మొదటిరోజు పాఠాలు… ఉపాధ్యాయులకు చుక్కలు

దిశ ప్రతినిధి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మంగళవారం నుంచి డిజిటల్ క్లాసులు మొదలైన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా హైదరాబాద్ జిల్లాలో యాబై శాతం మంది విద్యార్థులు తరగతులు వినలేక పోయారు. ప్రభుత్వం ముందుగా నిర్ధేశించిన దాని ప్రకారం… మూడో తరగతి విద్యార్థులకు ఉదయం 10.30 గంటలకు తెలుగు పాఠం మొదలు కావలసి ఉంది. ఐతే డీడీ యాదగిరి ఆన్‌లైన్ లింక్ కలువకపోవడంతో సుమారు 10 నిమిషాల పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. అనంతరం డీడీ యాదగిరి ఛానల్‌లో తరగతులు యథావిధిగా జరిగాయి.

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల్లలో చదవుతున్న విద్యార్థుల వివరాలు, ఫోన్ నెంబర్లు ఉపాధ్యాయులు సేకరించి, వాట్సాప్ గ్రూపు క్రియేట్ చేసి, ముందుగానే సలహాలు, సూచనలు చేశారు. కొంత మంది విద్యార్థులకు టీవీలు అందుబాటులో లేకపోవడంతో, సమీపంలోని టీవీ ఉన్న విద్యార్థులతో కలిపి పాఠాలు వినేలా చర్యలు తీసుకున్నారు. ఐతే కొంత మంది విద్యార్థులు లాక్‌డౌన్ కారణంగా గ్రామాలకు వెళ్లామని, అక్కడే పాఠాలు వింటామని చెప్పినట్టు ఉపాధ్యాయులు వెల్లడించారు.

ఆన్ లైన్ పాఠాలు మొదటి రోజే విద్యార్థులకు, ఉపాధ్యాయులకు చుక్కలు చూపించాయి. కొంత మందికి కరెంటు కోత, మరి కొంతమందికి నెట్ వర్క్ సమస్యలు తలెత్తాయి. టీవీలు అందుబాటులో లేని వారు అండ్రాయిడ్ ఫోన్‌ల ద్వారా వీక్షించేందుకు ప్రయత్నించారు. అయితే ఇంటర్నెట్ ప్రధాన సమస్యగా మారింది. కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్ అందకపోవడం, అందినా అవసరాల మేరకు స్పీడ్ లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. దీంతో వారు ఉపాధ్యాయులకు ఫోన్ చేసి, తాము పాఠాలు వినలేక పోతున్నామని చెప్పారు. కొన్ని చోట్ల ఉపాధ్యాయులు సమస్యకు పరిష్కారం చూపగా మరి కొన్ని చోట్ల ఏమి చేయలేకపోయారు. మొత్తం మీద ఆన్‌లైన్ తరగతులు మొదటిరోజు ఉపాధ్యాయులకు, విద్యార్థులకు కొత్త పాఠాలు నేర్పాయి.

Advertisement