సాగర్‌ పోరు: ఆయనకు సొంతవారే హ్యాండ్ ఇచ్చారు.. ఓటమి తప్పదా..?

by Anukaran |   ( Updated:2021-03-09 03:31:20.0  )
సాగర్‌ పోరు: ఆయనకు సొంతవారే హ్యాండ్ ఇచ్చారు.. ఓటమి తప్పదా..?
X

దిశ, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్​ సీనియర్​ నేత జానారెడ్డికి సొంత సెగ్మెంట్‎లో వ్యతిరేకత మొదలైంది. జానారెడ్డి వెంట ఉండే కొంతమంది సీనియర్లు ఇప్పటికే పార్టీని వీడగా, తాజాగా మరికొందరు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. లోకల్​ లీడర్లకు అండగా రేవంత్​రెడ్డి వర్గం కూడా తోడవుతోంది. ఇటీవల జానారెడ్డి రేవంత్​రెడ్డి టార్గెట్​గా చేసిన వ్యాఖ్యలు పార్టీలో సంచలనంగా మారాయి. పార్టీలో ఎవరికి వారుగా వ్యవహరిస్తున్నారని, దీంతో కాంగ్రెస్​ నేతలు బాధపడుతున్నారని, అభిమానం ఉంటే ఇతర నాయకుల్ని విమర్శిస్తారా అంటూ జానారెడ్డి ఇటీవల ప్రశ్నించారు. ఇలాంటి కార్యకర్తలు, నాయకులతో పార్టీకి నష్టం ఉంటుందంటూ రేవంత్ రెడ్డి అభిమానులకు జానారెడ్డి పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు. ఈ పరిణామాలతో రేవంత్​రెడ్డి వర్గం బహిరంగంగానే వ్యతిరేకమైంది.

ఇక మీరేనా సార్!

సాగర్​ సెగ్మెంట్​లో జానారెడ్డి పకడ్భందీగా కుర్చీ వేసుకుని కూర్చున్నారు. ఇప్పటికే ఈ స్థానం నుంచి ఏడుసార్లు విక్టరీ సాధించి ఎనిమిదోసారి గెలిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో నోముల చేతిలో ఓడిపోయారు. ఇప్పుడు మళ్లీ పోటీ చేసి తన సత్తా ఏంటో ప్రత్యర్థి పార్టీలకు చూపించాలనుకుంటున్నారు. అధిష్టానంపై ఒత్తిడి తెచ్చారు. సాగర్‌ ఉప ఎన్నిక పూర్తయ్యేవరకు పీసీసీ ఎంపికను వాయిదా వేయాలన్న జానా సూచనతో అధిష్టానం ఆ ప్రక్రియను పెండింగ్‌లో పెట్టింది. అధిష్టానాన్ని ఒప్పిస్తున్న జానారెడ్డికి లోకల్​ లీడర్లతో మాత్రం తలనొప్పిగా మారుతోంది.

దాదాపు 45 ఏండ్ల నుంచి సాగర్​ను శాసించినట్లుగా ఉన్న జానారెడ్డికి ప్రత్యేక వర్గం కూడా ఉంది. ఈ వర్గమే ఎన్నికల్లో చాలా యాక్టివ్​గా పని చేస్తోంది. ఆ వర్గంలో ఇప్పుడు గ్రూపులు మొదలయ్యాయి. జానారెడ్డిని కాంగ్రెస్​ మర్రిచెట్టులా భావిస్తున్న కాంగ్రెస్​ శ్రేణులు బయటకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. జానారెడ్డి ప్రధాన అనుచరుడు రిక్కల ఇంద్రసేనారెడ్డి బీజేపీలోకి చేరారు. ఆయనకు టికెట్​ ఇచ్చేందుకు కూడా బీజేపీ ఆలోచిస్తోందంటే జానారెడ్డికి ఏ విధంగా పని చేశారో తెలుస్తోంది. డాక్టర్​ రవి కూడా బీజేపీలో చేరారు. జానారెడ్డి ప్రధాన అనుచరులు ఇలా ఒక్కొక్కరుగా పార్టీ వీడుతున్నారు. ఇటీవల జానారెడ్డి తన ఇద్దరు కొడుకులను రాజకీయాల్లో కీలకంగా తిప్పుతుండటంతో పార్టీ నేతలు దారులు వెతుక్కుంటున్నట్లు చెప్పుతున్నారు. రాజకీయ వారసులను జానారెడ్డి తిప్పుతుండటంతో ఇక ద్వితీయ, తృతీయ శ్రేణీ నేతలుగానే ఉండాలా అంటూ కొంతమంది నేతలు పార్టీని వీడేందుకు సిద్దమవుతున్నారు.

కుటుంబ పాలన అంటూ వ్యాఖ్యలు

కాంగ్రెస్ పార్టీలో కుటుంబ‌ పాలన నడుస్తోందని రిక్కల ఇంద్రసేనారెడ్డి, డా.రవి కుమార్ నాయక్ ఆరోపణలు చేశారు. కేంద్రంలో సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మాదిరిగా నాగార్జున సాగర్ లో కూడా జానారెడ్డి కుటుంబ పాలన చేస్తున్నాడని, వారసత్వ రాజకీయాలను ప్రోత్సాహిస్తున్నాడని, జానారెడ్డి కోసం త‌న ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసినా పట్టించుకోలేదని, ప్రతి ఎన్నికల్లో ఆయన కోసం పని చేసినా పట్టించుకోలేదంటూ పేర్కొన్నారు.

పట్టు తప్పుతుందా?

ఇంద్రసేనారెడ్డికి రెడ్డి సామాజికవర్గం, రవి కుమార్​ యాదవ్​కు గిరిజన సామాజికవర్గంలో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. వీరు పార్టీని వీడటం జానారెడ్డికి కొంత ఇబ్బందికరమే. మరికొంత మంది నేతలు కూడా అదే ధోరణితో ఉన్నారు. దీనికి ప్రధాన కారణం జానారెడ్డి కుమారులే. వారిని తెరమీదకు తేవడం ద్వితీయ శ్రేణి నాయకులకు నచ్చడం లేదు. సాగర్​ ఎన్నిక కాంగ్రెస్​కు చాలా కీలకంగా మారింది. ఇక్కడ గెలిస్తేనే రాష్ట్రంలో పట్టు సాధించుకునేందుకు మెట్లులా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ద్వితీయ శ్రేణి నాయకులు మాత్రం జానారెడ్డికి షాక్​ ఇస్తున్నారు. ఇటీవల జానారెడ్డి రేవంత్​రెడ్డిని టార్గెట్​ చేస్తూ ఇటీవల విమర్శలు చేశారు. దీంతో రేవంత్​వర్గం ఆగ్రహంగా ఉంది. విభేదాలుంటే అంతర్గతంగా చర్చించుకొని పరిష్కరించుకోవాలని, ఒక నాయకుడిని గౌరవిస్తూ మరో నాయకుడిని అవమానపర్చేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంపై చేసిన వ్యాఖ్యలు రేవంత్​ వర్గానికి సూటిగా తగిలినట్లైంది. దీంతో రేవంత్​ వర్గం వ్యతిరేకం కావడంతో పాటుగా… కాంగ్రెస్‌లో గ్రూపు తగాదాలున్నాయని జానారెడ్డి చెప్పకనే చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed