పాత పథకాలకు పాతర..!

by  |
పాత పథకాలకు పాతర..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్) పథకంలో భాగంగా సర్వీసు రోడ్లు, రేడియల్ రోడ్లను పూర్తి చేయడంలోనే ఏళ్లు గడుపుతున్న హెచ్ఎండీఏ ఇప్పుడు కొత్త రోడ్డు రవాణా వ్యవస్థను తెరపైకి తీసుకొచ్చింది. ఓఆర్ఆర్- ఇన్నర్ రింగ్ రోడ్డులను కలుపుతూనే ఈ రెండు రింగ్ రోడ్లకు మధ్యలో కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను కలుపుతూ రోడ్డు నెట్‌వర్క్‌ను ప్రతిపాదించింది. గ్రిడ్ రోడ్‌కు సుమారు రూ. 6,000 కోట్లు అంచనా వ్యయంగా భావించిన అథారిటీ ఇప్పటి వరకు అవి ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేయనేలేదు. మరి ఇప్పడు ప్రతిపాదిస్తున్న కొత్త నెట్ వర్క్‌ ఏమేరకు కార్యరూపంలోకి వస్తుందో వేచి చూడాలి.

158 కిలోమీటర్లుగా ఉన్న ఔటర్‌ను హెచ్ఎండీఏ నాలుగు విభాగాలుగా విభజించింది. శంషాబాద్ రోడ్డు నుంచి పటాన్‌చెరు, పటాన్‌చెరు నుంచి శామీర్‌పేట్, శామీర్‌పేట్ నుంచి పెద్దంబర్‌పేట్, పెద్దంబర్‌పేట్ నుంచి శంషాబాద్ రోడ్ వరకు రోడ్డు నెట్‌వర్క్‌‌కు ప్రణాళికను సిద్ధం చేసేందుకుగానూ ప్రత్యేకంగా కన్సల్టెన్సీ కోసం టెండర్లను పిలిచింది. ఈ పాటికే రెండు రింగ్ రోడ్లను కలుపుతూ ప్రత్యేకంగా 33 రేడియల్ రోడ్లను ప్రతిపాదించింది. వీటికి అంచనా వ్యయం సుమారు రూ. 2,500 కోట్లుగా నిర్ణయించింది. వీటిలో 7 రోడ్లను హెచ్ఎండీఏ ఏర్పాటు చేసేందుకుగానూ వ్యయం రూ.370 కోట్లుగా ప్రకటించింది. మిగతా రోడ్లు రోడ్డు భవనాల విభాగం చేపట్టింది. కానీ, అవి ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మరికొన్ని రోడ్లను ప్రతిపాదిస్తున్న హెచ్ఎండీఏ ఇప్పుడు నూతన రోడ్డు వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలను సిద్ధం చేసింది. కేవలం కొత్త మున్సిపాలిటీలకు రోడ్లు అంటూ ప్రచారానికి తెరలేపింది.

ఔటర్ రింగ్ రోడ్‌కు కొత్త మున్సిపాలిటీలకు మధ్య రవాణా వ్యవస్థ మరింత మెరుగుపరిచేందుకు కొత్త రోడ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. శంషాబాద్ – పటాన్ చెరు వరకు 1,196 కి.మీలు, పటాన్‌చెరు – శామీర్‌పేట్ మార్గంలో 681 కి.మీలు. శామీర్‌పేట్ నుంచి పెద్దంబర్‌పేట్ వరకు 1,124 కి.మీలు, పెద్దంబర్‌పేట్ నుంచి శంషాబాద్ రోడ్ వరకు 1,176 కి.మీల పొడవు రోడ్లను అథారిటీ ప్రతిపాదిస్తోంది. మాస్టర్ ప్లాన్‌లో ప్రతిపాదించిన రోడ్లను పరిగణలోకి తీసుకుని ఈ రోడ్లను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. ఈ రోడ్లను రైట్ ఆఫ్ వే 30 మీటర్ల నుంచి 90 మీటర్ల వరకు కూడా ఉండేలా చూడాలని అథారిటీ ప్రతిపాదిస్తున్నది. నిరంతరం వాహనాల రాకపోకలు సౌలభ్యంగా సాగిపోయేందుకు వీలుగా ఈ వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందులోనే బస్ బేలు, పార్కింగ్ స్థలాలు, నాన్ మోటార్ ట్రాన్స్‌పోర్టు వంటి విషయాలను కూడా పొందుపరచాలని అథారిటీ సూచించింది.


Next Story

Most Viewed