- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆ భూములకు రైతుబంధు సంగతేంది?
ప్రభుత్వం చెప్పిన పంట వేస్తేనే రైతుబంధు సాయం అందుతుందని ప్రభుత్వం వెల్లడించింది. కానీ, సాగుకు అనువుగా ఉన్న భూమిలో పంటలు వేయని వారికి రైతుబంధు ఇస్తారా? లేదా? అన్న దానికి ఇంకా స్పష్టత రాలేదు. ఇలాంటి భూమి రాష్ట్రంలో 4.57 లక్షల ఎకరాలు ఉందని అధికారుల లెక్కల్లో తేలింది. ఇలాంటి భూములపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో రైతుల్లో చర్చ మొదలైంది.
దిశ, న్యూస్ బ్యూరో: ఇక నుంచి ‘చెప్పిన పంట వేస్తేనే’ రైతుబంధు వర్తింపచేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసిన తరుణంలో రైతుల్లో రకరకాల సందేహాలు మొదలయ్యాయి. గత రబీ సీజన్ వరకు పట్టాదారు పాసు పుస్తకం ఉన్న ప్రతి గుంట భూమినీ రైతుబంధు సాయానికి అర్హత ఉన్నవిగా ప్రభుత్వం గుర్తించింది. సాగు భూములుగా రికార్డుల్లో గుర్తింపు పొందిన భూముల్లో పంటలు వేయకున్నా రైతుబంధు సాయం అందింది. కానీ, ఈసారి ‘చెప్పిన పంట వేస్తేనే’ అనే నిబంధన పెట్టినందునా.. ఇలాంటి భూములకు పెట్టుబడి సాయం అందుతుందా? లేదా? అనేది ఎటూ తేలకుండా ఉంది. రైతుబంధు సాయం కోసం సీసీఎల్ఏ విభాగం పూర్తి లెక్కలు తీసింది. పదెకరాలు, ఐదెకరాలు భూమి ఉన్న రైతుల జాబితాను సిద్ధం చేసింది. సాగుకు యోగ్యమైనా పంటలు వేయకుండా ఉన్న భూమి 1.83 లక్షల హెక్టార్లు (4.57 లక్షల ఎకరాలు)గా ఉన్నట్టు ఆ శాఖ అధికారులు గుర్తించారు. ఈ భూములకు ఇంతకాలం రైతుబంధు అందింది. కానీ ప్రభుత్వ కొత్త షరతుతో ఈసారి అందుతుందా? లేదా? అనేది ప్రశ్నార్థకం. ఇప్పటిదాకా భూసారాన్ని అంచనా వేస్తూ రైతులు పంటలను సాగుచేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఎలాంటి పంటలు వేయకుండా పడావు పెడుతున్నారు.
ప్రతి ఏటా తగ్గుతున్న లబ్ధిదారుల సంఖ్య
రైతుబంధు లబ్ధిదారుల సంఖ్య ప్రతి ఏటా తగ్గుతూ వస్తోన్నది. 2018 ఖరీఫ్‌లో 1.30 కోట్ల ఎకరాల్లో 50.25 లక్షల మంది లబ్ధిదారులకు రైతుబంధు సాయం విడుదలైంది. 2018-19 రబీలో 1.40 కోట్ల ఎకరాల్లో 54.53 లక్షల మందికి సాయం మంజూరైంది. కానీ, 1.31 కోట్ల ఎకరాల్లోని 49.03 లక్షల మందికి మాత్రమే నగదు బదిలీ అయింది. 2019 ఖరీఫ్‌లో 1.45 కోట్ల ఎకరాల్లో 56.76 లక్షల మంది అర్హులుగా గుర్తించినా 1.20 కోట్ల ఎకరాల్లో 50.98 లక్షల మందికి రైతుబంధు సాయం విడుదలైంది. 2019-20 రబీలో లబ్ధిదారుల సంఖ్య మరింతగా తగ్గిపోయింది. రాష్ట్రంలో 1.23 కోట్ల ఎకరాల్లో 47.50 లక్షల మంది అర్హులుగా గుర్తించినా 78.51 లక్షల ఎకరాల్లో 40.26 లక్షల మంది రైతులకే రైతుబంధు నగదును అధికారులు విడుదల చేశారు.
