ఆదిలాబాద్ అడవుల్లో ఆ చప్పుడేందీ..?

by  |
ఆదిలాబాద్ అడవుల్లో ఆ చప్పుడేందీ..?
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: మావోయిస్టు దళాల పునర్నిర్మాణం జరుగుతోందన్న ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ అడవుల్లో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలో మావోయిస్టుల కదలికలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో మావోయిస్టుల సమాచారం ఇచ్చిన వారికి నజరానా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో తూర్పు జిల్లా పోలీసులు వాల్ పోస్టర్ల ద్వారా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. అటవీ ప్రాంతాల్లో నిఘా పెంచారు.

గుట్టు చప్పుడు కాకుండా..

గుట్టుచప్పుడు కాకుండా మావోయిస్టు పార్టీ మంగిదళం, సిర్పూర్ దళంతో పాటు నిర్మల్, మంచిర్యాల తదితర ప్రాంతాల్లో పార్టీ కార్యకలాపాలు విస్తరిస్తుండడం పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. రాష్ట్ర కమిటీ సభ్యులు మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్‌ను పట్టిస్తే రూ. 20 లక్షల రూపాయల నజరానా ప్రకటించారు. భాస్కర్ ఉమ్మడి జిల్లాలో దళాల పునర్నిర్మాణంతో పాటు రిక్రూట్‌మెంట్ చేయడంలో ముందున్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇటీవల మంగి అడవుల్లో పోలీసులకు మావోయిస్టులకు జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టులు తప్పించుకున్నారని.. అడవులన్నీ పోలీసులు జల్లెడ పడుతున్నారు. మరోపక్క చత్తీస్‌గఢ్ ప్రాంతంలో మావోయిస్టుల ప్రాబల్యం ఎక్కువగా ఉండడంతో మహారాష్ట్ర, ప్రాణహిత నదీ పరీవాహక ప్రాంతంలో పోలీసులు నిఘా పెంచారు.

పట్టిస్తే నజరానా..

రాష్ట్ర కమిటీ సభ్యులు భాస్కర్‌ను పట్టించిన వారికి రూ.20 లక్షలు, జిల్లా కమిటీ సభ్యుడైన వర్గీస్‌కు రూ.5 లక్షలు, ఏరియా కమిటీ సభ్యులు మీనా, పాండు, సుధీర్‌లపై రూ.5 లక్షలు, భాస్కర్ భార్య కంతి లింగవ్వపై రూ.5లక్షల రూపాయల నజరానా ప్రకటించారు. పోలీసులు వాల్ పోస్టర్‌లతో పాటు సోషల్ మీడియాలో వారి ఆచూకీ తెలిపితే.. వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని పోలీసులు ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే భాస్కర్ నేతృత్వంలో మావోయిస్టు పార్టీ కార్యకలాపాలు ఈ ప్రాంతంలో తిరిగి పుంజుకోవడంతో పోలీసులకు సవాలుగా మారింది. ఇప్పటికే డీసీపీ స్థాయి అధికారుల నుంచి మొదలు ఎస్ఐ స్థాయి వరకు.. మావోయిస్టులు లొంగిపోవాలంటూ ఆయా కుటుంబాలను సందర్శించి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. భాస్కర్ ఆధ్వర్యంలో మావోయిస్టు అనుబంధ కార్మిక సంఘం సింగరేణి కార్మిక సమాఖ్యను బలోపేతం చేసేందుకు వ్యూహాలు రచిస్తున్నట్లు కూడా పోలీసులకు సమాచారం అందింది.

కొత్త కమిటీలు..

మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యుడు భాస్కర్ ఆధ్వర్యం లో జిల్లాలో మళ్లీ కొత్త కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మంగి, ఇంద్రవెల్లి, చెన్నూరు, కోల్డ్ బెల్టు కమిటీలను ఏర్పాటుచేశారని పోలీసులకు ఉప్పందిం ది. ఈ నేపథ్యం లో పోలీసులు అటవీప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. ఈ నెలలో మావోయిస్టు పార్టీ వారోత్సవాలు నిర్వహించేందుకు పావులు కదుపుతోంది. వారోత్సవాల సందర్భంగా అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. ఉమ్మడి జిల్లాపై గట్టి పట్టు ఉన్న భాస్కర్.. బలహీన పడిన దళాలను తిరిగి జీవం పోసేందుకు కార్యకలాపాలు కొనసాగిస్తున్న సమాచారం పోలీసులకు తలనొప్పిగా మారింది.

స్పెషల్ ఆఫీసర్‌గా డీసీపీ

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మావోయిస్టు పార్టీ కార్యకలాపాలు పెరుగుతున్న నేపథ్యంలో కట్టడి కోసం మంచిర్యాల డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డిని ఆపరేషన్ ఆదిలాబాద్ స్పెషల్ ఆఫీసర్‌గా నియమించారు. మావోయిస్టుల అదుపునకు వ్యూహాత్మక చర్యలు తీసుకుంటారని ముద్ర పడ్డ ఆయనకు బాధ్యతలు అప్పగించడంపై చర్చ జరుగుతోంది.


Next Story

Most Viewed