- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ధరణి’ కష్టాలకు ఏడాది.. ఎక్కడి సమస్యలే అక్కడే..
దిశ, తెలంగాణ బ్యూరో: మూడేండ్ల కష్టం.. మూడు వందల సమావేశాల్లో చర్చ. జాతీయ, అంతర్జాతీయ స్థాయి నిపుణుల కూర్పు.. వెరసి గ్రేట్ ధరణి పోర్టల్. అత్యద్భుతం.. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడినదంటూ పాలకుల ప్రచారం. అధికారుల ఆర్భాటం. సరిగ్గా ఆ ధరణి పోర్టల్ అమల్లోకి వచ్చి ఏడాది. తెలంగాణ భూమి హక్కులు, పట్టాదారు పాసు పుస్తకాల చట్టం-2020ని గతేడాది అక్టోబరు 28న నోటిఫై చేయగా, మరుసటి రోజు నుంచి అమల్లోకి వచ్చింది. కానీ లక్షలాది మంది రైతులు ఎందుకు రోడ్డెక్కుతున్నారు? తహశీల్దార్ నుంచి కలెక్టర్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణ ఎందుకు చేస్తున్నారు? ఎక్కడి సమస్యలు అక్కడే. అంతకు ముందు కంటే ఇక్కట్లు పెరిగాయి. తరతరాలుగా అనుభవిస్తోన్న భూములపై మీకు హక్కులు లేవంటూ ధరణి స్పష్టం చేస్తోంది. ఇదేందని అడిగితే అప్లై చేసుకోండి. పరిష్కరిస్తామంటున్నారు. కేవలం రిజిస్ట్రేషన్, ఆటోమెటిక్ మ్యుటేషన్ సులభతరం చేసేందుకే ఇన్నేండ్లుగా శ్రమించారా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. భూ రికార్డుల నిర్వహణలో పారదర్శకత పాటిస్తున్నామన్న అధికారుల ప్రగల్భాలు ఉత్తవేనన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సరికొత్త భూ పరిపాలన అందుబాటులోకి వచ్చిందన్నారు. ఐదంచెల రెవెన్యూ విధానం నుంచి మూడంచెల విధానాన్ని అమలు చేస్తున్నారు. గతంలో గ్రామం, మండలం, డివిజన్, జిల్లా, రాష్ట్ర స్థాయిలో రెవెన్యూ వ్యవస్థలు ఉండేవి. ఇప్పుడది మండలం, జిల్లా, రాష్ట్రానికి కుదించారు. వీఆర్వో వ్యవస్థ రద్దుతో గ్రామం, కొత్త ఆర్వోఆర్ చట్టంలో ఆర్డీఓల పాత్ర లేకపోవడంతో డివిజన్ల స్థాయిలో పాలన కనిపించడం లేదు. గ్రామాల్లో భూ సమస్యలను వీఆర్వోలే సృష్టించారని ప్రభుత్వం భావిస్తోంది. మరి ధరణి పోర్టల్ తోనైనా వివాదాల్లేని రెవెన్యూ వ్యవస్థ రూపకల్పనలో అడుగులు ఎందుకు వేయడం లేదని మేధావులు ప్రశ్నిస్తున్నారు. తహశీల్దార్లు రెండో అవతారమెత్తారు. కలెక్టర్లకేమో గ్రామ స్థాయి పరిశీలన అనివార్యంగా మార్చారు.
మాడ్యూళ్లే దిక్కు..
భూ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలంటూ కలెక్టర్లపై ఒత్తిడి పెరుగుతోంది. నిజానికి భూ సమస్యేదీ అంత ఈజీగా పరిష్కరించేది కాదన్న విషయాన్ని ఉన్నతాధికారులు గుర్తించడం లేదు. దాంతో డ్యాష్ బోర్డు క్లియర్ గా చూపించేందుకు దరఖాస్తులను తిరస్కరణే కలెక్టర్ల ముందున్న మార్గంగా కనిపిస్తోంది. కనీసం దరఖాస్తుదారుడికి ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారో కూడా సమాచారం ఇవ్వడం లేదు. దాంతో మళ్లీ మళ్లీ మీ సేవా కేంద్రాలకు వెళ్లి దరఖాస్తు చేసుకోవడం పరిపాటిగా మారుతోంది. కొత్త ఆర్వోఆర్ చట్టంలో ఏ సమస్య ఏ స్థాయి అధికారి పరిష్కరించాలన్న గైడ్ లైన్స్ రూపొందించలేదు. ఎలాంటి చట్ట సవరణ చేయలేదని రెవెన్యూ చట్టాల నిపుణులు చెబుతున్నారు. ఏదైనా రికార్డు నమోదు చేసేందుకు, సవరించేందుకు అధికారం ఒకే స్థాయి అధికారికి కట్టబెట్టాలి. కానీ కొత్త చట్టంలో ఏది ఎవరు సవరించాలో, ఎలా చేయాలో తెలియదు. ఉదాహరణకు భూములను రిజిస్ట్రేషన్ నిషేధిత జాబితాలో లక్షలాది ఎకరాలను నమోదు చేశారు. వీటిని సవరించేందుకు నిరభ్యంతర ధృవీకరణ పత్రాలను తీసుకురమ్మంటున్నారు. అవెలా తెచ్చుకోవాలో సామాన్య రైతాంగానికి తెలుసా? అన్న కనీస స్పృహ కూడా అధికార వర్గానికి రావడం లేదు. ఏదో రకంగా డేటాను ధరణి పోర్టల్ లో అప్ లోడ్ చేశాం. ఇక ధరణి పోర్టల్ లో 31 మాడ్యూళ్లు ఇచ్చాం. మీరే పరిష్కరించుకోండన్న విధంగా రూపొందించారని సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.
