వైద్యం పేరిట లైంగిక వేధింపులు.. దేహశుద్ధి

దిశ, ఏపీ బ్యూరో: వైద్యం ముసుగులో లైంగిక వేధింపులకు పాల్పడిన పారామెడికల్ వైద్యుడికి దేహశుద్ధి చేసిన ఘటన ఏలూరు వన్‌టౌన్‌ ప్రాంతంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ఘటన వివరాల్లోకి వెళ్తే… ఏలూరు వన్‌టౌన్‌ నవాబ్‌పేట మారుతీనగర్‌ ప్రాంతంలో పి.సత్యానందం అనే వ్యక్తి ఓ క్లినిక్‌ను నిర్వహిస్తున్నాడు. అతను ఏలూరు ఆర్‌ఆర్‌పేటలోని ఒక కంటివైద్యశాలలో పారామెడికల్‌ వైద్యునిగా పనిచేస్తున్నాడు. స్థానికంగానూ క్లినిక్‌ నిర్వహిస్తూ వైద్యం అందిస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన ఒక యువతి తలనొప్పితో బాధపడుతూ ఆదివారం క్లినిక్‌కు వచ్చింది. మరోసారి రమ్మంటే ఆయన సూచన మేరకు తన తమ్ముడిని తీసుకువెళ్లింది. అయితే వైద్యుడు సత్యానందం యువతికి ఒక ఇంజెక్షన్‌ చేశాడు. తల తిరుగుతుందని, కొంచెం సేపు ఓర్చుకోవాలంటూ ఆమెకు చెప్పాడు. ఇదే క్రమంలో ఆమెపై లైంగిక దాడికి ప్రయత్నించడంతో యువతి గట్టిగా కేకలు వేసింది. బయట ఉన్న యువతి సోదరుడు లోనికి వెళ్లి అడ్డుకున్నాడు. బంధువులకు సమాచారం ఇవ్వటంతో వారంతా క్లినిక్‌ వద్దకు చేరుకుని వైద్యునికి దేహశుద్ధి చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వన్‌టౌన్‌ పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement