- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఒలింపిక్స్ కష్టమే.. జరిగినా నష్టమే..!
ప్రపంచంలోనే అతి పెద్ద క్రీడా పండగ ఒలింపిక్స్. ప్రతీ నాలుగేండ్లకోసారి నిర్వహించే ఈ క్రీడా పోటీల్లో పాల్గొనాలని క్రీడాకారులంతా కలలు కంటారనేది వాస్తవం. అంతేకాకుండా ఒలింపిక్స్ నిర్వహణ సైతం ఆయా దేశాలకు ఎంతో ప్రతిష్టాత్మకం. ఈ క్రీడల నిర్వహణకు వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తారు. ఆర్థికంగా బలంగా ఉన్న దేశాలే ఒలింపిక్స్ నిర్వహణ తర్వాత కోలుకునేందుకు సమయం పడుతుందంటే.. ఈ క్రీడలకు ఏ మేరకు ఖర్చు అవుతుందో ఊహించుకోవచ్చు.
గతంలో గ్రీస్, బ్రెజిల్ దేశాల ఆర్థిక వ్యవస్థలు ఒలింపిక్స్ నిర్వహణ తర్వాత తీవ్ర ఒడిదుడుకులకు గురైన విషయం తెలిసిందే. ఇక ఈ ఏడాది జులై 20 నుంచి అగస్టు 9 వరకు జపాన్‌లో ఒలింపిక్స్ క్రీడా వేడుకలు జరగనున్నాయి. కాగా, జపాన్ ఈ క్రీడల కోసం ఇప్పటికే దాదాపు 94 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. ప్రధాన స్టేడియంతో పాటు ఇతర క్రీడా మైదానాలు, ఆటగాళ్ల అపార్ట్‌మెంట్లు, రోడ్లు తదితర మౌలిక వసతుల కోసం ఈ డబ్బును ఖర్చు చేసింది. ఇప్పటికే నిర్మాణాలన్నీ పూర్తయ్యాయి.
కాగా, ఇప్పుడు కరోనా మహమ్మారి భయాందోళన నేపథ్యంలో ఒలింపిక్స్ క్రీడలపై నీలినీడలు కమ్ముకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే పలు క్రీడా ఈవెంట్లను రద్దు చేశారు. ఒలింపిక్స్ అర్హత పోటీలను కూడా వాయిదా వేశారు. పలు దేశాలు సన్నాహక క్యాంపులను కూడా నిర్వహించలేకపోతున్నాయి. ఈ నేపథ్యంలో మరో నాలుగు నెలల్లో క్రీడా పోటీలు ప్రారంభం కావల్సి ఉండగా.. క్రీడాకారుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. స్వయంగా ‘జపాన్ ప్రధాని అబే’ ఈ పోటీలు ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహిస్తామని చెబుతుండగా.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఒలింపిక్స్‌ను ఒక ఏడాది పాటు వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నారు.
కరోనా వైరస్‌తో ప్రపంచ వ్యాప్తంగా చోటుచేసుకుంటున్న పరిణామాలను ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ కూడా నిశితంగా గమనిస్తోంది. వైరస్ తీవ్రత మరింతగా పెరిగితే ఒక నెల పాటు వాయిదా వేసేలా చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. కానీ జపాన్ మాత్రం ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉంది. నెల రోజుల పాటు వాయిదా వేస్తే, ఆ మేరకు నిర్వహణ ఖర్చు పెరిగిపోయే అవకాశం ఉంది. ఇక ఏడాది పాటు వాయిదా వేస్తే, ఆ క్రీడా నిర్మాణాలను కాపాడుకోవడం జపాన్‌కు ఆర్థికంగా పెను భారంగా మారనుంది. అందుకే షెడ్యూల్ మేరకే క్రీడలు నిర్వహించాలని ఒలింపిక్ నిర్వాహక కమిటీ, జపాన్ ప్రభుత్వం భావిస్తోంది. కరోనా కట్టడికి అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నామని.. క్రీడాకారుల ఆరోగ్యాలకు తమది భరోసా అని జపాన్ చెబుతోంది.
ఓ వైపు అథ్లెట్లు కూడా ఆందోళన చెందుతున్నారు, కరోనా భయంతో ఇప్పటికే ప్రాక్టీస్ లేకుండా పోయింది. మరోవైపు ఒలింపిక్స్ క్రీడలకు కరోనా ప్రమాదం ఉందని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ప్రాక్టీస్ లేకుండా పతకాలు ఎలా సాధించగలమని ప్రశ్నిస్తున్నారు. క్రీడలను కనీసం ఏడాది పాటు వాయిదా వేయాలని కోరుతున్నారు. నాలుగేండ్లకోసారి వచ్చే ఈ క్రీడల్లో అత్యుత్తమ ప్రదర్శన చేయాలని అందరూ కోరుకుంటారు.. కానీ ఇలాంటి పరిస్థితుల్లో అత్యుత్తమ ప్రదర్శన చేయడం కష్టమేనని అంటున్నారు.
ఒలింపిక్స్ వాయిదా వేస్తే ఆర్థిక భారమని జపాన్ భావిస్తుంటే.. ఇప్పుడు నిర్వహిస్తే అథ్లెట్ల ఆరోగ్యాలపై ప్రభావం పడుతుందనేది మరో వాదన. మరి అంతిమంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే !
Tags: Olympics, Japan, Tokyo, America, Trump, Huge loss, Corona