జగన్ జలదోపిడితో పాలమూరు ఎడారి కానుందా..

by srinivas |   ( Updated:2020-05-09 19:19:18.0  )
జగన్ జలదోపిడితో పాలమూరు ఎడారి కానుందా..
X

దిశ, న్యూస్ బ్యూరో/మహబూబ్‌నగర్:

గుడిని మింగేవాడు ఒకడైతే గుడిలో లింగాన్ని కూడా మింగేవాడు మరొకడు.. అనే సామెత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌కు అచ్చు గుద్దినట్లు సరిపోతుంది. పరిపాలన సంగతి ఎలా ఉన్నా కృష్ణా జలాల దోపిడీలో మాత్రం తండ్రిని మించిన తనయుడిగా వ్యవహరిస్తున్నారు. నాడు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్సార్, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 45 వేల క్యూసెక్కుల నీటిని తరలించుకుపోతే ఇప్పుడు ఆయన తనయుడు జగన్ మాత్రం ఏకంగా 80 వేల క్యూసెక్కులనే తీసుకుపోయే ప్లాన్ వేశారు. మున్ముందు ఏకంగా కృష్ణా నదినే మళ్ళించేస్తారు కాబోలు! ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అలానే అనిపిస్తోంది. పోతిరెడ్డిపాడు కాలువ సామర్థ్యాన్ని 80 వేల క్యూసెక్కులకు పెంచేలా నాలుగు రోజుల క్రితం ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సుమారు రూ. 7,045 కోట్లు ఖర్చు కానున్నట్లు చీఫ్ ఇంజనీర్ ప్రతిపాదనలు పంపితే ప్రభుత్వం దాన్ని సవరించి సుమారు రూ. 6,920 కోట్ల ఖర్చుకు ఆమోదం తెలిపింది. ఈ ప్రతిపాదన ప్రకారం రోజుకు ఎనిమిది టీఎంసీల మేర కృష్ణా జలాలు రాయలసీమకు తరలిపోతాయి. ఇదే జరిగితే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని 14 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందవు. అంతేకాకుండా ఆ ప్రాంతానికి తాగునీటిని అందించే మిషన్ భగీరథ పథకం ప్రశ్నార్థకం కానుంది. కాగా, ఆంధ్రప్రదేశ్ జీఓ వెలువడి నాలుగు రోజులు గడుస్తున్నా, ఇప్పటివరకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కాని, టీఆర్ఎస్ పార్టీ తరఫున ఎవరైనా నేతలు కాని పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపుపై స్పందించకపోవడం గమనార్హం.

అలవాటుపడ్డ ప్రాణం ఊరుకుంటుందా?

కృష్ణా నది నీటిని బేసిన్‌లోని నాలుగు రాష్ట్రాలు ఏ నిష్పత్తిలో ఎంతెంత వాడుకోవాలో బచావత్ ట్రిబ్యునల్ చాలా స్పష్టంగా చెప్పింది. ఆ ప్రకారం ఉమ్మడి రాష్ట్రం 811 టీఎంసీల నీటిని వాడుకోవచ్చు. ఉమ్మడి రాష్ట్రంలో కుదిరిన అవగాహన ప్రకారం తెలంగాణ వాటా 299 టీఎంసీలు. కానీ ఏనాడూ ఆ నిష్పత్తి ప్రకారం తెలంగాణ వాడుకోలేకపోయింది. గతేడాది లెక్కలనే పరిశీలిస్తే తెలంగాణ 269 టీఎంసీలే వాడుకుంది. ఆంధ్రప్రదేశ్ మాత్రం తన పరిధిని మించి వాడుకుంది. ఏకంగా 637 టీఎంసీలు వాడుకున్నట్లు ఆ రాష్ట్ర అధికారులే ఒప్పుకున్నారు. ఇందులో రాయలసీమకు తరలించిన జలాలే సుమారు 300 టీఎంసీలు ఉన్నాయి. ఇలా నీటి దోపిడీకి అలవాటుపడ్డ ఆంధ్రప్రదేశ్ ఇకపైన కూడా దీన్ని అలానే కొనసాగించాలనుకుంటోంది. కొత్తగా ఎత్తిపోతల పథకాలను కట్టి ఆ అలవాటును ఒక హక్కుగానే స్థిరపర్చుకోవాలనుకుంటోంది. నదీ జలాల వినియోగానికి సంబంధించి రూపొందిన ఆపరేటింగ్ మాన్యువల్‌‌ అంటే ఆ రాష్ట్రానికి లెక్కే లేదు. రెండు రాష్ట్రాల మధ్య ఏర్పడిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఆదేశాలను అమలుచేయడంలో చిత్తశుద్ధి అంతకంటే లేదు.

