కరోనా చావుకు ఖననం కష్టమే!

by  |
కరోనా చావుకు ఖననం కష్టమే!
X

దిశ, మేడ్చల్: కరోనాతో చనిపోయిన వారి మృతదేహాలు అందరూ ఉన్న అనాథల్లాగా మారుతున్నాయి. మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి మండలం, ఉద్దెమర్రి గ్రామంలో యంజాల లక్ష్మి (62) వృద్ధురాలు 20 రోజుల క్రితం కొవిడ్​బారిన పడింది. హోం క్వారంటైన్​లో ఉంటూ బుధవారం మృతి చెందింది. ఆమె అంత్యక్రియలు చేసేందుకు బంధువులు, పారిశుద్ధ్య కార్మికులు ముందుకు రాలేదు. దీంతో గ్రామంలో కొంత భయాందోళన పరిస్థితి నెలకొంది. దీంతో జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి అనుభవం ఉన్న పారిశుద్ధ్య కార్మికులను రప్పించే ప్రయత్నం చేశారు.

అందరూ ఉండి.. బంధువుల చేతుల మీదుగా అంత్యక్రియలు జరిగే అవకాశం ఉన్నా.. అనాథగా సీనియర్ నేత, సుధీర్ఘకాలం కంటోన్​మెంట్​బోర్డు సభ్యుడిగా పనిచేసిన పి.వెంకట్రావ్ అంత్యక్రియలు జరిగిన ఘటన చాలా మందిని కలచి వేసింది. కరోనా సోకగా యశోద ఆసుపత్రి చికిత్స పొందుతూ మృతి చెందిన ఆయన మృతదేహాన్ని రాత్రికి రాత్రే తీసుకొచ్చి మారేడ్ పల్లిలో శ్మశాన వాటికలో బంధుమిత్రులు లేకుండానే ఖననం చేశారు.

కరోనా సోకి చనిపోయిన తండ్రి అంత్యక్రియలకు బిడ్డలు హాజరు కాలేని దుస్థితి. కన్నతల్లిని కడసారి చూసే భాగ్యాన్ని కోల్పోతున్నారు కొడుకులు. ఇక కొన్ని చోట్ల గ్రామాల్లో అంత్యక్రియలకు అనుమతించినా.. పాడె పట్టేందుకు ఎవరూ ముందుకురావడం లేదు. ఇటువంటి ఘటనలకు అవగాహన లోపం.. అపోహలే అసలు కారణమని తెలుస్తోంది.

హడలిపోతున్నారు…

మహమ్మారి వైరస్ పేరు చెబితేనే జనం హడలిపోతున్నారు. ఎట్ల.. ఎప్పుడు ఎవరికి తగులుకుంటుందోనని భయపడి చస్తున్నారు. ఇక పొరపాటునో గ్రహపాటునో కరోనా సోకితే ఆ కుటుంబం మానసికంగా కుంగిపోతోంది. దీనికి తోడు కరోనా సోకిన రోగి కుటుంబాన్ని చాలామంది ప్రజలు వివక్షతో చూస్తున్నారు.

కరోనాతో అందరం యుద్ధం చేస్తున్నామని వైరస్ తో పోరాటం చేయాలి కానీ రోగితో.., రోగి కుటుంబంతో కాదు’ అని ప్రచారం ఊదరగొడుతున్నా.. మెజార్టీ జనం మాత్రం మారడం లేదు. ఇక కరోనా సోకి మరణించిన వారి అంత్యక్రియల విషయంలో చాలామంది ప్రజలు మానవత్వాన్ని మరిచిపోతున్నారు. చనిపోయింది తమకు సుపరిచితుడైనా..ఇరుగుపొరుగువాడైనా కనికరించడం లేదు. తమ ప్రాంతంలోని శ్మశాన వాటికలో మాత్రం కరోనా రోగుల అంత్యక్రియలు చేయడానికి వీల్లేదని నానారచ్చ చేస్తున్నారు.

వైరస్ సోకదని చెబుతున్నా..

కరోనా రోగుల మృతదేహాల వల్ల వైరస్ సోకే అవకాశం లేదని.., తగిన జాగ్రత్తలు పాటిస్తూ మృతదేహాలను ఖననం లేదా దహనం చేయాలని ఐసీఎంఆర్ కూడా చెబుతోంది. అయినప్పటికీ చాలామంది ప్రజలు అంత్యక్రియల వ్యవహారంలో అమానవీయంగా వ్యవహరించడం శోచనీయం. మానవత్వం లేని కరోనాకు కనికరం లేదు..అయితే కరోనా సోకిన వారి విషయంలో మానవత్వం ఉన్న మనుషులు కూడా దానవుల్లా మారిపోతున్నారనడానికి అనేక ఘటనలు నిలువెత్తు నిదర్శనాలు.

కరోనా సోకిన వారు ఏదో పాపం నేరం ఘోరం చేసినట్లు.. సంఘ విద్రోహ చర్యలకు పాల్పడ్డట్లు చూస్తున్నారు కొందరు. ఈ వివక్ష కారణంగానే కరోనా వైరస్ సోకి చనిపోయిన వారి మృతదేహాలు అందరూ ఉండి కూడా అనాథ శవాలుగా మిగులుతున్నాయి. పుట్టిన ఊరి మట్టిలోనే గిడదామని అనుకున్న వారి కడసారి కోరిక.. కోరికగానే మిగిలిపోతోందని పలువురు అవేదన వ్యక్తంచేస్తున్నారు.


Next Story

Most Viewed