కార్డు కోసం ప్రజల ప'రేషన్'

by  |
కార్డు కోసం ప్రజల పరేషన్
X

ఆహార భద్రత కార్డుల కోసం నిరుపేదలు ఏళ్ల తరబడి కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. రెండేళ్లుగా హైదరాబాద్ జిల్లాలోనే దాదాపు లక్ష దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. కరోనా లాక్‌డౌన్ కారణంగా ఆర్థిక వ్యవస్థ కుదేలైన నేపథ్యంలో ప్రభుత్వం బీపీఎల్ కుటుంబాలకు ఆర్థిక సాయంతో పాటు ఉచితంగా నిత్యావసర సరుకులను పంపిణీ చేసింది. వాటిని పొందేందుకు రేషన్ కార్డు తప్పనిసరి కావడంతో అనేక మంది పేదలు సాయాన్ని పొందలేక పోయారు. ప్రస్తుతం లాక్‌డౌన్ నిబంధనలు సడలించడంతో ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు ప్రారంభమయ్యాయి. దీంతో ఆహార భద్రత కార్డు (రేషన్ కార్డు) కోసం ఆన్‌లైన్‌లో అప్లయ్ చేసిన దరఖాస్తుదారులు ఒక్కసారిగా సివిల్ సప్లయ్ కార్యాలయాల బాట పడుతున్నారు. పెండింగ్ దరఖాస్తులను మంజూరు చేయాలని కోరుతున్నారు.

దిశ, హైదరాబాద్: సికింద్రాబాద్‌కు చెందిన హనీఫ్ కుటుంబంలో నలుగురు సభ్యులు ఉంటారు. ఇతని కార్డులోని నలుగురు సభ్యుల పేర్లు జంప్ అయ్యాయి. కానీ, ఈ పేర్లన్నీ వీళ్ల అన్నయ్య కార్డులో కన్పిస్తున్నాయి. దీంతో హనీఫ్‌కు రేషన్ కార్డు ఉన్నా.. కుటుంబ సభ్యుల పేర్లు లేకపోవడంతో బియ్యం, ఇతర నిత్యావసరాలు రేషన్ దుకాణం నుంచి పొందలేక పోతున్నాడు. అంబర్ పేటకు చెందిన ఓ కార్డుదారుడు స్వయం ఉపాధి కోసం కారు కొనుగోలు చేసుకున్నాడు. తనకున్నఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా కారును అమ్ముకోవాల్సి వచ్చింది. కానీ, విచారణ సమయంలో ఫోర్ వీలర్ వెహికిల్ ఉందంటూ కార్డును తొలగించారు. దీంతో సదరు కార్డుదారుడు బీపీఎల్ కుటుంబాలకు ప్రభుత్వం అందించే పథకాలకు అనర్హుడుగా మారాల్సి వచ్చింది. ఇలా విచారణ సమయంలో రకరకాల కొర్రీలతో వేలాదిమంది కార్డుదారులు తమ కార్డులను పోగొట్టుకోవాల్సి వచ్చింది. అకారణంగా తమ కార్డులను రద్దు చేశారంటూ, తిరిగి మా కార్డులను పునరుద్ధరించాలని కార్డుదారులు కోరుతున్నారు. ఈ తరహా బాధితులతో పాటు అనేక మంది నిరుపేదలు ఆహార భద్రత కార్డులు మంజూరు చేయాలని సివిల్ సప్లయ్ అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు.

ఆన్‌లైన్‌లో 96,535 మంది అప్లయ్..

హైదరాబాద్ జిల్లా పౌర సరఫరాల శాఖ పరిధిలో 9 సర్కిల్ కార్యాలయాలు ఉన్నాయి. మొత్తం 674 రేషన్ దుకాణాలు ఉన్నాయి. వీటి పరిధిలో ఇప్పటికే 5.80 లక్షల కార్డుదారులు ఉన్నారు. ప్రస్తుతం రేషన్ కార్డుకు దరఖాస్తు చేయాలంటే కేవలం ఆన్‌లైన్ (మీ సేవ)లో మాత్రమే చేయాల్సి ఉంటుంది. హైదరాబాద్ జిల్లా పరిధిలో 2017 మే 20 నుంచి ఇప్పటి (2020 మే 21 నాటి ఆన్‌లైన్ సమాచారం మేరకు) వరకు సుమారు 96,535 మంది రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేశారు. అలాగే తమ కార్డులను ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాద్ నగరానికి లేదా నగరంలోనే ఒక సర్కిల్ నుంచి మరో సర్కిల్‌కు మార్చాలని కోరుతూ దాదాపు 40 వేల దరఖాస్తులు వచ్చాయి. కొత్త కార్డు కోసం చేసిన దరఖాస్తుల్లో సుమారు 51 వేలు, మ్యుటేషన్ పద్ధతిలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల్లో సుమారు 25 వేలకు పైగా దరఖాస్తులు విచారణ నిమిత్తం సర్కిల్ కార్యాలయంలోని ఇన్‌స్పెక్టర్ స్థాయిలోనే పెండింగ్‌లో ఉన్నాయి. అయితే, మార్చి 22 నుంచి ప్రభుత్వ కార్యాలయాల్లో ఎలాంటి సాధారణ కార్యాకలాపాలేవీ నిర్వహించనందున వేలకు వేలు దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ విషయంపై జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి పద్మను వివరణ కోరగా.. ఆన్‌లైన్ దరఖాస్తులు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయని తెలిపారు. లాక్‌డౌన్ కారణంగా పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఈ పెండింగ్ దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి సారించి అన్నింటినీ క్లియర్ చేస్తామన్నారు.


Next Story