మీవాడిగా భావించినందుకు థాంక్స్: పవన్

దిశ, వెబ్‌డెస్క్: సెప్టెంబర్ 2..పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజున ఫ్యాన్స్‌కు అదిరిపోయే బహముతులు అందాయి. ‘వకీల్‌సాబ్’ మోషన్ పోస్టర్, తన 27వ చిత్రం ప్రీలుక్, 28వ చిత్రం కాన్సెప్ట్ లుక్ రిలీజ్ కావడంతో అభిమానులు పండుగ చేసుకున్నారు. సోషల్ మీడియా సెలెబ్రటీల విషెస్‌తో నిండిపోగా.. స్టార్‌డమ్‌తో సంబంధం లేకుండా స్టార్ హీరో నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ వరకు, ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీకి ఎంటర్ అయిన నటీనటులకు ప్రతీ ఒక్కరికి పర్సనల్‌గా రిప్లై ఇచ్చి..మా జీవితం సార్థకం అయిందనేలా చేసి..మొత్తానికి దటీజ్ పవర్ స్టార్ అనిపించుకున్నారు పవన్ కళ్యాణ్. కాగా, తాజాగా మీడియా మిత్రులకు స్పెషల్ థాంక్స్ చెప్తూ నోట్ విడుదల చేశాడు పవర్ స్టార్.

‘‘నా జన్మదినం సందర్భంగా సినీ, మీడియా మిత్రులు సామాజిక మాధ్యమాల ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సినిమా ఇన్‌చార్జెస్, విలేకర్లు, ఫొటోగ్రాఫర్లు, కెమెరామెన్లు, వెబ్ మీడియా నిర్వాహకులు, పాత్రికేయులు ప్రత్యేక కథనాల ద్వారా గ్రీటింగ్స్ చెప్పారు. అందరికీ మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు. నా సినీ ప్రస్థానం.. మైలురాళ్ళను ప్రస్తావిస్తూ సాగిన వ్యాసాలు, కథనాలు, రాబోతున్న చిత్రాల వివరాలను పాఠకులకు, వీక్షకులకు తెలియచేయడం నన్నెంతో సంతోషపరిచింది. ఒకసారి నా ప్రయాణాన్ని గుర్తు చేశారు. కష్టాల్లో ఉన్న జనం గళంగా జనసేన నిలుస్తోంది. ప్రజాక్షేత్రంలోనే ఎక్కువ సమయం వెచ్చిస్తున్నాను. సినీ రంగంలో భాగమైన మీడియా మిత్రులు .. నేను ప్రజా జీవితంలో ఉన్నా తమవాడిగా భావించి నా అభిమానులకు, సినీ ప్రియులకు కనువిందు చేశారు” అంటూ సినీ పాత్రికేయులందరికీ మరోసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు పవన్.

Advertisement