కొనసాగుతున్న కృష్ణమ్మ పరవళ్లు

by Shyam |
కొనసాగుతున్న కృష్ణమ్మ పరవళ్లు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఎగువ రాష్ట్రాల్లో వర్షాలతో రెండు నదులకు వరద కొనసాగుతోంది. కృష్ణమ్మ పరవళ్లు స్థిరంగా ఉన్నాయి. ఎగువన ఆల్మట్టి నుంచి 1.30లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా దిగువకు 1.30లక్షల క్యూసెక్కులను వదులుతున్నారు. నారాయణపూర్ జలాశయానికి 1.25లక్షల క్యూసెక్కులు ఉండగా 1.13లక్షల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ఉజ్జయినీ నుంచి 31వేల క్యూసెక్కులు కృష్ణమ్మలో చేరుతున్నాయి. జూరాల ప్రాజెక్టుకు ఆదివారం రాత్రి వరకు 4.34 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా, 4.16 లక్షల క్యూసెక్కుల ఔట్ ఫ్లో ఉంది. తుంగభద్రకు 18వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో నమోదవుతోంది. శ్రీశైలం ప్రాజెక్టులోకి 5.12లక్షల క్యూసెక్కులు వస్తుండగా 5లక్షల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. దీంతో నాగార్జునసాగర్ దగ్గర 4.25లక్షల ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో ఉంది. పులిచింతల దగ్గర 5.23 లక్షల క్యూసెక్కులు వస్తుండగా అంతే స్థాయిలో సముద్రంలోకి వదులుతున్నారు.

గోదావరి బేసిన్‌లో సింగూరు ప్రాజెక్టులోకి 30వేల క్యూసెక్కులు వస్తుండగా, 41వేల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. నిజాంసాగర్‌కు 62వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో, 72 వేల క్యూసెక్కుల ఔట్ ఫ్లో ఉంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి 88వేల క్యూసెక్కులు వస్తుండగా 63వేల క్యూసెక్కులు వదులుతున్నారు. ఎల్ఎండీకి వరద తగ్గింది. ఏడువేల క్యూసెక్కులు చేరుతున్నాయి. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 1.20లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, 1.01లక్షల క్యూసెక్కుల ఔట్ ఫ్లో ఉంది. ఆదివారం సాయంత్రం వరకు గోదావరి బేసిన్‌ నుంచి 3,527.074 టీఎంసీలు, కృష్ణా బేసిన్ నుంచి 954.373 టీఎంసీలు సముద్రంలో కలిశాయి.

Advertisement

Next Story