అది నేను ఎప్పటికీ మర్చిపోను -పవన్ కళ్యాణ్ 

by  |
అది నేను ఎప్పటికీ మర్చిపోను -పవన్ కళ్యాణ్ 
X

దిశ, వెబ్ డెస్క్: సెప్టెంబర్ 2 సినీ హీరో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా అభిమానులు చేస్తున్న సేవా కార్యక్రమాలపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. తన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని జనసైనికులు, నాయకులు, వీర మహిళలు, అభిమానులు రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్ ఆసుపత్రులకు ఆక్సిజన్ సిలిండర్ కిట్ల వితరణ పై అభినందనలు తెలియజేశారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో జనసేన శ్రేణులు, నాయకులు, అభిమానులు చేస్తున్న సేవా కార్యక్రమాలు ఎన్నో విలువైన ప్రాణాలను కాపాడతాయని సంతృప్తి వ్యక్తం చేసారు.

“తమ అభిమానాన్ని వ్యక్తం చేసేందుకు సామాజిక సేవా మార్గాన్ని ఎంచుకోవడాన్ని ఎప్పటికీ మరచిపోనన్నారు” జనసేన అధినేత. తనకు పుట్టిన రోజు చేసుకోవడం పెద్దగా ఇష్టం ఉండదని అభిమానులకు చెప్పారు. పుట్టిన రోజు అంటే… చిన్నప్పుడు ఒకటి, రెండు సందర్భాల్లో స్కూల్లో చాక్లెట్లు పంచినట్లు గుర్తని, తర్వాత చాలా ఏళ్ల పాటు పుట్టిన రోజునే మర్చిపోయానన్నారు.

పుట్టినరోజు అయిపోయిన రెండు రోజులకు ఇంట్లో ఎవరో ఒకరికి గుర్తొచ్చేదని.. అలా గుర్తొచ్చినప్పుడు వదిన డబ్బులు ఇస్తే పుస్తకాలు కొనుక్కునేవాడినని గుర్తు చేసుకున్నారు. అంతకుమించి ప్రత్యేకంగా సెలెబ్రేట్ చేసుకోవడం అలవాటు లేదన్నారు. సినిమాల్లోకి వచ్చిన తర్వాత స్నేహితులు, నిర్మాతలు పుట్టిన రోజు వేడుకలు చేసే ప్రయత్నం చేస్తే ఇబ్బందిగా అనిపించేదని.. కేక్ కట్ చేయడం, ఆ కేక్ తీసుకొచ్చి నా నోట్లో పెట్టడం ఎబ్బెట్టుగా అనిపించడంతో మానేశానన్నారు. అంతే తప్ప ప్రత్యేకంగా వేరే కారణాలు ఏమీ లేవని స్పష్టం చేశారు.

అభిమానులు చూపుతున్న అభిమానంపై పవన్ తనదైన శైలిలో స్పందించారు. లక్షలాది మంది అభిమానించడం, అదరించడం చూస్తుంటే తనకే ఆశ్చర్యమేస్తుందన్నారు. సుస్వాగతం సినిమా రిలీజ్ అయినప్పుడు థియేటర్ లో ఫంక్షన్ ఉంది తప్పకుండా రావాలంటే ఇబ్బంది పడుతూనే కర్నూలు వెళ్లానని.. వాహనం ఎక్కేటప్పటికి దారి పొడువునా విపరీతమైన జనం ఉన్నారని, ఆ జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. వాళ్లకు తనకు మధ్య పెద్ద తేడా లేదని అప్పుడే అనుకున్నానని.. వాళ్లు అటువైపు ఉన్నారు, నేను ఇటువైపు ఉన్నాను అంతే అన్నారు.

తనను ప్రత్యేకంగా చూస్తున్నారనే ఆలోచన విధానం ఎప్పుడూ లేదని పవన్ చెప్పారు. తన ప్రమేయం లేకుండానే పుట్టిన రోజును పురస్కరించుకొని సేవా వారోత్సవాలు చేస్తున్నారంటే.. అది జన సైనికులు, వీర మహిళలు, అభిమానుల గొప్పతనమని కొనియాడారు. అభిమానులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పారు. ఒక వ్యక్తి మీద ఉన్న అభిమానం సమాజానికి ఉపయోగపడితే నిజంగా చాలా తృప్తిగా ఉంటుంది. ఇందుకు భగవంతుడికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు.


Next Story

Most Viewed