ఆసరాగా నిలుస్తున్న ఆన్‌లైన్ టీచింగ్

by  |
ఆసరాగా నిలుస్తున్న ఆన్‌లైన్ టీచింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: లాక్‌డౌన్ కారణంగా దారుణంగా ప్రభావితమైనది ప్రైవేట్ టీచర్లే. మిగతా ఉద్యోగాలకు చెందినవారికి పని లేదు, కాబట్టి జీతం లేదు. కానీ ప్రైవేట్ టీచర్లు మాత్రం ఓ వైపు పనిచేస్తూనే మరో వైపు జీతాన్ని అందుకోలేకపోయారు. ఇప్పుడిప్పుడే ఆఫ్‌లైన్ విద్య నుంచి ఆన్‌లైన్ విద్యకు మారుతున్న పరిణామక్రమాన్ని వారు అలవాటు చేసుకోగలుగుతున్నారు. ఈ క్రమంలోనే వారికొక ఆసరా దొరికింది. అదేంటి.. ఓ వైపు జీతాలు లేక ఇబ్బంది పడుతున్నారని చెబుతూనే, ఆసరా దొరికిందంటున్నారు ఏంటా అనుకుంటున్నారా? అవును.. టీచర్లకు కొత్త ఆసరా దొరికింది. అదే ఆన్‌లైన్ టీచింగ్. విద్య పూర్తిగా ఆన్‌లైన్‌మయం అయ్యాక దాన్ని క్యాష్ చేసుకోవడానికి ఎడ్యు టెక్ స్టార్టప్‌లు బోలెడన్ని పుట్టుకొచ్చాయి. అంటే వీటిని ఒకరకంగా ఆన్‌లైన్ విద్యాసంస్థలు అని చెప్పవచ్చు.

ఈ ఎడ్యు టెక్ స్టార్టప్‌లు నడవాలంటే టీచర్లు తప్పనిసరి. కొద్దిగా టెక్నికల్ నాలెడ్జ్ ఉండి, కంప్యూటర్ ఆపరేట్ చేయగలిగిన టీచర్లకు ఇది ఒక మంచి అవకాశంగా కనిపించింది. సాధారణంగా ఆఫ్‌లైన్ స్కూళ్లలో పాఠాలు చెప్పేది నాలుగు పీరియడ్లు అనుకుంటే మిగతా సమయమంతా పిల్లలతో టైంపాస్ చేయడమో లేక మరేదైనా అడ్మినిస్ట్రేటివ్ పనిచేయడంలోనో గడిచిపోయేది. కానీ ఆన్‌లైన్ టీచింగ్ అలా కాదు. చెప్పాలనుకున్న పాఠానికి ప్రత్యేకంగా నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే చాలు. ఒక గంటసేపు ఆన్‌లైన్‌లో పాఠాలు చెప్పగా, మిగతా సమయం మొత్తం ఖాళీగా ఉండొచ్చు. ఈ ఖాళీ సమయాన్నే ఈ టీచర్లు ఉపాధిగా మార్చుకుంటున్నారు. ఒకటి కంటే ఎక్కువ ఎడ్యు టెక్ స్టార్టప్‌లలో టీచర్‌గా పనిచేస్తున్నారు. ఒకప్పుడు ఒక స్కూల్లోనే పనిచేసే ధోరణికి ఈ ఆన్‌లైన్ స్కూలింగ్ విధానాలు స్వస్తి పలికాయి. దీంతో టీచర్లు పూర్తిస్థాయి ఉద్యోగులుగా కాకుండా, ఈ ఎడ్యు టెక్ స్టార్టప్ కంపెనీల్లో ఫ్రీలాన్స్ ఎడ్యుకేటర్లుగా మారి కార్పొరేట్ స్థాయి ఉద్యోగాన్ని ఆస్వాదిస్తున్నారు. కేవలం టీచర్లు మాత్రమే కాదు టీచింగ్ మీద ఆసక్తి ఉన్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు కూడా కోడింగ్ పాఠాలు నేర్పిస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. ఏదేమైనా ప్రతి సమస్యకు ఆన్‌లైన్ పరిష్కారం చూపిస్తుందనడంలో ఎలాంటి తప్పు లేదనిపిస్తోంది!


Next Story

Most Viewed