బస్టాప్‌లో నో షెల్టర్.. రోడ్లపై నిరీక్షణ

by Shyam |   ( Updated:2021-02-03 13:55:13.0  )
బస్టాప్‌లో నో షెల్టర్.. రోడ్లపై నిరీక్షణ
X

దిశ, శేరిలింగంపల్లి: నగరంలో ఆర్టీసీ ప్రయాణికులు పట్టపగలే చుక్కలు చూస్తున్నారు. బస్టాప్​లలో షెల్టర్లు లేక గంటల తరబడి బస్సుల కోసం రోడ్లపైనే పడిగాపులు కాస్తున్నారు. ప్రయాణికులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో ఆర్టీసీ అధికారులు ఘోరంగా విఫలమయ్యారు. ఆర్భాటంగా ప్రారంభించిన ఏసీ బస్​సెల్టర్లు అలంకార ప్రాయంగా మారాయి. నిర్వహణ లోపంతో యాచకులు, వీధి కుక్కలకు ఆశ్రయంగా మారాయి. ప్రయాణికులను ఆకట్టుకునేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని అధికారులు చెబుతున్నా ఆచరణలో మాత్రం కానరావడం లేదు. నగరంలో ప్రతీరోజు లక్షలాదిమంది ప్రయాణికులు బస్సు ఎక్కుతుంటారు. వారంతా బస్సుల కోసం గంట ల తరబడి బస్టాప్​లో నిరీక్షించాల్సి వస్తుంది. బస్టాప్​లలో ఎలాంటి సదుపాయాలు కానరావు. ప్రయాణికులు రోడ్డుపైనే నిల్చుని బస్సులకోసం నిరీక్షిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులే శేరిలింగంపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నాయి.

ఏసీ బస్టాప్‎లు ఎక్కడ..?

దేశంలోనే ప్రథమంగా హైదరాబాద్ సిటీలో బల్ది యా ఆధ్వర్యంలో ఏసీ బస్ షెల్టర్లను ఏర్పాటు చేశారు. ఖైరతాబాద్, కేపీహెచ్ బీ, గచ్చిబౌలి, మాదాపూర్ తదితర చోట్ల ఏసీ బస్ షెల్టర్లతో పాటు ఏసీ టాయిలెట్స్, రిజర్వేషన్ కౌంటర్, ఏటీఎం సెంటర్, వైఫై, టీ స్టాల్స్ వంటివి అధునాతన హంగులతో ఏర్పాటు చేశారు. వీటిని 2018 మేలో మంత్రి కేటీఆర్ చేతుల మీదు గా ప్రారంభించారు. కానీ, ఇవి మూణ్నాళ్ల ముచ్చటగా మిగిలిపోయాయి. ఏసీ బస్టాప్ లు నిర్వహణ లోపంతో మూలన పడ్డాయి. ఏసీ, వైఫై జాడలేదు. ఉక్కపోత, వేడితో ఎవరూ అందులో పట్టుమని పది నిమిషాలు కూడా ఉండడం లేదు.

నిర్వహణ లోపాలు..

నగరంలో బస్టాప్ లు చాలావరకు నిర్వహణ లోపంతో కూనారిల్లుతున్నాయి. ప్రయాణికుల రద్దీ, స్టేజీలను పరిగణలోకి తీసుకుని నగర వ్యాప్తంగా సుమారు 3వేల వరకు బస్టాప్ లు ఉండాల్సి ఉన్నా ప్రస్తుతం నగరంలో 1,250 వరకు మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. మిగతా చోట్ల రోడ్ల మీదనే ప్రయాణికులు పడిగాపులు కాయాల్సి వస్తుంది. కానీ, ఆర్టీసీ అధికారులు మాత్రం నగరంలో 2వేల పై చిలుకు బస్టాప్ లు ఉన్నాయని చెబుతున్నారు. బస్టాప్ ల నిర్వహణను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించారు. బస్టాప్ ల మీద బోర్డులు ఏర్పాటు చేసే ప్రకటనలు వేసే ఏజెన్సీలు వీటి నిర్వహణను చూసేలా గతంలో ఆర్టీసీ అధికారులు ఒప్పందం చేసుకున్నారు. కానీ ఈమధ్య కాలంలో హోర్డింగ్ లు కనిపిస్తున్నా నిర్వహణ మాత్రం చూడడం లేదు. చాలాచోట్ల బస్టాప్ లు శిథిలావస్థకు చేరుకున్నాయి. వీటిపై అధికారులు మాత్రం ఎప్పుడూ దృష్టి పెట్టడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

ఏసీ బస్టాప్ ల్లో ఏసీలే లేవు..

రాష్ట్ర ప్రభుత్వం ఏసీ బస్టాప్ లు ఏర్పా టు చేస్తున్నామని గొప్పగా కొన్నిచోట్ల బస్టాప్ లను ఏర్పాటు చేసింది. కానీ, ఇప్పుడు అక్కడ ఏసీలే లేవు. అందులో పది నిమిషాలు కూడా ఎవరూ ఉండరు. -సాయినాథ్ రెడ్డి, ప్రయాణికుడు

రోడ్ల మీదనే నిలబడాలి..

బస్సుల కోసం రోడ్ల మీదనే నిలబడాలి. అధికారులు బస్సు చార్జీలు పెంచారు కానీ, కనీస సౌకర్యాలు కల్పించడం లేదు. –మహేశ్, ప్రయాణికుడు

Advertisement

Next Story