రైతుబంధు అమలుపై తాజాగా ప్రభుత్వం కఠిన నిబంధనలను అమలు చేసే ప్రయత్నంలో సీసీఎల్ఏ సిబ్బంది జిల్లాల వారీగా సాగు భూముల లెక్కలను తీశారు. నాలుగు విడతల్లో విడుదల చేసిన రైతుబంధులో సాగు చేయని భూములు సైతం ఉన్నట్టు ఈ ప్రక్రియలో తేలింది. ఈసారి పక్కాగా లెక్క తీయడంతో 4.57 లక్షల ఎకరాలు సాగుకు యోగ్యమైనప్పటికీ పంటలు వేయడం లేదని గుర్తించారు. వీటిలో కొన్ని భూములు ‘పెద్దల’ చేతుల్లో ఉండగా మరికొన్ని భూములు ఎలాంటి పంటలు లేకుండా ఖాళీగానే ఉంటున్నాయి. పంటలు సాగు చేయకున్నా ప్రతి ఎకరాకూ ఏడాదికి రూ.10 వేల చొప్పున రైతుబంధు తీసుకుంటున్నారు. అందరికీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినందున పంటలు వేశారా? లేదా? అనే అంశంతో సంబంధం లేకుండా నిధులు మంజూరయ్యాయి. ఈ లెక్కన ప్రతి ఏటా రూ.237.75 కోట్లు రైతుబంధు కింద సాగు చేయని భూములకు సంబంధించిన పట్టాదారుల బ్యాంకు ఖాతాల్లోనే జమయ్యాయి. వందల ఎకరాల భూస్వాములు సైతం రైతు బంధును వదలుకోవడం లేదు. రైతుబంధును వదలుకుంటే ఎన్ని ఎకరాలు, ఏ గ్రామం, ఎవరి పేరు మీద ఉంది తదితర వివరాలన్నీ బహిర్గతమవుతాయన్న ఉద్దేశంతో ఆ సొమ్మును ప్రభుత్వానికి తిరిగి ఇవ్వడం లేదు.
రైతులపై పెరుగుతున్న ఒత్తిడి..
రాష్ట్రంలో నియంత్రిత సాగు విధానంతో రైతులపై ఒత్తిడి పెరుగుతోంది. చాలా గ్రామాల రైతులు ముందుకు వస్తున్నారని ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్నా క్షేత్రస్థాయిల్లో మాత్రం వ్యతిరేకత గణనీయంగానే ఉంది. ఇప్పటి వరకు తమ భూమిలో ఎలాంటి పంటలు వేస్తే పండుతాయని సర్వం తెలిసిన తాము ఇప్పుడు ప్రభుత్వం చెప్పిన పంటలనే వేయాలంటే ఎలా అంటూ రైతులు ప్రశ్నిస్తున్నారు. ఏ భూముల్లో ఏ పంటలు వేయాలో రైతులకే మాత్రమే తెలుస్తుందని, ఒక గ్రామంలోనో, కొంత భూమిలోనో పండే పంటను ఆధారంగా తీసుకుని క్లస్టర్ మొత్తం ఒకే పంట వేస్తే ఎలా పండుతాయని స్థానిక వ్యవసాయ అధికారులను రైతులు నిలదీస్తున్నారు. ఒక రైతుకు ఐదెకరాల భూమి ఉంటే నీటి పరిస్థితులు, సాగుకు ఉన్న అనుకూల పరిస్థితులను అంచనా వేసుకుంటూ నాలుగు ఎకరాల్లో సేద్యం చేసుకుంటే మిగిలిన ఎకరాకు రైతు బంధు వస్తుందా…? లేదా? అనే దానిపై ప్రభుత్వం నుంచి ఇప్పటికీ స్పష్టత లేదు. ‘చెప్పిన పంటలు వేస్తేనే’ అనే నిబంధన ఎలా ఉన్నప్పటికీ అసలు పంటలే వేయని భూమికి, సాగుకు యోగ్యమైనా సేద్యం చేయని భూమికి రైతుబంధు వస్తుందా? లేదా? అనే అంశంపైనా సరైన స్పష్టత లేదు. రైతుబంధు వ్యయాన్ని తగ్గించుకునేందుకు ప్రభుత్వం కఠినమైన ఆంక్షలు అమల్లోకి తీసుకువస్తుందని రైతుల్లో అనుమానం నెలకొంది.
భూమి లక్షల హెక్టార్లలో
మొత్తం విస్తీర్ణం : 112.08
నికర సాగుభూమి : 41.75
వ్యవసాయేతర అవసరాలకు వినియోగిస్తున్న భూమి : 8.92
బంజర్లు, సాగు చేయలేని భూమి : 6.07
సాగుకు అనువైనా పంటలు సాగు చేయని భూమి : 1.83
సాగుకు పనికి రాని భూమి : 0.24