- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మాస్కులకు ‘మస్కా’..! వారితో థర్డ్ వేవ్ తప్పదా..?
దిశ, తెలంగాణ బ్యూరో : కరోనా వ్యాప్తి చెందకుండా మాస్కు వేసుకోవాల్సిన జనాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. బహిరంగ ప్రదేశాలు, కార్యాలయాలు, జనసమర్ధ ప్రాంతాల్లోనూ ధరించడం లేదు. ఓ సారి కొవిడ్ వచ్చిపోతే మళ్లీ రాదనే అపోహలతో కొందరు, వ్యాక్సిన్ వేసుకున్నామని మరి కొందరు మాస్కును ధరించడం లేదు. ఇంకొందరైతే వైరస్ తీవ్రత పూర్తిగా కనుమరుగైందనే భ్రమలో మాస్కులను పట్టించుకోవడం లేదు. ఫలితంగా మూడో వేవ్ ముప్పు వాటిల్లే ప్రమాదం ఉన్నదని పబ్లిక్ హెల్త్ ఎక్స్ పర్ట్స్ హెచ్చరిస్తున్నారు.
రెండు కరోనా వేవ్‌ల పరిస్థితులను గమనించిన ప్రజలకు మాస్కు ప్రాధాన్యత ఇప్పటికీ అర్థం కాకపోవడం ఆందోళన కలిగించే అంశం. దీంతో పాటు భౌతిక దూరం అనే ముచ్చటే మరిచారు. మార్కెట్లు, షాపింగ్ మాల్స్, హోటళ్లు, పబ్‌లు, పార్కులలో ప్రజలు గుంపులు గుంపులుగా తిరుగుతున్నారు. వైరస్ వ్యాప్తి జరగకుండా కొవిడ్ నిబంధనలు పాటించాల్సిన ప్రజలు బాధ్యతను మరిచి ప్రవర్తిస్తున్నారు. ఇది చాలా ప్రమాదానికి దారి తీస్తుందని వైద్యులు సూచిస్తున్నారు. అయితే అవగాహన కల్పించాల్సిన అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
మాస్క్ మస్ట్.. అమలు ఏదీ?
కరోనా వ్యాప్తి పెరగకుండా ప్రభుత్వం గతంలో ‘మాస్కు మస్టు ’అనే నిబంధనను తీసుకువచ్చింది. పబ్లిక్ ప్లేసేస్, షాపింల్ మాల్స్, తదితర జనసమర్ధ ప్రదేశాల్లో మాస్కును తప్పనిసరిగా ధరించాలని సీఎస్ సోమేష్ కుమార్ ఉత్తర్వులు ఇచ్చారు. దీన్ని సమర్ధవంతంగా అమలు చేయాల్సిన బాధ్యతను పోలీస్, డిజాస్టర్ మేనేజ్ మెంట్లకు అప్పగించారు. మాస్కు ధరించని ప్రతి ఒక్కరికి రూ.1000 ల జరిమానాను విధించాలన్నారు. అది ఏ స్థాయి వ్యక్తి అయినా సరే మాస్కు ఫైన్ వేయాల్సిందేని సీఎస్ తేల్చి చెప్పారు.
కానీ ఇటు పోలీసు, అటు డిజాస్టర్ మేనేజ్ మెంట్ లు మాస్కు నిబంధనపై నామమాత్రపు చర్యలు తీసుకుంటున్నారనే విషయం స్పష్టంగా కనిపిస్తోంది. గుర్తుకు వచ్చినప్పుడు డ్రైవ్‌లు చేపట్టి ఫైన్లు వేస్తున్నారే తప్పా, రోడ్లపై మాస్కు లేకుండా వచ్చే ప్రతీ వ్యక్తికి జరిమానాలు వేయడం లేదు. మాస్కు మస్ట్ ఉత్తర్వులు వచ్చిన కొన్నాళ్లు రూల్స్ సక్రమంగా అమలైనా, ఆ తర్వాత మాత్రం వాటిని ప్రజలతో పాటు అధికారులు సైతం గాలికి వదిలేశారు. చేసేదేమీ లేక సర్కార్ కూడా చోద్యం చూస్తున్నది.
అవగాహన ఏదీ?
