పెళ్లిళ్లకు వచ్చింది పెద్ద కష్టం!

by  |
పెళ్లిళ్లకు వచ్చింది పెద్ద కష్టం!
X

శ్రావణమాసంలో ఇళ్లంతా పెళ్లి కార్డులతో, అవి ఇవ్వడానికి వచ్చే అతిథులతో సందడిగా ఉండేది. ఇప్పుడు కూడా పెళ్లి కార్డులు వస్తున్నాయి, కానీ వాట్సాప్‌లో. ‘తెలుగువారి పెళ్లి.. ఇల వైకుంఠమే మళ్లీ’ అని ఒక పాట ఉంది. ఇప్పుడు అలా పెళ్లి చేస్తే వైకుంఠమేమోగానీ, ఇల క్వారంటైన్ అయిపోద్ది. అందుకే పెళ్లిళ్లు జరుగుతున్నాయి కానీ గొప్పగా కాదు, తూతూ మంత్రంగా జరుపుకుంటున్నారు. దగ్గరి వాళ్లను పిలుచుకుని తతంగం కానిచ్చేస్తున్నారు. ప్రతి పెళ్లిలోనూ తప్పకుండా ప్లే చేసే వరుడు సినిమాలో ఐదు రోజుల పెళ్లి పాటను ఈ సందర్భంగా గుర్తుచేసుకోవాలి. ఒకప్పుడు పెళ్లిళ్లు అన్నీ ఈ పాటలోలాగా ఫ్రేమ్ నిండా జనాలతో నిండి ఉండేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అమ్మాయి తరఫున 10 మంది, అబ్బాయి తరఫున 10 మందిని పిలిచి గ్రూప్ ఫొటో దిగి కానిచ్చేస్తున్నారు. దీనంతటికీ కారణం కరోనా. ఇవి మాత్రమే కాదు పెళ్లిళ్ల ట్రెండులో చాలా మార్పులు వచ్చాయి. అవేంటో ఓ లుక్కేద్దాం!

భారతీయులు భారీగా ఖర్చుగా పెట్టి పెళ్లిళ్లు చేసుకుంటారని ప్రతీతి. ఇక్కడ వెడ్డింగ్ ప్లానింగ్ వ్యాపారం కూడా మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగుతోంది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. నెలల తరబడి పెళ్లి కోసం ప్లాన్‌లు వేయాల్సిన పని లేదు. ఇంట్లో చిన్నగా బర్త్‌డే పార్టీ చేసుకున్నట్లు చేసుకుంటున్నారు. ఒకప్పుడు శ్రావణమాసంలో పెళ్లి అంటే ఫంక్షన్ హాల్ దొరుకుతుందో లేదోనని మూడు నెలల ముందే బుక్ చేసుకునేవారు. ఇప్పుడేమో 100 మందిని పిలవడానికి పర్మిషన్ దొరుకుతుందో లేదోనని కంగారు పడుతున్నారు. వెడ్డింగ్ కార్డులు వాట్సాప్‌కు మారాయి, ఆశీస్సులు, అక్షింతలు వాట్సాప్ వీడియోలుగా మారాయి. ఇక భోజనాల సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు ఏమేం వంటలు పెట్టి అతిథులను సంతృప్తి పరచాలని ఆలోచించేవారు, కానీ ఇప్పుడు అతిథులు వస్తే చాలు, ఏదో ఒకటి పెట్టి పంపించవచ్చు అనుకుంటున్నారు. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు.. అంటుంటారు. కానీ ఇప్పుడు పెళ్లి చేయడం చాలా తేలిక అయిపోయింది. అలా మిగిలిన డబ్బుతో ఇల్లు కట్టించుకుంటే అది కూడా సులభమే అవుతుంది.

ఒకవేళ పది, ఇరవై మందితో పెళ్లి చేసుకున్నప్పటికీ పెళ్లి ఖర్చు కంటే ఎక్కువ మాస్కులు, శానిటైజర్లకే అవుతోంది. ఇక గ్రామాల్లో చేసే పెళ్లిళ్లకు మధ్యలో ఏ పోలీసు వచ్చి, ఏం ఇబ్బంది పెడతారోనని ఆందోళన కలుగుతోంది. పెళ్లికి వచ్చిన వారిలో ఏ ఒక్కరికి కరోనా ఉన్నా మొత్తం అందరినీ క్వారంటైన్ చేస్తారని, తమ పెళ్లి వల్లే బంధువుల ఆరోగ్య విషమించిందని మాట వస్తుందేమోనని భయపడుతున్నారు. అందుకే బంధాలను దూరం పెడుతున్నారు. అయితే పెళ్లి జరిపే విషయంలో కరోనా మహమ్మారి ఒకింత సాయం చేసిందనే చెప్పుకోవచ్చు. పరువు ప్రతిష్టల కోసం, సమాజంలో పేరు కోసం కూతురి పెళ్లికి అప్పులు చేసి మరీ ఖర్చు పెట్టే ఓ మధ్యతరగతి తండ్రికి ఇది మంచి పరిణామమే. తీరా ఖర్చు చేసి పెళ్లి చేశాక వివిధ కారణాలతో ఆ బంధం నిలబడక కూతురు ఇంటికొస్తుంది, కానీ అప్పు మాత్రం అలాగే ఉంటుంది. ఇప్పుడు ఈ సమస్య లేదు. అల్లుడు మంచి వాడైతే చాలు అనుకుంటున్నారు. ఈ పెళ్లి ఖర్చులో మిగిలిన డబ్బుతో అల్లుడికి అడిగిన బండి కొనిచ్చి మధ్యతరగతి మామలు మంచి పేరు కొట్టేస్తున్నారు. ఇంకా పెళ్లి అంటే పెద్దగా ఆసక్తి లేని, పెళ్లికాని ప్రసాద్‌లకు కూడా మంచి అవకాశం వచ్చింది. పెళ్లెప్పుడు అని ఇరుగుపొరుగు వాళ్లు అడిగే ప్రశ్నలకు కరోనా తర్వాత.. అని సమాధానం చెప్పుకునే అవకాశం దొరికింది. ఆ కరోనా ఇప్పట్లో పోదు.. వీళ్లకు ఇప్పట్లో పెళ్లి గోల ఉండదు. చూద్దాం.. ఇలా ఎంతకాలం కొనసాగుతుందో మరి!


Next Story

Most Viewed