కృష్ణా జలాలను శ్రీశైలం రిజర్వాయర్ నుంచి రాయలసీమ అవసరాల కోసం వాడుకోడానికి గతంలో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం 11,500 క్యూసెక్కులు. కానీ వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తెలంగాణ అవసరాలను కూడా పట్టించుకోకుండా దాన్ని 45 వేల క్యూసెక్కులకు పెంచుకున్నారు. శ్రీశైలంలో కనీస నీటిమట్టాన్ని 854 అడుగుల మేర కొనసాగించాలనే జీవో గతంలో ఉండేది. దాన్ని తుంగలో తొక్కి వైఎస్సార్, చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రులుగా ఉన్న సమయంలో రకరకాల జీవోలు తెచ్చి 833 అడుగుల దాకా నీటిని తోడేశారు. వీరిద్దరూ రాయలసీమకు చెందినవారే కావడంతో ఆ ప్రాంతానికి నీటిని తరలించుకుపోయారు. చంద్రబాబు హయాంలో ఒకసారి 811 అడుగుల వరకూ వాడేసుకున్నారు. నిజానికి శ్రీశైలం కుడికాల్వ నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా 19 టీఎంసీలు, తెలుగుగంగ ప్రాజెక్టుకు మరో 15 టీఎంసీలు మాత్రమే వాడుకునే హక్కు ఏపీకి ఉంది. కానీ తెలంగాణ ఏర్పడుతున్న సమయంలో ఏకంగా 60 టీఎంసీలను వాడుకుంది. ఇప్పుడు ఇంత వేసవిలో సైతం రాయలసీమ అవసరాలకు అక్కడి ప్రాజెక్టుల్లో దాదాపు 100 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇక పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని 80 వేల క్యూసెక్కులకు పెంచితే తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతుంది.

ఇప్పటికే ఐదున్నర టీఎంసీలు..

పోతిరెడ్డిపాడు ద్వారా 45 వేల క్యూసెక్కుల వంతున రాయలసీమకు కృష్ణా జలాలు వెళ్తున్నాయి. దీనికి తోడు హంద్రీనీవా సుజల స్రవంతి ద్వారా 8,500 క్యూసెక్కులు, వెలిగొండ టన్నెళ్ళ ద్వారా 11,500 క్యూసెక్కుల వంతున వెళ్ళే పనులు నడుస్తున్నాయి. వీటన్నింటి ద్వారా సుమారు 65 వేల క్యూసెక్కుల నీటిని ఏపీ వినియోగించుకునే వెసులుబాటు కలిగింది. ఇక ఇప్పుడు పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని 80 వేల క్యూసెక్కులకు పెంచితే మొత్తం 1.04 లక్షల క్యూసెక్కులను తోడేసుకునే వీలు చిక్కుతుంది. అంటే ఇప్పుడు రోజుకు ఐదున్నర టీఎంసీలను వాడుకునే సౌకర్యంతో పాటు తాజాగా ఏపీ ప్రభుత్వం రూపొందించిన ప్రతిపాదనతో ఇది 8 టీఎంసీలకు పెరుగుతుంది. అసలే కృష్ణా నదికి చాలా ఏళ్ళుగా అంచనాల ప్రకారం నీరు రావడంలేదు. ఎగువన కర్నాటక, మహారాష్ట్రల్లో వందలాది చెక్ డ్యాంలు, ప్రాజెక్టులు కట్టడం ఇందుకు కారణం. ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కువ భూభాగం ఉన్న తెలంగాణకు బదులుగా ఆంధ్రప్రదేశ్ దొడ్డిదారిన పదుల కొలదీ టీఎంసీల నీటిని తరలించుకుపోతోంది.