కరోనా రూల్స్‌పై అవగాహన కల్పించాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదు. పెళ్లిళ్లు, ఫంక్షన్లు, పండుగలు, పార్టీలు, తదితర కార్యక్రమాల్లో ప్రజలు గ్రూప్ గేదర్స్ అవుతున్నా, ఆఫీసర్లు నిమ్మకు నిరేత్తనట్టు వ్యవహరిస్తున్నారు. వైరస్ నియంత్రణకు కృషి చేయాల్సిన ప్రభుత్వ సిబ్బంది తమకేమీ సంబంధం లేనట్టు సైలెంట్‌గా ఉంటున్నది. బాధ్యత మరిచిన ప్రజల్లో విస్తృతంగా చైతన్యం తేవాల్సింది పోయి చూస్తూ ఊరుకుంటున్నది. ఇది చాలా ప్రమాదరకమైన పరిస్థితి అని నిపుణులు తేల్చి చెబుతున్నారు.
సభలు, సమావేశాలతో రాదా..?
రాజకీయ పార్టీలు నిర్వహించే సభలు, సమావేశాల్లో సుమారు 95 శాతం మంది మాస్కు, భౌతికదూరం, శానిటేషన్ వంటి కరోనా నిబంధనలు పాటించడం లేదు. దీంతో వైరస్ వ్యాప్తి పెరిగే ప్రమాదం ఉన్నది. ప్రజలకు ఆదర్శంగా నిలవాల్సిన నేతలే రూల్స్ బ్రేక్ చేస్తున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నిక ప్రచారాలు, జైత్రయాత్రలు పేరిట నిర్వహించే రోడ్ షోలు మరింత ముప్పుగా మారే అవకాశం ఉన్నది. అంతేగాక రెండు రోజుల క్రిందట ట్యాంక్ బండ్ పై వాహనాలను బంద్ పెట్టి మరి సందర్శకులకు అవకాశం కల్పించారు. ఆదివారం కావడంతో ప్రజలు భారీ ఎత్తున వచ్చారు. వీరిలో కూడా సుమారు 85 శాతం మంది మాస్కులు వేసుకోలేదు. అధికారులు చోద్యం చూశారే తప్పా, అవగాహన కల్పించాలనే ఆలోచనని మరిచారు. దీంతో థర్డ్ వేవ్ ముప్పు వచ్చే ప్రమాదం ఉన్నదని డాక్టర్లు అంటున్నారు.
ఇప్పటికే హుజూరాబాద్‌లో వైరస్ వ్యాప్తి పెరిగిందని స్వయంగా వైద్యారోగ్యశాఖ, ప్రభుత్వం మధ్య అంతర్గతమైన చర్చ నడుస్తున్నప్పటికీ, నివారణ చర్యలు తీసుకోవడం లేదు. జనసంద్రత అత్యధికంగా ఉన్న హైదరాబాద్ లో కూడా అదే పరిస్థితి. వివిధ రాజకీయ పార్టీలు విస్తృతంగా రోడ్ షోలు, సమావేశాలు నిర్వహిస్తున్నాయి. అంతేగాక అభివృద్ధి కార్యక్రమాలు పేరిట అధికారులు కూడా వేలాది మందిని జమ చేస్తున్నారు. కానీ ఇటు ప్రభుత్వం నుంచి కానీ, వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి సూచనలు లేకపోవడం గమనార్హం.
ప్రజలు బాధ్యతగా వ్యవహరించాలి..
రెండేళ్ల నుంచి కరోనా నిబంధనలు పాటించాలని ప్రభుత్వం సూచిస్తున్నది. వైద్యారోగ్యశాఖ కూడా అనేక మార్లు మీడియా వేదికగా అవగాహన కల్పిస్తున్నది. కానీ ప్రజలు బాధ్యత మరిచి రూల్స్ బ్రేక్ చేయడం మంచిది కాదు. అంతేగాక రాజకీయ పార్టీలు కూడా కరోనా నిబంధనలు పాటిస్తూ పరిమితులకు లోబడి కార్యక్రమాలు నిర్వహించుకోవాలి. లేదంటే మరో ప్రమాదాన్ని చవిచూడాల్సి వస్తుంది. ముఖ్యంగా చిన్నారుల రక్షణ దృష్ట్యా బయట తిరిగే పెద్దలు అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలి.
-డాక్టర్ పుట్ల శ్రీనివాస్, ప్రభుత్వ వైద్యుల సంఘం అధ్యక్షుడు