జనం రిలాక్స్.. తీరిగ్గా బయటకు

by Shyam |   ( Updated:2021-06-02 11:46:25.0  )
జనం రిలాక్స్.. తీరిగ్గా బయటకు
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో ప్రజల ఉరుకులు, పరుగులకు బ్రేక్ పడింది. కొద్దిరోజులుగా లాక్ డౌన్ లో భాగంగా ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే సడలింపులు కల్పించడంతో ప్రజలంతా తమ పనులు చేసుకునేందుకు హడావుడిగా బయటకు వెళ్లారు. అయితే ప్రభుత్వ తాజా నిర్ణయంతో జనం కాస్త రిలాక్స్ అయ్యారు. దీంతో దాదాపు అన్ని షాపుల వద్ద రద్దీ తగ్గింది. గిరాకీ కూడా అంతంతమాత్రంగానే వస్తున్నట్లు షాపుల నిర్వాహకులు చెబుతున్నారు. ప్రభుత్వం ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు సడలింపులు ఇచ్చిన సమయంలో తక్కువ టైం ఉండటంతో భయానికి ప్రజలు వచ్చి భారీగా కొనుగోళ్లు చేసినట్లు వ్యాపారులు వెల్లడిస్తున్నారు. ఇప్పుడు సడలింపు సమయం పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో జనాలు తక్కువగా వస్తుండటంతో గిరాకీ తగ్గిందని వాపోతున్నారు. ఏది ఏమైనప్పటికీ ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు సడలింపులు ఇచ్చినప్పుడే వ్యాపారం బాగుందని చెప్పడం గమనార్హం.

వైన్స్ కూ తగ్గిన రద్దీ

రాష్ట్ర ప్రభుత్వం కొద్దిరోజులుగా లాక్ డౌన్ లో భాగంగా ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు అన్ని కార్యకలాపాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఆదివారం కేబినెట్ భేటీ అనంతరం ఉదయం 6 గంటలను మధ్యాహ్నం 1 గంటల వరకు సడలింపులు ఇస్తూ తెలంగాణ సర్కార్ ప్రకటించింది. దీంతో వైన్స్ కు సైతం రద్దీ తగ్గింది. మధ్యాహ్నం వరకు సమయం ఉండటంతో మందుబాబులు తీరికగా షాపులకు వచ్చి కొనుగోళ్లు చేపడుతున్నారు. ఇన్నిరోజులు ఉదయం 10 గంటల వరకు సడలింపులు ఉండగా ఆ సమయంలో జరిగిన బిజినెస్సే మధ్యాహ్నం 1 గంటల వరకు జరుగుతోందంటున్నారు నిర్వాహకులు.

చికెన్ సెంటర్ల పరిస్థితీ అంతంతే..

సడలింపు సమయం పెంచినా చికెన్ షాపుల పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉందని నిర్వాహకులు వెల్లడిస్తున్నారు. ఆదివారం మినహాయిస్తే మిగిలిన రోజుల్లో వ్యాపారం తక్కువగానే ఉందంటున్నారు. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు సడలింపులు ఇచ్చిన సమయంలో మాత్రం ప్రతిరోజూ జనంతో షాపులు రద్దీగా ఉండేవని నిర్వాహకులు చెబుతున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు సమయం ఉండటంతో కొందరు తీరికగా బయటకు రావడంతో బిజినెస్ దెబ్బతిందంటున్నారు. అంతేకాకుండా మధ్యాహ్నం వరకు కావడంతో ఎండలకు కూడా భయపడి కొందరు బయటకు రాక వ్యాపారం చాలా తక్కువగా జరుగుతోందని నిర్వాహకులు చెబుతున్నారు.

