మనీ రొటేషన్ మాయం

by  |
మనీ రొటేషన్ మాయం
X

‘‘జీడీమెట్లకు చెందిన సంతోష్​ (35) క్యాబ్​ నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. 2019లో రూ.30 లక్షలు పెట్టి ఇల్లు కొనుక్కున్నాడు. కరోనా రాకతో మార్చి నుంచి క్యాబ్​ నడవడం లేదు. ఇంటికి మాత్రం ఈఎంఐలు చెల్లించాల్సి వస్తోంది. గతంలో తెలిసినవారి సహకారముండేది. క్యాబ్​ ఆదాయమూ కలిసివచ్చేది. ఇప్పుడు రెండు దారులు మూసుకుపోయాయి. ఓ పది వేలు కావాలని ఎందరు మిత్రులకు ఫోన్​ చేసినా వారంతా నిస్సహాయత వ్యక్తం చేశారు. రెండు లక్షల అప్పు కోసం​ రెండు నెలలుగా తిరుగుతున్నా కనికరించేవారు లేరు. ఇంటి కాగితాలు పెట్టి, రెండు రూపాయలు మిత్తి ఇస్తామన్నా ప్రయోజనం లేదు. కష్టపడి కొనుక్కున్న ఇల్లు ఎక్కడ చేజారిపోతుందోనని సంతోష్ ఆందోళన చెందుతున్నాడు’’

దిశ, న్యూస్​ బ్యూరో:
ఇది ఒక్క సంతోష్ సమస్యే కాదు. నిన్నటి వరకూ ప్రాణమిత్రులు, కుటుంబ సభ్యులు, అన్నదమ్ములు ఏ అవసరమొచ్చినా, ఆపదొచ్చినా తామున్నామని నిలబడేవారు. ఆర్థిక అవసరాలను ఒకరికొకరు తీర్చకునేవారు. మాయదారి కరోనా వచ్చిన తర్వాత పరిస్థితి మారిపోయింది. చేబదులు కాదు కదా.. మిత్తి ఇస్తామన్నా అప్పు పుట్టడం లేదు. ఆత్మీయతతో ఇవ్వాలనుకునేవారి వద్దా డబ్బులు లేవు. ఉన్నవారూ ఇవ్వడానికి జంకుతున్నారు. భవిష్యత్తు వారినీ భయపెడుతోంది. కరోనాతో మనుషుల మధ్య అనుబంధాలు దెబ్బతిన్నాయి. ఉద్యోగాలు, వ్యాపారాలు దారి తప్పాయి. చాలా మంది సిటీలో ఇండ్లను ఖాళీ చేసి సొంతూళ్లకు వెళ్లిపోతున్నారు. తప్పనిసరిగా ఉండాల్సినవారు చేతిలో డబ్బులు లేక అవస్థలు పడుతున్నారు. ఈఎంఐలు, చిట్టీలు, ఇంటి అద్దె, ఇతరత్రా చిన్నచిన్న అవసరాల కోసం నానా తంటాలు పడుతున్నారు. ఈ సమస్యలు ఇంకా ఎంతకాలం కొనసాగుతున్నాయో స్పష్టంగా తెలియడం లేదు. పరిస్థితి ఇప్పట్లో సద్దుమణి గేలా లేదు.

రేపటి అవసరాల కోసం

కొందరి దగ్గరి రిజర్వ్​ మనీ ఉన్నా ఇప్పటికే అంతా ఖాళీ అయిపోయింది. ఏ కొంత మొత్తమో ఉన్నా, ఇస్తే రేపు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందోననే ఆందోళన కనిపిస్తోంది. తీసుకున్నవారు ఇప్పట్లో తిరిగే ఇచ్చేలా లేరు. ఆదాయ మార్గాలేవీ ప్రస్తుతం నడవడం లేదు. కరోనా సమస్యలు ఇంకా ఎంతకాలమో అర్థం కావడం లేదు. ఈ నేపథ్యంలో చేతుల్లో ఉన్న డబ్బులు వదిలేసి వెతుక్కోవడం ఎందుకని ఆలోచిస్తున్నారు. రేపటి రోజుల్లో అనుకోకుండా ఏదైనా ఆపద ఎదురైనా, అత్యవసరమైనా డబ్బులు దొరికేలా లేవు. దీంతో గతంలో కనిపించిన దగ్గరి సంబంధాల్లో కనిపించిన మనీ రొటేషన్ ఇప్పుడు మాయమైపోయింది. కరోనా పరిస్థితి ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు. ఎంత వడ్డీకైనా అప్పులు తీసుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కానీ, వారు చెల్లించే మార్గాలు మాత్రం కనిపించడం లేదు. వ్యాపారాలు, ఉద్యోగాలు, వ్యవహారాలు కుదుటపడేలా కనిపించడం లేదు. అందుకే అప్పులు ఇచ్చి, వారు తిరిగి ఎప్పుడు ఇస్తారా అని ఎదురుచూడటం కంటే, పెద్ద మొత్తాన్ని చేతిలో ఉంచుకోవడమే ముఖ్యంగా భావిస్తున్నామని హబ్సిగూడకు చెందిన ఫైనాన్సియర్​ ప్రకాష్​ చెబుతున్నారు.

రొటేషన్ కనుమరుగు

చిన్నచిన్న అవసరాల కోసం మనీ రొటేషన్​ చేసుకోవడం మధ్య తరగతి కుటుంబాల్లో ఎక్కువ. కరోనా ప్రభావంతో ఇచ్చేవారికి, తీసుకునేవారి మధ్య దూరం బాగా పెరిగిపోయింది. మార్కెట్లో ఎక్కడా డబ్బులు లేవు. దీంతో పీకలమీదకు అవసరమొచ్చేదాకా అడగలేని పరిస్థితి. నోరు తెరిచి అడిగినా ఇవ్వలేని దీనస్థితి. కరోనా రాకముందు వరకు ఒకరికి ఒకరై నిలిచినా ఆత్మీయులు కూడా చేతులెత్తేస్తున్నారు. దాదాపు సగానికి పైగా సిటీ ఖాళీ అయినట్టు అంచనా.. గతంలో ఉన్న ఇలాంటి చిన్నచిన్న మనీ రొటేషన్​ బంధాలు పూర్తిగా తగ్గిపోవడంతో ఇంటి అద్దెలు, ఈఎంఐలు చెల్లించలేక ఇండ్లు ఖాళీ చేస్తున్నారు. చిరు వ్యాపారాలు, వాహనాలు అమ్ముకొని ఊర్లకు ప్రయాణమవుతున్నారు. ​తప్పనిసరి ఇక్కడే ఉండాల్సినవారు..స్థానికులు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. మంచి రోజులు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తున్నారు.


Next Story

Most Viewed