ఏ సీజన్‌లో ఎంత నీటిని తీసుకోవాలనేదానిపై ఒక ఆపరేటింగ్ మాన్యువల్ ఉంటుంది. కాని దాన్ని ఏపీ ఏనాడూ గౌరవించలేదు. పోతిరెడ్డిపాడు కాలువ సామర్థ్యాన్ని పెంచుకుంటూ పోవడమే ఇందుకు నిదర్శనం. ఒకప్పుడు ప్రతీ ఏటా సగటున 90 రోజుల పాటు వరద నీరు కృష్ణా బేసిన్‌లోని తెలంగాణ ప్రాంతానికి వచ్చేది. కానీ ఇప్పుడు ఎగువ రాష్ట్రాల్లో ప్రాజెక్టులు నిర్మించినందున అది 30 రోజులకు తగ్గిపోయింది. ఇలాంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకునే ఉమ్మడి రాష్ట్రంలో శ్రీశైలం కనీస నీటి మట్టం నిర్వహణను 854 అడుగుల నుంచి 832కు తగ్గించే జీవో వచ్చింది. తాజాగా జగన్ తీసుకొచ్చిన జీవో ప్రకారం అది 800 అడుగులకు పడిపోయే ప్రమాదం ఏర్పడింది.

ఆంధ్ర కొత్త ప్రతిపాదనలేంటి?

ఒకవైపు రాయలసీమలోని ఎత్తిపోతల ప్రాజెక్టుల మోటారు పంపుల సామర్థ్యాన్ని పెంచడంతో పాటు కాలువల సామర్థ్యాన్ని కూడా పెంచే ఆలోచన చేస్తోంది ఆ ప్రభుత్వం. కాలువల విస్తరణ, లైనింగ్ పనులు, గోరకల్లు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ దగ్గర అదనపు రెగ్యులేటర్ నిర్మాణం లాంటి ఒక్కో పనికి ఎంత చొప్పున ఖర్చు చేయనుందో ఆ జీవోలో ఆ రాష్ట్ర సాగునీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాధ్ దాస్ వివరించారు. వాటిని పరిశీలిస్తే…
1. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి సంగమేశ్వరం నుంచి రోజుకు మూడు టీఎంసీల చొప్పున నీటిని లిఫ్ట్ చేసి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దిగువన నాల్గవ కి.మీ. పాయింట్ దగ్గర శ్రీశైలం కుడి ప్రధాన కాలువలో పోయడం. ఇందుకు అవసరమైన అప్రోచ్ ఛానెల్ నిర్మాణం, లిప్టు వ్యవస్థ ఏర్పాటు, పంపు స్టేషన్ల నిర్మాణానికి అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడానికి రూ. 3,825 కోట్లను మంజూరు చేసింది ప్రభుత్వం.
2. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులరేటర్ కాల్వను వెడల్పు చేయడం, బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ పనులను విస్తరించడం కోసం రూ. 570 కోట్లను మంజూరు చేసింది. ఈ నిధులతో ప్రస్తుతం ఉన్న 45 వేల క్యూసెక్కుల హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 80 వేలకు పెంచనుంది. ఇలా తీసుకున్న నీటిని శ్రీశైలం కుడి ప్రధాన కాలువలో పోయడానికి అవసరమన అప్రోచ్ ఛానెళ్ళను వెడల్పు చేయడం, తెలుగు గంగ గేట్ల ఇంప్రూవ్‌మెంట్ పనులు కూడా జరగనున్నాయి.
3. శ్రీశైలం కుడికాల్వ, గాలేరు-నగరి కాల్వలకు లైనింగ్ చేయడంతో పాటు 30 వేల క్యూసెక్కుల ప్రవాహాన్ని తట్టుకునే విధంగా మెరుగుపర్చడానికి రూ. 936 కోట్లను ఖర్చు చేయనుంది. కొత్తగా కొన్ని బ్యాలెన్సింగ్ నిర్మాణాలు కూడా చేపట్టనుంది.
4. గోరకల్లు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు పది వేల క్యూసెక్కుల ప్రవాహంతో నీరు వెళ్ళేలా ప్రధాన ఛానెల్‌ను నిర్మించడం, అదనపు రెగ్యులరేటర్‌ను నెలకొల్పడానికి రూ. 36.95 కోట్లను ఖర్చు చేయనుంది.
5. గోరకల్లు, అవుకు రిజర్వాయర్ల మధ్య 30 వేల క్యూసెక్కుల వంతున నీరు ప్రవహించేలా శ్రీశైలం కుడి కాల్వ, గాలేరు నగరి కెనాళ్ళ లైనింగ్ పనుల కోసం రూ. 1457 కోట్లను ఖర్చు చేయనుంది.

