బిగ్గెస్ట్‌ ప్రాబ్లమ్‌గా పార్టు-బి భూములు

by Shyam |   ( Updated:2021-01-08 01:56:59.0  )
బిగ్గెస్ట్‌ ప్రాబ్లమ్‌గా పార్టు-బి భూములు
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో భూమి హక్కులను ఉద్యోగులు, పాలకులు కలిసి జఠిలం చేశారు. భూ రికార్డుల ప్రక్షాళనతో కొత్త సమస్యలు పుట్టుకొచ్చాయి. మూడేండ్లుగా తమ భూములకు హక్కులు దక్కుతాయో లేదోనన్న ఆందోళన నెలకొంది. ఒకటీ రెండు ఎకరాలు కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా లక్షల ఎకరాల భూమికి హక్కులను నిర్ణయించకుండా పెండింగులో ఉంచారు. ధరణి పోర్టల్లో నమోదు చేయకుండా వాటిని ‘పార్టు బీ’ గా నామకరణం చేశారు. రాష్ట్రావిర్భావం తర్వాత భూములకు విలువ పెరిగింది. సీఎం కేసీఆర్ ప్రసంగాల ప్రకారమే రాష్ట్రంలోని ఏ మారుమూల ప్రాంతంలోనైనా ఎకరా రూ.10 లక్షలకు పైగా పలుకుతోంది. ఈ క్రమంలో ఎన్నేండ్లుగానో సాగు చేస్తున్న భూములకు, తరతరాలుగా హక్కు పత్రాలు ఉన్నప్పటికీ పట్టాదారు పాసు పుస్తకాలను పెండింగులో ఉంచారంటూ వేలాది మంది ఆందోళనలో ఉన్నారు.

ప్రతి రోజూ తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. సరిహద్దు వివాదాలు ఉన్నాయంటూ పాసు పుస్తకాన్ని జారీ చేయకుండా నిలిపివేసిన ఉదాహరణలూ ఉన్నాయి. ఇటీవల సీఎం కేసీఆర్ ఐదు జిల్లాల కలెక్టర్లు, కొందరు సీఎంఓ అధికారులతో రెవెన్యూ, ధరణి పోర్టల్ సమస్యలపై సమీక్షించారు. మూడు సంవత్సరాలుగా పెండింగులో ఉన్న పార్టు బి కేసులను 60 రోజుల్లో తేల్చాలని ఆదేశించారు. త్వరలోనే అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశం కానున్నారని సమాచారం. దీంతో రెవెన్యూ యంత్రాంగమంతా పాత దస్త్రాలను దులుపుతున్నారు. ఏయే కారణాలతో పార్టు బి కింద చేర్చారో వివరాలను సేకరిస్తున్నారు. మొత్తంగా పార్టు బి ఫైళ్లల్లో నెలకొన్న సమస్యలేమిటో మరోసారి గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ అంశాలపై రేపో ఎల్లుండో సీఎం కేసీఆర్ మరోసారి సమీక్షిస్తారని తెలుస్తోంది.

ధరణితో కష్టమేనా?

పార్టు బి సమస్యల పరిష్కారం ధరణి పోర్టల్ ద్వారా కష్టమేనని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. ప్రధానంగా సర్వే నంబర్లలో క్షేత్ర స్థాయి విస్తీర్ణానికి, పహాణీల్లో నమోదైన విస్తీర్ణానికి మధ్య తేడాలు ఉన్నప్పుడు పట్టాదారులకు న్యాయం చేయడం అసాధ్యమంటున్నారు. ఏ పట్టాదారుడి పేరిటా తగ్గించే అవకాశం ఉండదు. దానికి ఎవరూ అంగీకరించే అవకాశం లేదు. అలాగే మిగతా అంశాలపై కూడా అధికారులు తీసుకునే నిర్ణయాల ద్వారా న్యాయం జరిగే అవకాశమే లేదని సమాచారం. చిన్నచిన్న సమస్యలతో ధరణిలో నమోదు చేయలేదు. సమగ్ర భూ సర్వే చేస్తే తప్ప పరిష్కారమయ్యేటట్లు లేదని రెవెన్యూ చట్టాల నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కొత్త ఆర్వోఆర్ చట్టంతో పార్టు బి కష్టాలకు ఇప్పటికిప్పుడు న్యాయం జరిగేటట్లు లేదంటున్నారు.

అసైన్డ్ భూముల్లో చిక్కులు..

అసైన్డ్ భూముల పంపకాల్లో అనేక లోపాలు దర్శనమిస్తున్నాయి. సర్వే నంబరులోని విస్తీర్ణం కంటే రెట్టింపు పంపిణీ చేసిన ఉదాహరణలు ఉన్నాయి. 40, 50 ఏండ్ల కిందటే తీసుకున్న వారున్నారు. వాళ్లు ఎప్పటి నుంచో రికార్డుల్లో నమోదై ఉన్నారు. ఆ వివరాలను, పంపిణీ చేసిన మొత్తం విస్తీర్ణాన్ని పరిగణనలోకి తీసుకోకుండా రాజకీయ లబ్ధి కోసం పేదలకు అదే భూమిని మళ్లీ పంపిణీ చేసి పట్టాలు చేతిలో పెట్టారు. ఐతే వారికి హద్దులు చూపించకపోవడంతో పట్టాలు మాత్రమే మిగిలాయి. ఆర్ఎస్ఆర్ విస్తీర్ణం కంటే అధికంగా ఉండడంతో ధరణి పోర్టల్ అంగీకరించడం లేదు.

