‘ఆస్ట్రేలియాకు నెంబర్ 1 స్థానం ఎలా ఇచ్చారు’

by Shyam |
‘ఆస్ట్రేలియాకు నెంబర్ 1 స్థానం ఎలా ఇచ్చారు’
X

దిశ స్పోర్ట్స్: ఐసీసీ టెస్టు ర్యాంకుల విధానంపై మరో సారి వివాదం రాజుకుంటోంది. 42 వారాల పాటు టాప్ ర్యాంకులో కొనసాగిన టీం ఇండియా, తాజా ర్యాంకుల్లో ఏకంగా మూడో స్థానానికి పడిపోయింది. 2016-17 సీజన్‌కు సంబంధించిన పాయింట్లలో కోత పెట్టడం వల్ల ర్యాంకు కోల్పోయినట్లు ఐసీసీ చెబుతోంది. కానీ దీనిపై పలు విమర్శలు చెలరేగుతున్నాయి. అసలు ఆస్ట్రేలియా జట్టు ఈ మధ్య సాధించిన గొప్ప విజయాలేవీ లేకపోయినా టాప్ ర్యాంక్ ఎలా కట్టబెట్టారని..? దీనిపై పలు అనుమానాలు ఉన్నాయని మాజీ క్రికెటర్లు ఆరోపిస్తున్నారు. గత వారం టెస్టు ర్యాంకుల విధానంపై వెస్టిండీస్ మాజీ క్రికెటర్ మైఖేల్ హోల్డింగ్ తీవ్ర విమర్శలు చేశారు. రెండు టెస్టులు ఆడి గెలిచినా, నాలుగు టెస్టులు ఆడి గెలిచినా ఒకే పాయింట్లు రావడం ఏంటని ప్రశ్నించారు. అసలు ఏ ప్రాతిపదికన ఇలా పాయింట్లు కేటాయిస్తున్నరో ఐసీసీకే తెలియాలని ఎద్దేవా చేశారు. తాజాగా, టీం ఇండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ కూడా టెస్టు ర్యాంకులపై విరుచుకపడ్డారు. ఐసీసీ విడుదల చేసిన తాజా ర్యాంకులపై చాలా అనుమానాలు ఉన్నాయని చెప్పారు. ఉపఖండంలో సరైన ట్రాక్ రికార్డు లేని ఆస్ట్రేలియాకు నెంబర్ వన్ ర్యాంకు ఎలా వరించిందని గౌతమ్ ప్రశ్నించాడు. స్టార్ స్పోర్ట్స్ ఛానల్ ప్రసారం చేస్తున్న క్రికెట్ కనెక్టెడ్ అనే కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశాడు. టెస్టు క్రికెట్‌లో చాలా కాలం నుంచి భారత జట్టు ఆధిపత్యం ప్రదర్శిస్తున్న విషయం ప్రపంచమంతా చూస్తోందన్నారు. భారత జట్టు ఓకే సారి మూడో ర్యాంకుకు పడిపోయిందంటే మనం ఆశ్చర్యపడనక్కరలేదు. ఆట వల్ల కాదు ఇలా జరిగింది.. మెరుగైన పాయింట్లు, ర్యాంకింగ్ వ్యవస్థ లేనప్పుడే ఇలా జరుగుతుందని ఐసీసీని పరోక్షంగా విమర్శించాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ప్రారంభించిన తర్వాత కూడా.. ఒక జట్టు స్వదేశంలో గెలిచినా, విదేశాల్లో ఒకే రకమైన పాయింట్లు ఇవ్వడమనేదే హాస్యాస్పదంగా ఉందని గంభీర్ అన్నాడు. ఒక వేళ స్వదేశీ ప్రదర్శనను చూసినా ఆస్ట్రేలియా కంటే భారత జట్టే మెరుగ్గా ఉందని.. టాప్ ర్యాంక్‌కు నిజమైన అర్హత కేవలం భారత జట్టుదేనని కుండబద్దలు కొట్టాడు. నాకైతే ఆస్ట్రేలియా జట్టు టాప్ ర్యాంకుకు వెళ్లడంపై చాలా అనుమానాలున్నాయని అన్నాడు. మే నెల తొలి వారంలో ఐసీసీ ప్రకటించిన ర్యాంకుల ప్రకారం ఆసీస్ జట్టు 116 పాయింట్లతో తొలి స్థానంలో, న్యూజీలాండ్ జట్టు 115 పాయింట్లతో రెండో స్థానంలో, భారత జట్టు 114 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాయి. భారత జట్టు ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మూడో స్థానానికి పడిపోయినా.. టెస్టు ఛాంపియన్‌షిప్ పాయింట్లలో మాత్రం ముందంజలో ఉంది.

Advertisement

Next Story