కాకతీయుల కలికితురాయి రామప్ప

by Ravi |   ( Updated:2021-07-31 03:43:36.0  )
కాకతీయుల కలికితురాయి రామప్ప
X

దిశ, వెబ్‌డెస్క్ : ‘పదమూడవ శతాబ్దం నాటికి పూర్తిస్థాయిలో అభివృద్ధి చెంది నీటిపారుదల వ్యవస్థ తెలంగాణలో అన్ని ప్రాంతాలలో కనిపిస్తుంది. వాగులు, ఉపనదులు, నదుల తీరాన అనేక చిన్న చిన్న గుళ్ళు తెలంగాణా ప్రాంతం అంతటా ఉన్నాయి. రామప్ప గుడికి ఈ కట్టడాలకు పోలికలు ఉంటాయి. ఇక్కడ వెల్లివిరిసిన నదీ పరీవాహక నాగరికతకు ఇవన్నీ సజీవ సాక్ష్యాలుగా ఉన్నాయి. రామప్ప దేవాలయం ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు పొందడం అంటే తెలంగాణలోని ప్రాచీన వారసత్వ చారిత్రక కట్టడాలన్నింటినీ గుర్తించినట్లే. జనగాం జిల్లాలో పరిశీలిస్తే నిడిగొండ వాగు నుండి దేవరుప్పుల వాగు వరకు ప్రతీ గ్రామం ప్రాచీన నాగరికతకు ప్రతిరూపాలు. వాగుల ఒడ్డున ఉన్న గ్రామాలలో కాకతీయుల కాలపు నిర్మాణ కౌశలంతో కూడిన దేవాలయాలు ఉన్నాయి.’

ఒక ప్రాంతపు అస్తిత్వం ఆ ప్రాంతపు చారిత్రక, సాంస్కృతిక పునాదుల మీద ఏర్పడుతుంది. భౌగోళిక, సాంస్కృతిక, సామాజిక విభిన్నత వివిధ రంగుల అందమైన పూలు అన్నీ ఒకే తోటలో పూసినట్టు అందంగా, ఆకర్షణీయంగా భారతదేశాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టింది. భారతదేశంలో ఇప్పటివరకు 40 వారసత్వ స్థలాలను గుర్తించారు. అందులో 32 చారిత్రక కట్టడాలు, 7 అరుదైన ప్రకృతి సంపదకలిగిన ప్రదేశాలు, 1 చారిత్రక ప్రకృతి సిద్ధమైన లక్షణాలు కలిగిన ప్రదేశం ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా సుమారు 1,120 వారసత్వ స్థలాలను గుర్తించారు. అందులో 80 శాతం సాంస్కృతిక వారసత్వం కట్టడాలు కాగా, 20 శాతం ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన వారసత్వ స్థలాలు. భారతదేశంలో 19 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ప్రపంచ వారసత్వ స్థలాలకు నిలయం. అందులో ఈ సంవత్సరం మన రాష్ట్రం చేరడం తెలంగాణ ప్రజలకి గర్వకారణం. ఆ విధంగా తెలంగాణకు ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా గుర్తింపు లభిస్తుంది.