దాంతో చాలా మందికి పట్టాదారు పుస్తకాలను జారీ చేయలేదు. ఎన్నో ఏండ్లుగా హక్కుదారులుగా ఉన్న వారికి కూడా ఇవ్వలేదు. ఆ తర్వాత పట్టాలు పొందిన వారిని, మొదటి లబ్ధిదారులను ఒకటిగానే రెవెన్యూ అధికారులు పరిగణించారు. దశాబ్దాల క్రితం ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన వారికి హక్కులు కల్పించడం తప్పనిసరి. కానీ ఎన్నికల్లో లబ్ధి పొందడానికి, పార్టీ జెండాలు మోసిన కార్యకర్తల పేరిట కొందరికి భూములను పంచారు. ఇంకొందరు పేదలు కూడా భూములు పొందారు. ముందుగా పట్టాలు పొందిన వారికి ఇవ్వడం నిబంధనల ప్రకారం తప్పనిసరి. కానీ కొన్ని మండలాల్లో అధికారులు ఏ నిర్ణయం తీసుకోకుండా పెండింగులో ఉంచారు. వాటిని పార్టు బి కింద నమోదు చేసి మూడేండ్లుగా నానబెడుతున్నారన్న ఆవేదనకు కారణమయ్యారు.

గుర్తించిన సమస్యలు..

* సర్వే నంబర్లలో ఆర్ఎస్ఆర్ విస్తీర్ణం ఎంత? రికార్డుల ప్రక్షాళన ప్రకారం ఎంత విస్తీర్ణం? తేడా ఎంత? ధరణి పోర్టల్ లో ఎంత? ఈ తేడాలు ఎలా వచ్చాయి?
* పార్టు బి కింద పేర్కొన్న వాటిల్లో కొన్నింట్లో రోడ్లు, ఇండ్లు, ఇంటి స్థలాలు కూడా ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో కాలనీలు వెలిసినా సాగు భూములుగా ఉన్నాయి.
* కొన్ని ప్రాంతాల్లో నాలా కన్వర్షన్ చేసుకున్న భాగంతో పాటు ఆ సర్వే నంబరులోని మొత్తం భూమిని వ్యవసాయేతర ఆస్తిగా పరిగణిస్తూ మార్కెట్ వ్యాల్యూస్ ను పేర్కొన్నారు.
*కొన్ని గ్రామాల్లో సర్వే నంబర్లు మిస్ అయ్యాయి.
* కొన్ని ప్రాంతాల్లో విస్తీర్ణాలు తక్కువగా నమోదు చేశారు.
*పట్టాదారు పాసు పుస్తకంలో నాలుగైదు సర్వే నంబర్లు పేర్కొనడానికి బదులుగా కొన్నింటిని మిస్ చేశారు. పాత పట్టాదారు పాసు పుస్తకానికి విరుద్ధంగా ధరణిలో నమోదు చేసిన ఉదంతాలు అనేకం ఉన్నాయి.
* 27 ఇ కూడా నమోదు చేయని ఉదంతాలు ఉన్నాయి.

సెటిలైనా.. అంతేనా?

పాయిగా, జాగీర్, సంస్థాన్ వంటి భూములకు ఆర్వోఆర్ వర్తించదు. వాటిని ప్రభుత్వ భూములుగా రెవెన్యూ రికార్డుల్లో పేర్కొన్నారు. వీటిలో కొన్ని భూములు సెటిల్ అయ్యాయి. వాటిని 1971 చట్టంలో 2018 లో సెక్షన్ 12-ఎ సబ్ సెక్షన్ 3 ప్రకారం అంతకు ముందే సెటిల్ చేసిన పాయిగా, జాగీర్ భూములకు ఈ నియమం వర్తించదని సవరణ చేశారు. కానీ కొత్త ఆర్వోఆర్ చట్టంలో అలాంటి వెసులుబాటు కల్పించలేదు. అలాంటి భూముల జాబితా ఏ తహసీల్దార్ దగ్గర లభించడం లేదు. వాటిని ఏ విధంగా ప్రభుత్వ భూములుగా రికార్డు చేస్తారన్న సందేహం కలుగుతోంది.

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రూ.వేల కోట్ల విలువైన పాయిగా భూములు సీఎస్ 14/1958, సీఎస్ 7/1958 ప్రకారం అనేకం వివాదాల్లో ఉన్నాయి. వాటిని ఎలా రికార్డు చేస్తారో అంతుచిక్కడం లేదు. ఖుర్షిదా పాయిగా, ఆస్మాన్ జాసి పాయిగా, సర్ వికార్వలా పాయిగా వంటి మూడు రకాల పాయిగాలు ఉన్నాయి. వీటికి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా హైదర్ నగర్, హస్మతిపేట, హఫీజ్ పేట, శంషీగూడ, ఘాన్సీమియాగూడ ప్రాంతాల్లో వేలాది ఎకరాలు ఉన్నాయి. ప్రధానంగా హైదర్ నగర్లో సర్వే నంబర్లు 145, 163, 172, హస్మతిపేట లో 1, 7, 15, 51, హఫీజ్ పేటలో 78 నుంచి 80 వరకు అత్యంత ఖరీదైన భూములు ఉన్నాయి. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కిడ్నాప్ ఉదంతం కూడా వీటిలో భాగమే.

Advertisement

Next Story