ఆన్‌లైన్ చదువులు అంతంతే..!

by Shyam |
ఆన్‌లైన్ చదువులు అంతంతే..!
X

దిశ, మెదక్ : కొవిడ్ కారణంగా మంగళవారం ఆన్‌లైన్ తరగతులు ప్రారంభమయ్యాయి. కానీ వీటికి సగం మంది విద్యార్థులు దూరమయ్యారు. జిల్లాలోని అన్ని చోట్ల కూడా తరగతుల నిర్వహణకు సంబంధించి అధికారులు ముందస్తుగానే ఏర్పాట్లు చేశారు. ఆన్‌లైన్ పాఠాల విషయమై విద్యార్థుల తల్లిదండ్రులకు మెసేజ్‌లు పంపడం, గ్రామాల్లో దండోరా వేయించడం లాంటివి మూడు రోజులుగా ఉపాధ్యాయులు నిర్వహిస్తున్నారు. ఇంత చేసినా ఒక్కో తరగతిలో కనీసం సగం మంది విద్యార్థులు సైతం పాఠాలు వినలేదు.

ఇంట్లోకి సైతం రానివ్వట్లే..

మెదక్ జిల్లాలోని పాపన్నపేట్ మండలం పొడ్చన్‌పల్లి గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు తెలుగు, ఇంగ్లీష్ మీడియం కలిపి 197 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరిలో 100 మంది బాలురు ఉండగా, 97 మంది బాలికలు ఉన్నారు. మరో 19 మంది విద్యార్థులు 6వ తరగతిలో ఈ మధ్య కొత్తగా అడ్మిషన్ పొందారు. మొత్తంగా 216 మంది ఈ పాఠశాలలో చదువుకుంటున్నారు. వీరిలో చాలా మంది విద్యార్థుల ఇండ్లలో టీవీ, ఆండ్రాయిడ్ ఫోన్ సౌకర్యం లేదు. పోనీ దగ్గర్లో ఉన్న స్నేహితుల ఇండ్లకు వెళ్లి పాఠాలు వినవొచ్చకదా అని అడిగితే కరోనా కారణంగా ఎవరూ ఇండ్లలోకి రానివ్వడం లేదనే సమాధానం వినపడింది.

ఈ పాఠశాలలో 10వ తరగతిలో మొత్తం 33 మంది విద్యార్థులు ఉండగా కేవలం 16 మంది మాత్రమే ఆన్‌లైన్ పాఠాలు విన్నారు. అందులోనూ పూర్తి సమయం కేటాయించి పాఠాలు విన్నవారు 10 నుంచి 12 మంది విద్యార్థులు మాత్రమే. 9వ తరగతిలో మొత్తం 36 మంది విద్యార్థులు ఉండగా 18 మంది మాత్రమే పాఠాలు విన్నారు. 8వ తరగతిలో 34 మంది విద్యార్థులు ఉండగా 14 మంది, 7వ తరగతిలో 32 మంది ఉండగా 18 మంది విద్యార్థులు, ఇక కొత్తగా 6వ తరగతిలో చేరిన 19 మంది విద్యార్థుల్లో 10 మంది మాత్రమే ఆన్‌లైన్ పాఠాలు విన్నారు.

సెలవులు పెట్టిన టీచర్లు..

ఈ స్కూల్ లో మొత్తం 12 మంది ఉపాధ్యాయులు ఉండగా మంగళవారం కేవలం 7మంది ఉపాధ్యాయులు మాత్రమే పాఠశాలకు వచ్చారు. మిగతా వారు వ్యక్తిగత పనులున్నాయని సెలవులు పెట్టారని ప్రధానోపాధ్యాయుడు శంకర్ తెలిపారు. హిందీ బోధించే ఓ ఉపాధ్యాయుడు ఏడాది కాలంగా పాఠశాలకు రావడం లేదని, అతని స్థానంలో వేరొకరితో పాఠాలు చెప్పిస్తున్నామని ప్రధానోపాధ్యాయుడు వెల్లడించారు.

కరెంట్, నెట్‌వర్క్ సమస్య..

గ్రామంలోనే కరెంట్ సబ్ స్టేషన్ ఉన్నప్పటికీ తరచూ కరెంట్ పోతూ వచ్చింది. అటు నెట్ కనెక్షన్ విషయంలోనూ 4జీ నెట్ చూపిస్తునప్పటికీ టవర్స్ సిగ్నల్స్ జెంప్ అవడం వల్ల వీడియో బఫర్ అవడం, మధ్య మధ్యలో ఫోన్ కాల్స్ రావడం వల్ల పాఠాలు వినేందుకు చాలా మంది విద్యార్థులు ఇబ్బంది పడ్డారు.

మంత్రి చెప్పినా స్పందించని ప్రజాప్రతినిధులు..

ఆన్‌లైన్ క్లాస్‌లు వినేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని, అధికారులు, ప్రజాప్రతినిధులు పరస్పరం సహకరించుకుని విద్యార్థులు పాఠాలు వినేలా చూడాలని మంత్రి హరీశ్ రావు సోమవారం టెలికాన్ఫరెన్స్ ద్వారా సూచించారు. కానీ ఒక్క ప్రజాప్రతినిధి సైతం స్పందించలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద టీవీ కాదు కదా, గ్రామానికి సంబంధించిన ఏ ఒక్క ప్రజాప్రతినిధి సైతం పాఠశాల వైపు కన్నెత్తి చూడలేదు. అటు ఉపాధ్యాయులు సైతం మధ్యాహ్నం వరకు స్కూల్‌లోనే ఉన్నారు. మధ్యాహ్నం తర్వాత విద్యార్థుల ఇండ్లకు వెళ్లి కొంతమంది విద్యార్థులతో మాట్లాడారు.

Advertisement

Next Story

Most Viewed