నీట మునిగిన బ్రిడ్జి.. పాకాల-కొత్తగూడెం రహదారి బంద్

by Shyam |   ( Updated:2021-09-28 05:03:48.0  )
నీట మునిగిన బ్రిడ్జి.. పాకాల-కొత్తగూడెం రహదారి బంద్
X

దిశ, ఖానాపూర్ : ఉమ్మడి వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని అశోకనగర్ శివారులో గల పాకాల వాగు లో లెవెల్ బ్రిడ్జి రెండు రోజులుగా కురుస్తోన్న భారీ వర్షానికి నీటిలో మునిగిపోయింది. మంగళవారం ఎంపీపీ ప్రకాష్ రావు, ఆర్డీవో పవన్ కుమార్ అశోకనగర్ కాజ్ వే ప్రాంతాన్ని సందర్శించారు. వరద నీరు ప్రమాదకరంగా ప్రవహిస్తుండటంతో రహదారి గుండా రాకపోకలు నిలిపివేశారు. ప్రయాణికులు, వాహనదారులు ఈ రహదారి ద్వారా ప్రయాణం చేస్తే ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉన్నందున ఆర్డీవో పవన్ కుమార్ ఈ రహదారిని ముళ్లకంపతో మూసి వేయించారు.

రెవెన్యూ మరియు గ్రామ పంచాయతీ సిబ్బందిని కాపలాగా ఉంచి ప్రాణనష్టం జరగకుండా జాగ్రత్తలు పాటించాలని ఆదేశాలు జారీచేశారు. ఇది ఇల్లందుకు వెళ్లే షార్ట్ కట్ రహదారి, అలాగే పాకాల- కొత్తగూడెం ప్రధాన రహదారి సైతం కావడంతో ఈ మార్గం నిత్యం రద్దీగా ఉంటుంది. పాకాల సరస్సు మత్తడి పోసినప్పుడు, భారీ వర్షాల వలన వాగు మీద ఉన్న లో లెవల్ బ్రిడ్జి మునిగిపోతుంటుంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇక్కడ బ్రిడ్జిని మంజూరు చేసి త్వరగా నిర్మించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఆర్డీవో, ఎంపీపీతో పాటు వైస్ ఎంపీపీ రామసహాయం ఉమారాణి, రెవెన్యూ సిబ్బంది, పంచాయతీ సిబ్బంది మొదలుగు వారు బ్రిడ్జి వద్ద పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed