ప్రైవేటు ఆసుపత్రుల్లో సగం బెడ్‌లు ప్రభుత్వానికే

దిశ, న్యూస్‌బ్యూరో: ఒకవైపు హైకోర్టు హెచ్చరికలు, మరోవైపు ప్రభుత్వం షోకాజ్ నోటీసుల నేపథ్యంలో సగం బెడ్‌లను కరోనా చికిత్స కోసం ప్రభుత్వానికి అప్పగించడానికి ప్రైవేటు, కార్పొరేటు ఆసుపత్రులు ముందుకొచ్చాయి. ప్రభుత్వ నిబంధనలు పాటించని ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని హైకోర్టు చెప్పడంతో వేటు తప్పదనే భయంతో సానుకూలంగా స్పందించక తప్పలేదు. ఢిల్లీ తరహా విధానాన్ని ఎందుకు అమలుచేయడం సాధ్యంకాదో, అందుకు కారణాలను తెలియజేయాలని హైకోర్టు వ్యాఖ్యానించిన గంటల వ్యవధిలోనే ప్రైవేటు ఆసుపత్రుల యజమాన్యాలు వైద్యారోగ్య మంత్రితో చర్చలకు ముందుకొచ్చాయి. 50% బెడ్‌లను ప్రభుత్వానికి ఇస్తామని, ప్రభుత్వం నిర్ణయించిన ఛార్జీల మేరకే చికిత్స అందిస్తామని, కరోనా పేషెంట్ల కోసం వీటిని కేటాయిస్తామని ప్రైవేటు ఆసుపత్రుల తరఫున హాజరైన ప్రతినిధులు మంత్రికి హామీ ఇచ్చారు.

ప్రభుత్వ హెచ్చరికతో మెట్టు దిగి వచ్చిన ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు సగం బెడ్‌లను ఇవ్వడానికి హామీ ఇచ్చినందున అందుకు సంబంధించిన విధివిధానాలను ఖరారు చేయడానికి రాష్ట్ర ప్రజారోగ్య శాఖ డైరెక్టర్‌తో శుక్రవారం భేటీ కానున్నాయి. ప్రైవేటు ఆసుపత్రుల్లోని ఈ బెడ్‌లను వైద్యఆరోగ్య శాఖే నింపుతుంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక మొబైల్ యాప్‌ను ప్రభుత్వం రూపొందించనుంది. ఈ యాప్ ద్వారానే ప్రైవేటు ఆసుపత్రులకు పేషంట్లను వైద్య ఆరోగ్య శాఖ పంపిస్తుంది. ఈ అంశాన్ని వివరించగా ప్రైవేటు, కార్పొరేటు ఆసుపత్రుల యజమాన్యాలు అంగీకరించినట్లు మంత్రి ఒక ప్రకటనలో తెలిపారు.

మంత్రితో జరిగిన చర్చల్లో ప్రైవేటు, కార్పొరేటు ఆసుపత్రుల యాజమాన్యాల ప్రతినిధులతో పాటు వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వి, వైద్య విద్య డైరెక్టర్ డాక్టర్ రమేష్ రెడ్డి, ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు, నిపుణుల కమిటీ సభ్యులు కాళోజీ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ కరుణాకర్ రెడ్డి, డాక్టర్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement