fake news, pib, police department

Next Story