కరోనాతో పాటు స్టైరిన్‌తో సహజీవనం చేయాలా?: పవన్ కల్యాణ్

by srinivas |
Pawan
X

దిశ, ఏపీ బ్యూరో: వైజాగ్‌లోని ఆర్ఆర్ వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో ఇటీవల స్టైరిన్ గ్యాస్ లీకైన ఘటనపై మరోసారి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటన జరిగి పది రోజులు గడుస్తున్నా ఇళ్లతో పాటు పరిసరాల్లో స్టైరిన్ వాయువు ఘాడత వాసన ముక్కుపుటాలను అదరగొడుతుండడంపై మండిపడుతూ, ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి, ప్రాణాపాయం నుంచి బయటపడిన వారికి పరిహారం ఇచ్చారు కానీ, ఆ పరిశ్రమ చుట్టుపక్కల నివసిస్తున్న 15,000 మంది ప్రజల జీవన్మరణ సమస్యకు రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు పరిష్కారం చూపలేకపోయిందని అన్నారు.

పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సకాలంలో స్పందించబట్టి ఎన్నో ప్రాణాలు నిలిచాయని, లేకపోతే పరిశ్రమ చుట్టుపక్కల గ్రామాలైన వెంకటాపురం, పద్మాపురం, నందమూరి నగర్, వెంకటాద్రి గార్డెన్స్ ప్రాంతాల్లో పరిస్థితి అత్యంత దారుణంగా ఉండేదని ఆయన వెల్లడించారు. 7 కిలోమీటర్ల పరిధిలోని 15 వేల మంది ప్రజలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని కాలం గడుపుతున్నారని, వీరిలో భరోసా కలిగించే దిశగా రాష్ట్రం ఒక్క నిర్ణయం కూడా తీసుకోలేదని ఆయన విమర్శించారు. ఇప్పటికే కరోనాతో కలిసి జీవించాలని చెప్పిన ఈ ప్రభుత్వం, ఇప్పుడు ఆర్ఆర్ వెంకటాపురం, పరిసర గ్రామాల ప్రజలను స్టైరీన్ విషవాయువుతో సహజీవనం చేయాలని తన చర్యలతో చెప్పకనే చెబుతోందని ఆయన విమర్శించారు.


👉 Follow us on WhatsApp Channel
👉 Follow us on Sharechat


Next Story