కందనూలు కారులో లుకలుకలు!

by Shyam |
కందనూలు కారులో లుకలుకలు!
X

దిశ నాగర్ కర్నూల్: తెలంగాణ రాష్ట్రంలో మారుతున్న పరిణామాల నేపథ్యంలో నాగర్ కర్నూల్ నియోజకవర్గంలోని టీఆర్ఎస్ పార్టీలో అలజడి మొదలైంది. దుబ్బాక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఎన్నికల రిజల్ట్ అనంతరం కందనూలు నియోజకవర్గం కారు పార్టీలో కలవరం మొదలైంది. రాష్ట్రం ఏర్పడి ఆరేండ్లు గడిచినా ఉద్యమ సమయంలో పోరాడిన లక్ష్యాలను సాదించుకోలేక పోయామనే భావనతో టీఆర్ఎస్ నేతలే పెదవి విరుస్తున్నారు.

సీక్రెట్‌గా సర్వే..

రాష్ట్రంలో బీజేపీ రోజురోజుకూ బలపడుతున్న నేపథ్యంలో నాగర్‌కర్నూల్ నియోజకవర్గ పార్టీ పరిస్థితి ఎలా ఉందో ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి కార్యకర్తలతో సీక్రెట్‌గా సర్వే నిర్వహించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ప్రతిరోజూ పక్కనే తిరుగుతున్నా నేతలు సైతం ఎమ్మెల్యే తీరుపై అసహనంతో ఉన్నట్లు సమచారం. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ, బీసీ మైనారిటీ ప్రజల నుంచి మర్రి జనార్ధన్ రెడ్డికి వ్యతిరేకత పెరిగినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. కేవలం ఒక వర్గానికి మాత్రమే సానుకూలంగా ఉంటారనే విమర్శలు వస్తున్నట్లు ఎమ్మెల్యే దృష్టికి వచ్చింది. దీంతో ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అలర్ట్ అయ్యారు. ఎక్కడ ఎలాంటి ఆసమ్మతి ఉందో సీక్రెట్ మీటింగ్ పెట్టి తన స్టైలో చక్రం తిప్పుతున్నారు.

బుజ్జగింపు కార్యక్రమాలు..

అసెంబ్లీ ఎన్నికలు జరిగి రెండేండ్లు గడిచినా నియోజకవర్గంలో మళ్లీ ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. ప్రతి రోజూ నిర్వహించే కార్యక్రమాలు ఎన్నికల ప్రచారాన్ని తలపిస్తున్నాయి. ఇందులో భాగంగానే గవర్నర్ కోటాలో నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్సీ గోరటి వెంకన్న జడ్పీ చైర్‌పర్సన్ పెద్దపల్లి పద్మావతిలకు తన ఎంజేఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. దళితులపై ప్రేమ ఉందని తెలిసేలా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని కార్యకర్తలే చెప్పుకుంటున్నారు. తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ సమీపిస్తున్న క్రమంలో యువత ఓట్లన్నీ టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా ఉన్నాయని భావించి నియోజకవర్గంలోని యువతను మళ్లీ తన వైపు తిప్పుకునేందుకు క్రికెట్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌లను ఏర్పాటు చేసినట్టు ఆయా పార్టీకి చెందిన నేతలు చెప్పుకోవడం విశేషం. గత ఎన్నికల్లో తన గెలుపు కోసం అహర్నిశలు శ్రమించిన ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ దామోదర్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో ప్రధాన శత్రువుగా మారబోతున్నారనే ఉంది. ఆయనకు పరపతి దక్కుకుండా ఎమ్మెల్యే వేగంగా పావులు కదుపుతున్నారు. ఈ మధ్య కొంత మంది పార్టీ నేతలు, కార్యకర్తలను పిలిపించుకుని ఎమ్మెల్సీని ఎందుకు కలుస్తున్నారని ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి ఆరా తీసినట్లు తెలిసింది. ఇంకా ఎవరెవరు వెళ్తున్నారు, ఎందుకోసం వెళ్తున్నారో తెలుసుకునేందుకు (ఇన్ఫార్మర్స్) వేగులను ఏర్పాటు చేసుకున్నారు. ఎవరైనా అలిగి ఇతర పార్టీల వైపు చూసినట్లు తెలిసిన వెంటనే వారిని బుజ్జగించి వారు కోరిన పని చేసిపెట్టి మళ్లీ తన బుట్టలో వేసుకుంటున్నారు.

నేతల్లో అసంతృప్తి

ఈ మధ్యే పార్టీ మండల నాయకులు రాజీనామా లేఖను బహిర్గతం చేసి కొద్ది రోజుల్లోనే తిరిగి పార్టీలోనే కొనసాగుతున్నట్లు ప్రకటించడంతో గులాబీ పార్టీలో లుకలుకలు బహిర్గతమయ్యాయి. చాలా మంది ఖద్దరు చొక్కాల నేతలు తమకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని తన చుట్టూ ప్రదిక్షణలు చేసినా పట్టించుకోవడం లేదని పెదవి విరుస్తున్నారు. ఉద్యమ కాలం నుంచి పార్టీ జెండాను మోసిన వారిని పక్కనపెట్టి ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారని ఓ నేత బిజినపల్లి మండల కార్యకర్తల సమావేశంలోనే కుండబద్దలు కొట్టారు.

అవినీతితో కారు డీలా

కాంగ్రెస్ పార్టీ సీనియర్ రాజకీయ నాయకుడు మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి తాజాగా కాళేశ్వరం మోటార్ల కొనుగోలులో కేసీఆర్ భారీ అవినీతికి పాల్పడ్డారని ప్రకటించారు. సమాచార హక్కు చట్టం ద్వారా బయటపెట్టటంతో ఆయన మళ్లీ తెరపైకి వచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసిన ఈ వ్యవహారం ఇప్పుడు కందనూలు గులాబీ నేతలను కలవరపెడుతోంది. చాలా కాలంగా భారీ నీటిపారుదల రంగాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద మొత్తంలో ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నదని ఆరోపించిన నాగం సమాచార హక్కు చట్టం ద్వారా పూర్తి ఆధారాలతో మీడియా ముందుకు వచ్చారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద దుమారమే రేపింది. ప్రస్తుతం ఈ ప్రకంపనలు నియోజకవర్గానికీ తాకింది. ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి తన స్టైల్లో ప్రజల దృష్టిని మరల్చేందుకు వ్యూహాన్నీ రచిస్తున్నారు.

Advertisement

Next Story