టీడీపీ కీలక నేతల దారేటు?

by srinivas |
టీడీపీ కీలక నేతల దారేటు?
X

దిశ ఏపీ బ్యూరో: తెలుగు దేశం ప్రభుత్వం హయాంలో కీలక మంత్రులైన వారిద్దరూ వియ్యంకులుగా మారారు. గతంలో ఒకరు విద్యాశాఖ మంత్రి అయితే, ఇంకోకరు మున్సిపల్ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. టీడీపీ ప్రభుత్వానికి వారిద్దరూ రెండు కళ్లుగా వ్యవహరించారు. ఒకరు రాజధాని నిర్మాణంలో తలమునకలైతే, ఇంకకొరు అప్పటికే రాజధానిలాంటి విశాఖపట్టణానికి రారాజుగా వెలిగారు. ఇప్పుడా ఇద్దరూ కనిపించడం లేదు. వైఎస్సార్సీపీ అధికారం చేపట్టిన నాటి నుంచి ఈ ఇద్దరూ చడీచప్పుడు లేకుండా పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉంటున్నారు. వారే గంటా శ్రీనివాసరావు, నారాయణ విద్యాసంస్థల అధినేత నారాయణ.

విశాఖపట్టణంలో టీడీపీ నిర్వహించే ఒకటీ అరా కార్యక్రమాల్లో గంటా శ్రీనివాసరావు కనిపించినా, నారాయణ మాత్రం టీడీపీ అధికారం కోల్పోయిన నాటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్టు కనిపిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో రాజధాని నిర్మాణంలో అన్నీ తానై వ్యవహరించిన నారాయణ.. అమరావతి వాసులు నెలలు తరబడి దీక్షలు చేపట్టినా, ఆందోళనలు చేస్తున్నా ఒక్కసారి కూడా బయటకు రాకపోవడం ఆశ్చర్యం కలగించకమానదు. ప్రభుత్వం ఎన్ని విమర్శలు చేసినా ఆయన మౌనం దాల్చడం రాజకీయ పరిశీలకులను కూడా విస్మయానికి గురి చేసింది. ఈ నేపథ్యంలో గంటా శ్రీనివాసరావు వైఎస్సార్సీపీ దిశగా పావులు కదిపారు. త్వరలోనే ఆయన పార్టీ మారుతున్నట్టు విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఈ నేపథ్యంలో మంత్రి నారాయణ ప్రస్తావన రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఉత్తరాంధ్రపై గంటాకు ఎంత పట్టు ఉందో, నారాయణకు కూడా అంతే పట్టు ఉందని ఆయన గురించి తెలిసిన వారు చెబుతారు. 2014 ఎన్నికల్లో, 2019 ఎన్నికల్లో ఉత్తరాంధ్ర బాధ్యతను ఆయనే తీసుకున్నారని కూడా అంటుంటారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో సన్నిహితంగా మెలిగిన ఈ ఇద్దరూ అసలు పార్టీ మారుతారా? లేక గంటా మాత్రమే పార్టీ మారుతారా? వియ్యంకుడితో పాటు నారాయణ కూడా పార్టీ మారుతారా? లేక టీడీపీలోనే కొనసాగుతారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో వియ్యంకులిద్దరూ వేర్వేరు పార్టీల్లో ఉంటే సమస్యలు రాకుండా చూసుకునే వెసులుబాటు ఉంటుందని, ఒకే కుటుంబంలోని వారు రెండు వేర్వేరు పార్టీల్లో ఉండడం లేదా? అని ఇంకొందరు పేర్కొంటున్నారు. దీంతో నారాయన ప్రస్తావన ఏపీ రాజకీయాల్లో గత రెండ్రోజులుగా జోరుగా వినిపిస్తోంది.

Advertisement

Next Story

Most Viewed