స్టూడెంట్స్, ఉద్యోగులే వాళ్ల టార్గెట్.. రేవ్ పార్టీ నిర్వాహకులపై పీడీ యాక్ట్

by Sumithra |
Rave-Party
X

దిశ, మునుగోడు : రేవ్ పార్టీలు నిర్వహిస్తూ నిషేధిత డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముగ్గురిపై రాచకొండ పోలీస్ కమిషనర్ ఆదేశాలతో నారాయణపురం పోలీస్ స్టేషన్‌లో పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గిరీష్ దడువాయి, జక్కిడి శ్రీకర్ రెడ్డి, చొల్లేటి శరత్ చంద్రలు.. ఈజీ మనీకి అలవాటు పడి రేవ్ పార్టీలను నిర్వహిస్తున్నారు.

రాచకొండ ప్రాంతంలో శ్రీకర్ రెడ్డికి చెందిన ఫామ్ హౌస్ ఈ రేవ్ పార్టీలకు అడ్డాగా మారింది. పోలీసులు బందోబస్తులో బిజీగా ఉండే శివరాత్రి పండుగను నిర్వాహకులు రేవ్ పార్టీలకు అనువుగా చేసుకున్నారు. నిర్వాహకులు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా యువత, విద్యార్థులు, ప్రైవేటు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులే టార్గెట్‌గా ప్రచారం నిర్వహిస్తుంటారు. 500 రూపాయలను ఎంట్రీ ఫీజుగా నిర్ణయించి ఈ తతంగాన్ని నడుపుతున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

ఈ రేవ్ పార్టీల్లో గంజాయితో పాటు నిషేధిత డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్నట్లు సమాచారం. ధూల్‌పేట్, ముంబై పట్టణంలోని గుర్తు తెలియని వ్యక్తుల వద్ద నుంచి గంజాయి, నిషేధిత డ్రగ్స్‌ను తక్కువ ధరకు కొనుగోలు చేసి, అతి ఎక్కువ ధరలకు ఈ రేవ్ పార్టీల్లో విక్రయిస్తుంటారు. అంతేకాకుండా ఢిల్లీకి చెందిన ఒక ప్రముఖ డీజే కంపెనీ నిర్వాహకులతో ఒప్పందం కుదుర్చుకుని యువతను, విద్యార్థులను ఆకర్షిస్తున్నారు.

ఇటీవల నారాయణపురం మండల కేంద్రంలోని శ్రీకర్ రెడ్డి ఫామ్ హౌస్‌లో శివరాత్రి పండుగ సమయంలో రేవ్ పార్టీపై పక్కా సమాచారంతో ఎస్వోటీ పోలీసులు దాడి చేశారు. ఈ క్రమంలో ఏడుగురు నిర్వాహకులతో పాటు పార్టీకి వచ్చిన 90 మందిని, 400 గ్రాముల గంజాయి, నిషేధిత డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో చర్లపల్లి జైల్లో శిక్ష అనుభవిస్తున్న గిరీష్, శ్రీకర్ రెడ్డి, శరత్ చంద్రలను మంగళవారం అదుపులోకి తీసుకొని పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. యువత, విద్యార్థులు ఇలాంటి పార్టీలకు దూరంగా ఉండి భవిష్యత్తును కాపాడుకోవాలని ఈ సందర్భంగా రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ విజ్ఞప్తి చేశారు.

Advertisement

Next Story

Most Viewed