వైద్యుల కోసం రోగుల పడిగాపులు.. సమయపాలన పాటించని వైద్యాధికారులు

by Shyam |   ( Updated:2021-10-13 00:36:51.0  )
వైద్యుల కోసం రోగుల పడిగాపులు.. సమయపాలన పాటించని వైద్యాధికారులు
X

దిశ, అచ్చంపేట : నాగర్ కర్నూల్ జిల్లాలోని నల్లమల ప్రాంతంలో గల ప్రభుత్వ ప్రాథమిక వైద్య కేంద్రాల వద్ద రోగులు.. వైద్య అధికారుల కోసం పడిగాపులు పడాల్సిన దుస్థితి నెలకొంది. వివరాల్లోకి వెళితే జిల్లాలోని అమ్రాబాద్ మండలం మన్ననూర్ గ్రామంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద బుధవారం ఉదయం 10:25 గంటల సమయం అయినప్పటికి వైద్య కేంద్రంలో వైద్యాధికారితో పాటు కనీసం వైద్య సిబ్బంది కూడా లేకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

సమయపాలన పాటించని వైద్యాధికారులు, సిబ్బంది..

ఏజెన్సీ ప్రాంతంలో ప్రధాన రహదారిపై ఉన్న మన్ననూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 11 గంటలు కావస్తున్నా వైద్య సిబ్బంది ఒకరు కూడా విధులకు హాజరు కాలేదంటే.. ఏజెన్సీలో ఉన్న మారుమూల ప్రాంతంలో వైద్య కేంద్రాల పరిస్థితి ఎలా ఉంటుందో వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. వైద్య అధికారులు మరియు సిబ్బంది సమయపాలన పాటించకపోవడం వల్ల గ్రామాలలో రోగులు పడిగాపులు కాస్తూ అవస్థలు పడుతున్నారు. చేసేదిలేక తప్పనిసరి పరిస్థితుల వలన ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించాల్సి వస్తుందని ఆ ప్రాంత ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైద్య సిబ్బంది నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా విధుల నిర్వహణ ఉందని, పలు సందర్భాల్లో ప్రజలు ఆగ్రహం, అసహనం వ్యక్తం చేస్తున్నప్పటికి వైద్యాధికారులు, సిబ్బందిలో మార్పు రావడం లేదని చెప్పవచ్చు.

ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం..

ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న వైద్య పరిస్థితులు మెరుగు పడాలంటే.. ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఆయా రామ్.. గాయా రామ్ గా అన్నట్లుగా ఉందని ఈ ప్రాంత ప్రజలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వైద్య ఉన్నత అధికారుల పర్యవేక్షణతో పాటు అచ్చంపేట నియోజకవర్గ కేంద్రంలో జిల్లా అడిషనల్ వైద్యాధికారి అందుబాటులో ఉన్నప్పటికీ వైద్య అధికారుల తీరు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉందని, పర్యవేక్షణ లోపించిందని చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికి మారుమూల ప్రాంతాల్లో గల గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్య సేవలను అంతంతమాత్రంగా అందిస్తున్నారు. ప్రభుత్వ వైద్యం అందించడంలో అధికారుల మొండివైఖరి, నిర్లక్ష్యాన్ని ప్రజలు ఘాటుగా విమర్శిస్తున్నారు. వైద్యాధికారులు మరియు సిబ్బందిలో మార్పు రానంత వరకు సామాన్య ప్రజానీకానికి ప్రభుత్వ వైద్యం అందని ద్రాక్షగానే మిగిల్చిందని చెప్పవచ్చు.

కలెక్టర్ సారు దృష్టి పెట్టాలి..

జిల్లాలో మెరుగైన వైద్య సేవలు ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో ప్రజానీకానికి ప్రభుత్వ వైద్యాన్ని అందించేలా చర్యలు తీసుకోవాలని, జిల్లాలో ప్రజా వైద్య విధానంపై కలెక్టర్ దృష్టి సారించాల్సిన అవసరం ఉందని నల్లమల ప్రజలు కోరుతున్నారు. వైద్య అధికారుల పనితీరులో మార్పు తీసుకువచ్చేలా కలెక్టర్ ప్రతిఘటన చర్యలు చేపట్టాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed