- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
LRSతో పంచాయతీల పరేషాన్..!
దిశప్రతినిధి, రంగారెడ్డి: ఎన్నో యేండ్లుగా గ్రామకంఠం పరిధిలో ఇండ్లు నిర్మించుకుని నివాసముంటున్న ప్రజలకు ఎల్ఆర్ఎస్ భయం పట్టు కుంది. ఇప్పటి వరకు చాలా మంది ఇండ్లను రిజిస్ట్రేషన్లు చేసుకోలేకపోయారు. ఉపాధి కోసం పట్టణాలకు వెళ్లిన ప్రజలు లాక్డౌన్తో ఇంటికి చేరుకుని స్థలాలు పంచుకోవడం మొదలు పెట్టారు. ఆ స్థలాలను రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు గ్రామ కార్యదర్శుల చుట్టూ తిరుగుతున్నారు. గ్రామ పంచాయతీ కార్యాల యం నుంచి ధ్రువీకరణ పత్రం, చెల్లించిన పన్ను రశీదును తీసుకుని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎల్ఆర్ఎస్తో సంబంధంలేదని జిల్లా పంచా యతీ అధికారులే స్పష్టం చేస్తున్నారు. లేఅవుట్లు చేసి ప్లాట్లు విక్రయిస్తే కచ్చితంగా ఎల్ఆర్ఎస్ ఉండాల్సిందేనని ప్రభుత్వం విడుదల చేసిన జీవో స్పష్టం చేస్తుంది.
హైదరాబాద్ నగరశివారులో ఇష్టారాజ్యంగా లేఅవుట్లు చేస్తున్నారు. ఈ లేఅవుట్లకు నిబంధనల ప్రకారం అనుమతులున్నాయా లేవా అనేది తెలుసుకోకుండానే కొంత మంది కొనుగోలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 131 జీవో ప్రకారం లేఅవుట్లు చేసి ప్లాట్లు విక్రయిస్తే అందుకు ఎల్ఆర్ఎస్ (లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్) ఉండాలి. లేని పక్షంలో అటువంటి వాటికి రిజిస్ట్రేషన్ చేయడం కుదరదు. కానీ, ఇప్పటికే రిజిస్ట్రేషన్ అయితే ఎల్ఆర్ఎస్ ఉంటే నే ఇంటి నిర్మాణానికి అనుమతులు ఇస్తారని అధికారులు వివరిస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో సగానికి పైగా గ్రామాలు హెచ్ఎండీఏ పరిధిలోనే ఉన్నాయి. ఎల్ఆర్ఎస్ లేకుండానే హెచ్ఎండీఏ పరిధిలోని ఇబ్రహీంపట్నం, అబ్దుల్లాపూర్ మెట్, యాచారం, మహేశ్వరం, కందుకూర్, షాద్నగర్ మండలాల్లోని మేజర్ గ్రామాలు హెచ్ఎండీఏ పరిధిలోనే ఉన్నాయి. వీటిలో ఇప్పటి వరకు సుమారుగా 5వేలకు పైగా అక్రమ లేఅవుట్లు ఉన్నాయని అధికారులు వివరిస్తున్నారు. గ్రామ పంచాయతీల పరిధిలో నూతనంగా నిర్మించిన లేఅవుట్లు సుమారుగా 3వేలకుపైగా ఉన్నాయని జిల్లా పంచాయతీ అధికారులు స్పష్టం చేస్తున్నారు. లేఅవుట్లు చేసి విక్రయాలు చేశారో ఆ లేవుట్లకు, ప్లాట్లకు అనుమతి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో 31 గ్రామ పంచాయతీలున్నాయి. ఇందులోని అన్ని గ్రామాలు హెచ్ఎండీఏ పరిధిలోకి వస్తాయి. ఈ మండలంలో 460 లేఅవుట్లు ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. ఇందులో కేవలం పదుల సంఖ్యలో వాటికే ఎల్ఆర్ఎస్ అనుమతి ఉంది. మిగిలిన లేవుట్లు పంచాయతీ అనుమతితో నిర్మించినట్లు తెలుపుతున్నారు. కానీ ఎప్పటినుంచో ఈ మండలం హెచ్ఎండీఏ పరిధిలో ఉంది. అప్పుడే ఎల్ఆర్ఎస్ అనుమతి తీసుకోవాల్సి ఉంది. గ్రామకంఠం పరిధిలో ఉందని తాత్కాలిక పత్రాలతో లేఅవుట్లు చేసినట్లు తెలుస్తోంది.