గతంలో భారీగా జనం

ఉదయం 10 గంటల వరకు సడలింపులు ఉన్న సమయంలో అన్ని మార్కెట్లు కళకళలాడాయి. భారీగా జనం వచ్చి కొనుగోళ్లు జరిపారు. కూరగాయల షాపుల వద్ద కూడా విపరీతమైన రద్దీ కనిపించింది. కానీ మధ్యాహ్నం 1 గంటల వరకు సమయం ఇవ్వడంతో మార్కెట్లు కళతప్పాయి. సమయం చాలా ఉందని జనం బయటకు రావడం లేదు. గతంలో అవసరానికి మించి కూరగాయలు, నిత్యావసర సరుకులను కొనుగోలు చేసి తీసుకెళ్లిన ప్రజలు.. ఇప్పుడు అతి తక్కువ మొత్తంలో కొనుగోలు చేస్తున్నారు. కిరాణా షాపుల్లోనూ గతంలో రద్దీ ఎక్కువగా కనిపించింది. కానీ ఇప్పుడా పరిస్థితి దాదాపు ఎక్కడా కనిపించడం లేదు. పొలిమేరాస్, పొదరిల్లు వంటి కూరగాయల షాపుల్లో అయితే జనం ఎగబడి వచ్చారు. అయితే ప్రస్తుతం మాత్రం తక్కువ సంఖ్యలో వచ్చి కొనుగోళ్లు చేస్తుండటంతో బిజినెస్ డల్ గా ఉందని నిర్వాహకులు చెబుతున్నారు. సాధారణ సమయాల్లో పొలిమేరాస్ షాపులో రోజుకు రూ.ఒక లక్షకు పైమాటే ఉండేది. ఉదయం 10 గంటల వరకు సడలింపులు ఇచ్చిన సమయంలో ఇది అమాంతం పెరిగింది. అవసరం లేకున్నా ప్రజలు కనీసం వారానికి పైగా సరిపడ కూరగాయలు కొనుగోలు చేశారు. ఇప్పుడు మధ్యాహ్నం 1 వరకు సమయం ఉండటంతో చాలా బిజినెస్ తగ్గిందని నిర్వాహకులు చెబుతున్నారు.

హోటళ్లలోనూ ఇదే పరిస్థితి

లాక్ డౌన్ కారణంగా హోటళ్లు, టిఫిన్ సెంటర్ల నిర్వాహకులు భారీగా నష్టాలను చవిచూశారు. అయితే ఉదయం 10 గంటల వరకు సడలింపులు ఉన్న సమయంలో టిఫిన్ సెంటర్లకు సాధారణ రోజుల్లో జరిగేంత గిరాకీ ఆ కొద్ది సమయంలోనే జరిగింది. యువకులు, ఉద్యోగులు భోజనం చేసేందుకు భారీగా టిఫిన్ సెంటర్లు, హోటళ్లను ఆశ్రయించారు. మధ్యాహ్నం, రాత్రి కి బయట తినేందుకు కూడా అవకాశం లేకపోవడంతో ఉదయం 10 గంటల వరకు బాగా బిజినెస్ జరిగింది. కానీ ప్రభుత్వం సడలింపును పెంచుతూ తీసుకున్న నిర్ణయంతో నష్టపోయినట్లు చెప్పడం గమనార్హం.

గిరాకీ తగ్గింది

ఉదయం 10 గంటల వరకే సడలింపులు ఉన్నప్పుడు ఎక్కువ మంది హోటల్ కు వచ్చి టిఫిన్ చేసేవారు. కరోనాకు ముందు బిజినెస్ బాగానే ఉండేది. లాక్ డౌన్ కారణంగా పూర్తిగా తగ్గిపోయింది. ఇప్పుడు ప్రభుత్వం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు సడలింపులు కల్పించడంతో రద్దీ తగ్గింది. అప్పటిలాగా ఎవరూ హోటళ్లకు వచ్చి తినేందుకు ఆసక్తి కనబరచడంలేదు.
= రమేశ్, హోటల్ నిర్వాహకుడు. యూసుఫ్ గూడ

Advertisement

Next Story