షాకింగ్.. మ్యాథ్స్‌ ఎగ్జామ్‌ రోజు ఫిజిక్స్ క్వశ్చన్ పేపర్.. ఎక్కడంటే..?

by Shyam |
10th class exams
X

దిశ, కాటారం: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సంగ్రహణాత్మక మూల్యాంకనం-1 పదో తరగతి ఇంగ్లీష్ మీడియం పరీక్షల్లో ఘోర తప్పిదం జరిగింది. ఫలితంగా మంగళవారం ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకు పరీక్షలు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. పూర్తి వివరాల్లోకి వెళితే.. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని అన్ని మండలాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు స్కూల్స్‌లో మ్యాథ్స్(E/M) ఎగ్జామ్ జరగాల్సి ఉంది. కానీ, జిల్లా ఉమ్మడి పరీక్షల బోర్డు పంపిన ప్రశ్నపత్రాల్లో మ్యాథ్స్‌కు బదులు ఫిజిక్స్ పేపర్ బయటకొచ్చింది. దీంతో టీచర్లందరూ ఒక్క సారిగా షాక్ అయ్యారు.

వెంటనే ఈ సమాచారాన్ని ఉమ్మడి పరీక్షల బోర్డు చైర్మన్‌కు వివరించారు. పొరపాటును గ్రహించిన అధికారులు కొందరికి ఈమెయిల్ ద్వారా, సమీపంలో ఉన్న పాఠశాలలకు నేరుగా ప్రశ్నాపత్రాలను పంపిణీ చేశారు. ఇదిలా ఉంటే ఫిజిక్స్ పేపర్ ముందుగానే లీక్ కావడంతో.. మరొక ఫిజిక్స్ పేపర్ రెడీ చేస్తారా.. లేదా అదే క్వశ్చన్‌ పేపర్‌ ఉంచుతారా అనేది తెలియాల్సి ఉంది. కాగా, కరోనా కారణంగా గత రెండేళ్లుగా విద్యార్థులకు ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహించలేదు. ఇప్పుడు సజావుగా జరుగుతున్న పాఠశాలల్లో తొలి పరీక్షల్లోనే బోర్డు నిర్లక్ష్యం బట్టబయలు కావడం చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Next Story