ఇదేం ధరణి?
– ఏదైనా ఒక సర్వే నంబరులో కొంత భూమి వివాదాస్పదంగా ఉంటే సదరు సర్వే నంబరులోని మొత్తం విస్తీర్ణాన్ని పీఓబీలో నమోదు చేశారు. ఆ సబ్ డివిజన్ కే పరిమితం చేయాల్సిన నిషేధాన్ని మొత్తానికి ఆపాదించి లక్షలాది మంది రైతుల భూములను అమ్ముకోలేని దుస్థితికి కారణమైంది. ఈ చిన్న సమస్యను ధరణి సాంకేతిక అధికారులు పరిష్కరించలేకపోతున్నారు. ఒక్క క్లిక్ తో పరిష్కారమయ్యే సమస్యకు అమాయక రైతులు దరఖాస్తు చేసుకుంటేనే పరిష్కరిస్తామంటున్నారు.
– రిజిస్ట్రేషన్ నిషేధిత భూముల జాబితాలో నమోదు చేసిన డేటాను గ్రామ సభలు ఆమోదించలేదు. వాటిపై నిషేధాన్ని కొనసాగించడంపై అనుమానాలు ఉన్నాయి.
– 2017లోనే భూ రికార్డుల ప్రక్షాళన చేసి కొత్త పట్టాదారు పుస్తకాలు జారీ చేశారు. మరి 2020లో అవే భూమి హక్కులను ప్రశ్నార్ధకం చేసిన డేటా ఎక్కడి నుంచి తీసుకున్నారో గ్రేట్ ధరణి పోర్టల్ ను రూపొందించిన అధికారులకే తెలియాలి.
– ఆటోమెటిక్ మ్యుటేషన్ చేస్తే పొషిషన్ లో ఎవరున్నా ఫర్వాలేదా? క్షేత్ర స్థాయి పరిశీలన లేకుండానే మార్పిడి చేయడం ద్వారా మెరుగైన వ్యవస్థ ఏర్పడినట్లేనా?
– ధరణి మాడ్యూళ్ల ద్వారా దరఖాస్తు చేసుకుంటే తిరస్కరిస్తే కారణం కూడా చెప్పలేని సాంకేతిక నైపుణ్యాన్ని కొనియాడాలా? మొబైల్ నంబరుకు ఫలానా కారణం వల్ల తిరస్కరిస్తున్నామన్న సమాచారాన్ని ఇవ్వలేని వ్యవస్థకు రెవెన్యూ అధికారులే తలలు పట్టుకుంటున్నారు.
– 2017 భూ రికార్డుల ప్రక్షాళన వరకు పట్టా భూములుగానే ఉన్నాయి. ఈ మేరకు కొత్త పాసు పుస్తకాలు జారీ అయ్యాయి. కానీ ధరణి పోర్టల్ లో అవే భూములను ఖాస్రా పహాణీ ప్రకారం ప్రభుత్వానివేనంటే ఎంత వరకు న్యాయం? దశాబ్దాలుగా వాటిని పట్టా భూములుగా రాసిన అధికారులపై, రిజిస్ట్రేషన్లను చేసిన సబ్ రిజిస్ట్రార్లను, మ్యుటేషన్లు చేసి పాసు పుస్తకాలు జారీ చేసిన తహశీల్దార్లు, ఆర్డీఓలపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు? సెటిలైన భూములను కూడా ప్రభుత్వ భూములుగా రాసిన డేటా కచ్చితత్వం ఎంతని రైతులు ప్రశ్నిస్తున్నారు.ఏడాది గడిచినా వంద రకాల సమస్యలను పరిష్కరించలేని ధరణి టెక్నాలజీ నిజంగానే అధికారులకు గొప్పగా కనిపిస్తుండడం విడ్డూరంగా ఉందని బాధితులు చెబుతున్నారు.