మెయినాబాద్ మండల పరిధిలో అధికార పార్టీ నేతల మద్దతుతో ఇష్టానుసారంగా అక్రమ లేవుట్లు చేసి విక్రయాలు జరిపారు. పలుమార్లు జిల్లా పంచాయతీ అధికారి ఆధ్వర్యంలో లేఅవుట్లను తొలగించడం జరిగింది. అయినప్పటికీ తిరిగి నిర్మాణాలు చేపడుతున్నారు. మెయినాబాద్ మండలంలోని అన్ని గ్రామాల్లో 111 జీవో అమలులో ఉంది. అక్కడ లేఅవుట్లు, నిర్మాణాలు చేసేందుకు అవకాశం లేదు. అంతేకాకుండా అదే మండలంలోని రెండు, మూడు గ్రామాల్లో లే అవుట్లు చేసేందుకు అవకాశం ఉంది. అక్కడ కూడా అక్రమ లేవుట్లు చేసి విక్రయాలు జరిపారు.
కార్యదర్శుల వసూళ్ల పర్వం..
జిల్లాలోని పలు గ్రామ పంచాయతీల్లో లేఅవుట్లతో సంబంధం లేకుండా ఆనాటి నుంచి వారసత్వంగా వస్తున్న ఇండ్లకు ఎల్ఆర్ఎస్ తీసుకోవాలని గ్రామ కార్యదర్శులు సూచిస్తున్నారు. దీంతో గ్రామీణ ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రిజిస్ట్రేషన్ చేసేందుకు గ్రామ కార్యదర్శి ఇవ్వాల్సిన ధ్రువీకరణ పత్రాలకు అధిక మొత్తంలో నగదు వసూలు చేస్తున్నారు. మహేశ్వరం మండలంలోని తుమ్మలూర్ లో ఓ వ్యక్తి ఇటీవల గ్రామ కంఠంలోని భూమిని రిజస్ట్రేషన్ చేసుకునేందుకు ధ్రువీకరణ పత్రాలు కావాలని అడిగారు. ఇంటి పన్ను, నల్లా పన్నుతో పాటు ఆన్లైన్ లో నమోదు చేస్తామని నగదు వసూలు చేసినట్లు సమాచారం. ఇంటి, నల్లా పన్ను చెల్లిస్తే అతనికి గ్రామ పంచాయతీ ధ్రువీకరణ పత్రం నిబంధనల ప్రకారం ఇవ్వాలి. కానీ, ఆన్లైన్ పేరుతో నగదు వసూళ్లు చేస్తున్నారు. ఇంటి నెంబర్, ఇంటి యాజమాని పేరు, ఇంటి స్థలం (గజాలు) రికార్డుతో పాటు ఆన్ లైన్లో నమోదు చేసుకోవాల్సిన బాధ్యత కార్యదర్శులది. నిబంధనలకు విరుద్ధంగా ఇంటి స్థలం విలువలో 2శాతం వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలా అన్ని గ్రామ పంచాయతీల్లో నడుస్తున్నట్లు తెలుస్తోంది.
లేఅవుట్ల లెక్కలు తీస్తున్నారు..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 131 జీవో ప్రకారం ఏఏ గ్రామాల్లో ఎన్ని లేఅవుట్లు ఉన్నాయి, ఇప్పటికి ఎన్ని లేఅవుట్లలో ప్లాట్లు విక్రయించారనే వివరాలను ప్రభుత్వం సేకరిస్తుంది. అనుమతున్నవి, లేనివి వివరాలను సేకరిస్తున్నారు. ఈ నెల 15వ తేదీ లోపు ప్రతి గ్రామంలోని లేఅవుట్ల వివరాలు జిల్లా పంచాయతీ అధికారులు అందజేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. గ్రామాల్లో లేఅవుట్లు, అనధికార ప్లాట్లు క్రమబద్ధీకరించడానికి ఇదే మంచి అవకాశమని ప్రభుత్వం సూచిస్తుంది. ఎల్ఆర్ఎస్ ద్వారా యజమానులు సొంత హక్కును పొందగలుగుతారు. అక్టోబర్ 15 లోపు రెగ్యులరైజేషన్ కోసం అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లయితే వారికి ప్రాథమిక సౌకర్యాలు, వాటితో పాటు ఇతర ప్రభుత్వ ప్రయోజనాలు కూడా అందుతాయని ప్రభుత్వం తెలిపింది. అక్టోబర్ 15లోపు దరఖాస్తు చేసుకోవాలని, ఆ వ్యక్తులు రెగ్యులరైజేషన్ ఫీజును 2021 జనవరి 31వ తేదీ లోపు చెల్లించాలని సూచించారు. ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కింద మిగులు భూములు, ఎండోమెంట్స్, సరస్సుల సమీపంలో, నీటి వనరుల్లో నిర్మించిన లేవుట్లకు ఈ పథకం వర్తించదని జీవో లో పేర్కొన్నారు.