ఎవరు గెల్చినా.. వచ్చేటియి వస్తయి..

by Anukaran |   ( Updated:2020-11-01 21:52:53.0  )
ఎవరు గెల్చినా.. వచ్చేటియి వస్తయి..
X

‘‘ఎవరికి ఓటేసినా మా బతుకులు మారింది లేదు.. మారేదీ లేదు.. ఎప్పుడు ఎన్నికలొచ్చినా ముచ్చట్లు చెప్పుడు, పబ్బం గడుపుకునుడు పార్టీలోళ్లకు అలువాటైంది.. ఎలక్షన్లు అయిన తర్వాత వాళ్ల ముఖం ఎట్లుంటదో కూడా చూపించరు.. ఓటేసినమంటే మమ్ముల పట్టించునేటోళ్లే ఉండరు.. అయినా పైసలు తీసుకుంటాం.. ఓటేసేటోళ్లకే వేస్తం.. వాళ్లు ఇస్తాంటే ఎందుకు తీసుకోవద్దు.. ఎవరెన్ని చెప్పినా వినేది వింటం.. మేం చేసేది చేస్తం..” అంటున్నారు దుబ్బాక ఓటర్లు.

దుబ్బాక, దిశ ప్రత్యేక ప్రతినిధి: దుబ్బాక ఉప ఎన్నికల సందర్భంగా అధికార, ప్రత్యర్థి పార్టీల మధ్య పింఛన్ల విషయంలో మాటల యుద్ధం జోరుగా సాగుతూనే ఉంది. పింఛన్లు ఎవరిస్తున్నారు, ఎందుకిస్తున్నారు, ఇంకొకరికి ఓటేస్తే ఏమవుతుంది లాంటి అంశాలపై సామాన్య జనాలకు కూడా క్లారిటీ వచ్చింది. చివరకు అక్షరజ్ఞానం లేని వృద్ధులకు కూడా విషయం తెలిసిపోయింది. రోజుకు ఐదారు వందల బీడీలు చేసే మహిళా కార్మికురాలు నెలకు నాలుగైదు వేలు సంపాదించుకుంటోంది. ప్రభుత్వం నుంచి అదనంగా రెండు వేల రూపాయల పింఛను వస్తోంది. కానీ ఇప్పుడు ఎన్నికల ప్రచారం సందర్భంగా అన్ని పార్టీల మాటలు విన్న తర్వాత ఓటు ఎవరికి వేయాలో, ఎవరికి వేయాల్సిన పనిలేదో స్పష్టతకు వచ్చారు.

కేవలం మహిళా కార్మికుల్లో మాత్రమేకాక చేనేతకారులు, వృద్ధులు, ఒంటరి మహిళలు సైతం ఈసారి ఏ పార్టీకి ఓటు వేయాలో, ఎందుకు వేయాలో నిర్ణయించేసుకున్నట్టు తెలుస్తోంది. ‘ఏ పార్టీకి ఓటు వేసినా పింఛను మాత్రం ఆగదంట గదా! అన్ని పార్టీలోల్లు గదే అంటున్నరు..’ అని అమాయకంగా ప్రశ్నించింది మరో వృద్ధురాలు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయానికి ఇప్పుడు దుబ్బాకలో జరుగుతున్న ఉప ఎన్నికలకూ మధ్య ఓటర్లలోని అవగాహన, చైతన్యంలో చాలా మార్పు కనిపిస్తోంది. గతంలో ఎన్నడూ లేనంతగా ఇప్పుడు వందలాది కార్లు, పెద్ద లీడర్లు ఎందుకు ప్రచారానికి వస్తున్నారో, ఇంతకు ముందెన్నడూ వివరంగా చెప్పలేని అంశాల్ని ఇప్పుడు తెరపైకి ఎందుకు తెస్తున్నారో ఆలోచించగలుగుతున్నారు. అభివృద్ధిలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల పాత్ర ఏ స్థాయిలో ఉందో తెలుసుకోగలుగుతున్నారు. ఆ చైతన్యమే ఈసారి పోలింగ్ సరళిలో మార్పు తీసుకురానుంది.

ఏ పార్టీకి ఓటేసినా పింఛను వస్తది..

నేనైతే చదువుకోలేదు. బీడీలు చుట్టడమే నాకు తెలిసిన విద్య. కొడుకు ఉన్నడుగానీ మానసిక, శారీరక దివ్యాంగుడు. ప్రభుత్వం నుంచి పింఛనైతే వస్తున్నది. అయితే ఆ పింఛను కోసమే ఇన్నాళ్లు ఒక పార్టీకి ఓటేసిన. ఇప్పుడు ఏ పార్టీకి ఓటేసినా పింఛను మాత్రం ఆగదని చెబుతున్నరు. పింఛను కోసం ఆ ఒక్క పార్టీకే ఓటు వేయాలన్న కండిషన్ లేదని కూడా అంటున్నరు. నేను కూడా మా సుట్టుపక్కలోల్లను కనుక్కున్న. ఏ పార్టీకి ఓటు వేసినా పింఛను ఆగదంటున్నరు. ఈసారి ఆలోచిస్త మరి. పైసలు ఎవరిచ్చినా నా ఓటు మాత్రం నేను అనుకున్న గుర్తుకే వేస్త. ఆ పైసలతోని నా కొడుకుకు మూడు చక్రాల బండి తీసిస్త

-ఎల్లమ్మ, బీడీ కార్మికురాలు, లచ్చపేట

ఎవ్వరికి ఓటేసినా నా బతుకైతే ఇదే గదా..

నాకు పెళ్లయినప్పటి నుంచీ బీడీలే చుడుతున్న. రోజుకు 180 రూపాయలు వస్తాయి. పిల్లల్ని కూడా చూసుకోవాల్సి రావడంతో నెలలో వారం రోజులు పని కుదురడంలేదు. ఇంతకాలం బీడీ పింఛను తీసుకున్నా. కానీ ఇప్పుడు తీసుకోవడంలేదు. పేరు తీసేయించుకున్నా. కానీ బీడీ చుట్టే పని మాత్రం చేస్తూనే ఉన్నా. డ్వాక్రా సంఘంలో చేరాను. చిన్న దుకాణం పెట్టుకున్నాను. చాలాసార్లు ఓటేశాను. ముత్యంరెడ్డి, రామలింగారెడ్డి .. వీరంతా తెలిసినోళ్లే. ఓటు కూడా వేశాను. కానీ నా బతుకైతే మారలేదు. నా అంతట నేను బతుకు మార్గం ఎంచుకున్నాను. ఏ పార్టీవాళ్లూ నాకు చేసిందేమీ లేదు. ఈసారి.. చూద్దాం..

-మహిళా బీడీ కార్మికురాలు, లచ్చపేట

Advertisement

Next Story

Most Viewed