జడేజా గాయం..టీం ఇండియా రూల్స్ బ్రేక్ చేసిందా?

by Shyam |   ( Updated:2020-12-05 04:04:59.0  )
జడేజా గాయం..టీం ఇండియా రూల్స్ బ్రేక్ చేసిందా?
X

దిశ, స్పోర్ట్స్ : ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20లో టీమ్ ఇండియా 11 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అజేయంగా 44 పరుగులు చేయడంతో భారత జట్టు పోరాడదగిన స్కోర్ చేసింది. అయితే మిచెల్ స్టార్క్ వేసిన షార్ట్ పిచ్ బంతి రవీంద్ర జడేజా హెల్మెట్‌కు బలంగా తగలడంతో రెండో ఇన్నింగ్స్‌లో అతడి బదులు యజువేంద్ర చాహల్ బరిలోకి దిగాడు. కాగా, దెబ్బ తగిలిన వెంటనే జడేజా మరో నాలుగు బంతులు బ్యాటింగ్ చేయడం, టీమ్ ఇండియా ఫిజియో అసలు జడేజాను పరిశీలించడానికి మైదానంలోకి రాకపోవడంపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

జడేజాకు దెబ్బ తగిలితే టీమ్ ఇండియా ఫిజియో నితిన్ పటేల్ వెంటనే అతడి దగ్గరకు ఎందుకు వెళ్లలేదని వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ ప్రశ్నిస్తున్నాడు. సాధారణంగా దెబ్బతగిలితే ఫిజియో మైదానంలోకి వెళ్లి గాయపడిని ఆటగాడి స్థితిని వెంటనే పరిశీలిస్తారు. కానీ నితిన్ పటేల్ అలా ఎందుకు చేయలేదు. కంకషన్ సబ్‌స్టిట్యూట్‌ను తీసుకోవాలంటే ఈ ప్రోటోకాల్ పాటించాలి కదా అని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ టామ్ మూడీ కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నాడు.

ఎలాంటి ఇబ్బంది పడకుండా చివరి నాలుగు బంతులు ఆడిన రవీంద్ర జడేజా చివరకు రెండో ఇన్నింగ్స్‌లో కంకషన్‌ను కోరడంపై విమర్శలు చెలరేగుతున్నాయి. మ్యాచ్ రిఫరీ డేవిడ్ బూన్ కూడా బీసీసీఐ మెడికల్ టీమ్ ఇచ్చిన సమాచారంతో కంకషన్‌ను అనుమతించారు. అయితే ప్రోటోకాల్‌ను అనుసరించకుండా టీమ్ ఇండియా తప్పు చేసిందని విశ్లేషకులు భావిస్తున్నారు.

మరోవైపు శనివారం రవీంద్ర జడేజాకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఇప్పటికే మిగిలిన రెండు టీ20లకు రవీంద్ర జడేజాను పక్కన పెట్టారు. అతడి స్థానంలో శార్దుల్ ఠాకూర్‌ను తీసుకున్నారు.

Advertisement

Next Story