నాగర్‌కర్నూల్‌లో నరక యాతన

by  |
నాగర్‌కర్నూల్‌లో నరక యాతన
X

దిశ, నాగర్‌కర్నూల్ : నాగర్‌కర్నూల్ మున్సిపాలిటిలో రోడ్లపై నడిచేందుకు పాదచారులు నరకయాతన పడుతున్నారు. ఇక వాహనదారుల ఇబ్బందులు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గతంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం కోసం రూ.63 కోట్లు వెచ్చించారు. అయితే, ఆ పనులు చేసేందుకు గుంతలు తవ్వి పైపులు పరిచారు. వాటిపై నామమాత్రంగా మట్టి వేయడంతో అవి కుంగిపోతున్నాయి. ఇక వర్షం పడితే అందులో నీళ్లు నిలవడమే కాక దాని చుట్టుపక్కల ప్రాంతం బురదగా మారుతోంది. బుధవారం కురిసిన వర్షానికి జిల్లాల్లో రోడ్లు సైతం చెరువును తలపించాయి.

చెరువులను తలపించిన రోడ్లు

నాగర్‌కర్నూల్ జిల్లాలో బుధవారం మోస్తరు వర్షం కురిసింది. దీంతో ఒక్కసారిగా రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షం నీరు రోడ్లపైనే నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. మోకాళ్ల లోతు మేర నీరు రోడ్లపైకి చేరింది. ఇలాంటి వర్షానికే రోడ్లు చెరువును తలపిస్తున్నాయని, ఇక భారీ వర్షం కురిస్తే పరిస్థితి ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు.

కూరగాయల వ్యాపారానికీ ఇబ్బంది

కొవిడ్ వ్యాప్తి కారణంగా కూరగాయల మార్కెట్‌ను జిల్లా కేంద్రంలోని బాలుర జూనియర్ కళాశాల ప్రాంగణంలో‌కి మార్చారు. ఇటీవలే కురిసిన వర్షాలకు ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన మురుగునీరు కళాశాల ప్రాంగణం‌లోకి చేరింది. కాల్వల ద్వారా నీటిని తరలించే చర్యలు చేపట్టాల్సిన అధికారులు తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో మార్కెట్ నుంచి దుర్వాసన వెలువుడుతోంది. మున్సిపాలిటీ అధికారులు కూరగాయల వ్యర్థాలను తొలగించక పోవడంతో సమస్య తీవ్రతరమవుతోంది. దీంతో తాజాగా కూరగాయల మార్కెట్‌ను యదాస్తికి తరలించారు అధికారులు.

పాలకవర్గంపై అసంతృప్తి

మున్సిపాలిటి నూతన పాలకవర్గం ఏర్పడి 7 నెలలు కావొస్తోంది. అధికార పార్టీకి చెందిన వారికే పాలనా పగ్గాలు దక్కాయి. అయినా, ఎలాంటి అభి వృద్ధి పనులు చేపట్టడం లేదు. కనీసం పారిశుధ్య పనులు సైతం చేపట్టకపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం చెత్తను తరలించాలని వేడుకున్నా అధికారులు స్పందించడం లేదని వాపోతున్నారు.

కేవలం హరితహారం కార్యక్రమానికి ఒకటి లేదా రెండు మొక్కలు నాటి ఫొటోలకు ఫోజులు ఇవ్వడం మినహా ఇప్పటి వర కు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకపోవడం పాలకవర్గంపై ప్రజల్లో వ్యతిరేకత వస్తోంది. 14వ ఫైనాన్స్‌ నిధులు ఉన్నా రోడ్ల అభివృద్ధి, నీరు నిల్వకుండా చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఇటీవలే ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి అధ్యక్షతన సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. కానీ ఇందులో ఎలాంటి అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు, ఆమోదాలు తెలపలేకపోవడం గమనార్హం. అయితే, కొద్ది రోజుల్లోనే సమస్యలు పరిష్కారం చేస్తామని మున్సిపల్ కమిషనర్ అన్వేష్ చెప్పుకొచ్చారు.



Next Story

Most Viewed