పాలమూరు ప్రాజెక్టులతో తెలంగాణకు హక్కులు..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త ప్రాజెక్టుల ద్వారా ఎక్కువ మోతాదులో కృష్ణా జలాలను తరలించుకుపోవడం తెలంగాణ హక్కులకు విఘాతం కలిగించనుంది. ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్న పాలమూరు-రంగారెడ్డి, కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా, డిండి, ఎలిమినేటి మాధవరెడ్డి టన్నెల్ లాంటి పనులను త్వరితగతిన పూర్తి చేయడం ద్వారా ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ఆయకట్టును, మిషన్ భగీరధ ద్వారా త్రాగునీటి అవసరాలను తీర్చడం సాధ్యమవుతుంది. ఆ ప్రకారం రాష్ట్రానికి కృష్ణా జలాల వినియోగానికి సంబంధించిన హక్కులను కాపాడుకున్నట్లవుతుంది. నిజానికి కృష్ణా జలాలపై ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాతో పాటు నల్లగొండ జిల్లా ప్రజలు, రైతులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ కొత్త ప్రతిపాదనలతో తెలంగాణకు పెను ముప్పే రానుంది. తెలంగాణ విశ్రాంత ఇంజనీర్లు, పాలమూరు జిల్లా రాజకీయ నాయకులు సైతం ఏపీ తాజా జీవో పట్ల ఆందోళన వ్యక్తం చేశారు.

కేసీఆర్ తక్షణం స్పందించాలి : డీకే అరుణ

”పోతిరెడ్డిపాడు విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మౌనం వీడాలి. ఉమ్మడి రాష్ట్రంలో పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని 40 వేల టీఎంసీలకు పెంచితే అప్పట్లో కేసీఆర్ గగ్గోలు పెట్టారు. ఇప్పుడు జగన్ 80 వేలకు పెంచుతున్నా కేసీఆర్ నోరు విప్పడంలేదు. జగన్‌తో కేసీఆర్ కుమ్మక్కయ్యారన్న అనుమానం కలుగుతోంది. పోతిరెడ్డిపాడుకు మూడు టీఎంసీలను తరలించేందుకు వీలుగానే పాలమూరు ప్రాజెక్టుకు గతంలో ఉన్న రెండు టీఎంసీలను ఒక టీఎంసీకి తగ్గించినట్లున్నారు. ఏపీ ప్రభుత్వానికి అడ్డుకట్ట వేయకపోతే పాలమూరు రైతులు, ప్రజలు ఇబ్బంది పడక తప్పదు. ఇప్పటికైనా కేసీఆర్ స్పందించాలి. ప్రజలకు వివరణ ఇవ్వాలి” అని బీజేపీ నేత, పాలమూరు జిల్లాకు చెందిన డీకే అరుణ వ్యాఖ్యానించారు.

నీటి వాటా వినియోగంలో తెలంగాణ విఫలం : గుందిమళ్ళ సాధన సమితి

”కృష్ణా నది నీటిలో తెలంగాణ తన వాటాను వినియోగించుకోవడంలో విఫలమైంది. ఆంధ్ర నాయకులకు ఉన్న శ్రద్ధ తెలంగాణ నేతల్లో లేదు. ఆంధ్ర ప్రభుత్వం పోతిరెడ్డిపాడు ద్వారా కృష్ణా జలాలను దోచుకుపోతూ ఉంటే తెలంగాణ ప్రభుత్వం మౌనంగా ఉండడం సబబు కాదు. తెలంగాణ ప్రాజెక్టుల భవిష్యత్తు ప్రశ్నార్థకం కానుంది. సుమారు మూడున్నర దశాబ్దాలుగా పాలమూరు జిల్లా నీటి దోపిడీకి గురవుతూనే ఉంది. ఏపీని నిలువరించకపోతే దక్షిణ తెలంగాణ ఎడారిగా మారుతుంది” అని వెల్టూరు-గుందిమళ్ళ సాధన సమితి నాయకులు మాదాసి కురువ పెద్ద మల్లయ్య, పెరుమాళ్ళ శ్రీనివాసులు వ్యాఖ్యానించారు.

Advertisement

Next Story