సీఎం కేసీఆర్‌కు సీనియర్ జర్నలిస్టుల బహిరంగ లేఖ

by Shyam |   ( Updated:2021-05-04 11:03:31.0  )
Open letter from senior journalists
X

దిశ, తెలంగాణ బ్యూరో : కరోనా నుంచి జర్నలిస్టులను కాపాడాలని కోరుతూ సీఎం కేసీఆర్‌కు మంగళవారం సీనియర్ జర్నలిస్టులు బహిరంగ లేఖ రాశారు. అనంతరం హైదరాబాద్ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. కరోనా సమయంలో జర్నలిస్టులు ఫ్రంట్ లైన్ వారియర్లుగా వృత్తి పరంగా బాధ్యతాయుతమైన పాత్ర పోషిస్తున్నారన్నారు. ప్రభుత్వం చేపట్టిన కరోనా కట్టడి చర్యల్లో జర్నలిస్టులు తమవంతు కృషి చేస్తున్నారని, విధి నిర్వహణలో చాలా మంది కరోనా బారిన పడ్డారని, పదుల సంఖ్యలో మృతి చెందారని ఆవేదన వ్యక్తం చేశారు.

కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయితే వైద్య చికిత్సకు కూడా నోచుకోని స్థితిలో ఉన్నారని, హెల్త్ కార్డుపై చికిత్స కూడా అందడం లేదన్నారు. కరోనా ఫస్ట్‌వేవ్‌లోనే వందలాది జర్నలిస్టులను యాజమాన్యాలు క్రాస్ కటింగ్ పేరుతో ఉద్యోగాల నుంచి తొలగించడంతో రోడ్డునపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని సంస్థలు జీతాల్లో కోత విధించాయని ఇలాంటి పరిస్థితుల్లో కరోనా బారిన పడితే చావే శరణ్యమనే పరిస్థితి దాపురించిందని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన జర్నలిస్టులు నేడు స్వరాష్ట్రంలో దిక్కులేని వారయ్యారని, వారి రోధన అరణ్య రోదన అయిందన్నారు. నాడు తెలంగాణ ఉద్యమంలోనూ, నేడు రాష్ట్ర నిర్మాణంలో ముందు వరుసలో నిలిచిన జర్నలిస్టుల ప్రాణాలను కాపాడాలని కోరారు.

తమిళనాడు, ఢిల్లీ, కర్నాటక సహా పలు రాష్ట్రాల ప్రభుత్వాలు ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా గుర్తించాయని, తెలంగాణ ప్రభుత్వం మాత్రం గుర్తించకపోవడం శోఛనీయమన్నారు. ఇప్పటికైన సీఎం కేసీఆర్ స్పందించి ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించడంతో పాటు మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలకు రూ.25లక్షల ఆర్ధికసాయం, కరోనాతో హోంఐసోలేషన్‌లో ఉండే జర్నలిస్టులకు రూ.25వేలు ఆర్థికసాయం చేయడంతో పాటు అన్ని కార్పొరేట్, ప్రైవేటు ఆసుపత్రుల్లో హెల్త్ కార్డుతో ఉచిత చికిత్స అందజేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సతీష్ కమల్, జయసారథి రెడ్డి, ఎన్. విశ్వనాథ్, అయోధ్య రెడ్డి, బి. వేణు, పల్లె రవికుమార్, ఎంఎన్‌ స్వామి తదితరులున్నారు.

జర్నలిస్టులకు రూ.50లక్షల బీమా సదుపాయం కల్పించాలి

కేంద్ర ప్రభుత్వం జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా గుర్తించిందని రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే ప్రకటించి మనోదైర్ఘ్యం కల్పించాలని ఇండియన్ జర్నలిస్టు యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు కె. శ్రీనివాస్ రెడ్డి, వై.నరేందర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(టీయూడబ్ల్యూజే) అధ్యక్ష, కార్యదర్శులు నగునూరి శేఖర్, విరహత్అలీ, ఉప ప్రదాన కార్యదర్శి విష్ణుదాస్ శ్రీకాంత్ ఒక ప్రకటనలో కోరారు.

కరోనాతో ఫస్ట్‌వే, సెకండ్‌వేలో రాష్ట్రంలో 55 మంది జర్నలిస్టులు మృతి చెందారన్నారు. ఒక్క ఏప్రిల్ లోనే 29 మంది అకాల మృతి చెందడం కలిచివేసిందని తెలిపారు. ఇప్పటి వరకు 3800ల మంది జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులు కరోనా బారిన పడ్డారని, మృతి చెందిన వారి కుటుంబాలకు ఇస్తున్న రూ.2లక్షల ఆర్థికసాయం వైద్య కోసం చేసిన ఖర్చులకు కూడా సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్న జర్నలిస్టు కుటుంబాలకు కనీసం రూ.10లక్షలు ఆర్థికసాయం అందజేయాలని కోరారు. జర్నలిస్టులకు రూ.50లక్షల బీమా సదుపాయం కల్పించాలని, నియోజకవర్గ స్థాయిలో ప్రత్యేక క్యాంపులు నిర్వహించి జర్నలిస్టులకు వ్యాక్సిన్ వేయించాలని ప్రభుత్వాన్ని కోరారు.

Advertisement

Next Story