ఆనాడు ఎన్నో అవరోధాలు

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మన ప్రభుత్వం 2014లో రామప్ప దేవాలయాన్ని చారిత్రక కట్టడాల జాబితాలో చేర్చమని యునెస్కోను కోరింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మన చరిత్రను మరుగున పెట్టారు. కాకతీయుల చరిత్రను, వైభవాన్ని, గొప్ప పరిపాలన విధానాలను, ఆ రాజులు అభివృద్ధి చేసిన నీటిపారుదల వ్యవస్థను వెలుగు చూడనివ్వలేదు. వేయి సంవత్సరాలపాటు తట్టుకొని నిలబడిన గొలుసుకట్టు నీటిపారుదల వ్యవస్థను 50 ఏళ్లలో చిన్నాభిన్నం చేశారు. పదమూడవ శతాబ్దం నాటికి పూర్తిస్థాయిలో అభివృద్ధి చెంది నీటిపారుదల వ్యవస్థ తెలంగాణలో అన్ని ప్రాంతాలలో కనిపిస్తుంది. వాగులు, ఉపనదులు, నదుల తీరాన అనేక చిన్న చిన్న గుళ్ళు తెలంగాణా ప్రాంతం అంతటా ఉన్నాయి. రామప్ప గుడికి ఈ కట్టడాలకు పోలికలు ఉంటాయి. ఇక్కడ వెల్లివిరిసిన నదీ పరీవాహక నాగరికతకు ఇవన్నీ సజీవ సాక్ష్యాలుగా ఉన్నాయి. రామప్ప దేవాలయం ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు పొందడం అంటే తెలంగాణలోని ప్రాచీన వారసత్వ చారిత్రక కట్టడాలన్నింటినీ గుర్తించినట్లే. జనగాం జిల్లాలో పరిశీలిస్తే నిడిగొండ వాగు నుండి దేవరుప్పుల వాగు వరకు ప్రతీ గ్రామం ప్రాచీన నాగరికతకు ప్రతిరూపాలు. వాగుల ఒడ్డున ఉన్న గ్రామాలలో కాకతీయుల కాలపు నిర్మాణ కౌశలంతో కూడిన దేవాలయాలు ఉన్నాయి. ఇవి నారాయణపురం, చీటూరు, కోరుకొండ, చిన్నమడూరు, దేవరుప్పులలో మనకు దర్శనమిస్తాయి. రామప్ప దేవాలయం ప్రపంచ వారసత్వ కట్టడంగా ఎంపిక కావడానికి ప్రధాన కారణం అందరూ అంచనా వేస్తున్నట్లు అద్భుతమైన శిల్ప కళ, నల్లరాతిపై చెక్కిన నాట్య భంగిమలు, సైన్యంలో ఉపయోగించిన వివిధ జంతువుల శిల్పాలు. ఇవి పైకి కనిపించేవి. ప్రపంచ దృష్టిని ఆకర్షించి కనువిందు చేసినవి. ప్రకృతి వైపరీత్యాలను తట్టుకోగలిగిన టెక్నాలజీ రామప్ప దేవాలయ పునాదిలో ఉంది.

అబ్బురపరిచే సాంకేతికత

కాకతీయుల కట్టడాల కింద అద్భుత ఇంజనీరింగ్ నైపుణ్యంతో ఏర్పాటు చేసిన సాండ్ బాక్స్ పునాది. అందువల్లనే 8.2 తీవ్రతతో సంభవించిన భూకంపాలను తట్టుకొని ఇప్పటికీ ఈ దేవాలయం నిలబడగలిగింది. వరంగల్‌లోని వేయి స్తంభాల గుడిని పునర్నిర్మించడానికి కట్టడాలను తొలగించిన సందర్భంలో ఈ పునాది రహస్యం బయట ప్రపంచానికి తెలిసింది. ఏదైనా ప్రదేశానికి ఒకసారి డబ్ల్యూహెచ్ఎస్ ( వరల్డ్ హెరిటేజ్ సైట్) గుర్తింపు లభిస్తే ఆ ప్రాంతము, రాష్ట్రము సాంస్కృతికంగా చారిత్రకంగా ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుంది. తద్వారా ప్రపంచ పర్యాటక కేంద్రంగా ఖ్యాతికి ఎక్కుతుంది. ఆ ప్రాంతాన్ని రక్షించడానికి అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో నిధులు లభిస్తాయి. యుద్ధ సమయంలో కూడా ఇలాంటి కట్టడాల జోలికి ఎవరు వెళ్లకుండా జెనీవా ఒప్పందం ద్వారా ప్రపంచ స్థాయి రక్షణ లభిస్తుంది.

రామప్ప సందర్శన

తెలంగాణ వికాస సమితి బృందం 31 జూలై 2021న రామప్ప దేవాలయాన్ని సందర్శిస్తున్నది. ఈ బృందంలో తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ సీతారామారావు, ఉన్నత విద్యామండలి సభ్యులు ఒంటెద్దు నర్సింహారెడ్డి, తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్ ఫోరం చైర్మన్ వెంకటేశం, తెలంగాణ పారిశ్రామికవేత్తల సంఘం అధ్యక్షులు సుధీర్‌రెడ్డి, తెలంగాణ వికాస సమితి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఉమ్మడి వరంగల్ జిల్లాల బాధ్యులు పాల్గొంటున్నారు. వీరందరికీ జనగామలో తెలంగాణ వికాససమితి జిల్లా కమిటీ ఆహ్వానం పలుకుతుంది. 2007లో పోతనను ఆంధ్రకు తరలించుకుపోదామని అప్పటి పాలకులు చేసిన ప్రయత్నాలను జనగామ కేంద్రంగా పనిచేస్తున్న తెలంగాణ ఉద్యమకారులు ధీటుగా ఎదుర్కొన్నారు. పోతన బమ్మెరవాడే అని స్థల సందర్శన చేసి, చారిత్రక ఆధారాలను ప్రజల ముందు, ప్రభుత్వం ముందు ఉంచిన చరిత్ర మనది.

ఎర్రోజు శ్రీనివాస్
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
తెలంగాణ వికాస సమితి.
97003 02973

Advertisement

Next Story