చైనా యాప్‌ల నిషేధంపై పేటీఎం స్పందన

by Anukaran |   ( Updated:2020-06-30 08:03:45.0  )
చైనా యాప్‌ల నిషేధంపై పేటీఎం స్పందన
X

దిశ, సెంట్రల్ డెస్క్: టిక్‌టాక్ వంటి 59 చైనా యాప్‌లను దేశ భద్రతను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ నిషేధంపై పేటీం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ స్పందించారు. దేశ ప్రయోజనాలను కాపాడేందుకు అధిక ప్రజాదరణ ఉన్న చైనా యాప్‌లను నిషేధించడం సాహసోపేతమైన నిర్ణయమని అన్నారు. పేటీఎం సంస్థలో అలిబాబా, యాంట్ ఫైనాన్స్ లాంటి చైనాకు చెందిన భారీ కంపెనీలు పెట్టుబడులు పెట్టిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ.. విజయ్ శేఖర్ చైనా యాప్‌ల నిషేధంపై స్పందించడం గమనార్హం. దేశ ప్రయోజనాలను కాపాడేందుకు సాహసవంతమైన నిర్ణయం తీసుకున్నారని, భారత్ స్వయం సమృద్ధిని సాధించే మార్గానికి ఈ నిర్ణయం దోహదం చేస్తుందని ట్విటర్ ద్వారా విజయ్ స్పందించారు. ఇలాంటి సమయంలోనే దేశీయ పారిశ్రామికవేత్తలు కొత్త ఆవిష్కరణలతో ముందుకు రావాలని విజయ్ శేఖర్ పేర్కొన్నారు.

చైనా యాప్‌ల నిషేధాన్ని పలు భారత ఇంటర్నెట్ కంపెనీలు కూడా స్వాగతించాయి. ఈ నిర్ణయం ద్వారా భారత టెక్ కంపెనీలు నిలదొక్కుకునేందుకు, ప్రభుత్వ డిజిటల్ ఇండియా లక్ష్యానికి చేరువయ్యేందుకు చక్కని అవకాశమని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు, దేశీయ యాప్‌లు పుంజుకోవడానికి ఇది సరైన సమయమని బెంగళూరు కేంద్రంగా పనిచేసే ట్రెల్ సహ వ్యవస్థాపకుడు పులకిత్ అగర్వాల్ అభిప్రాయపడ్డారు. తమలాంటి స్టార్టప్ కంపెనీలకు ఇది ప్రోత్సాహకరంగా ఉంటుందని, డిజిటల్ ఇండియాను ముందుకు తీసుకెళ్లేందుకు సాయపడతామని ఆయన పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed