OLA : మరో రికార్డు సాధించిన ఓలా ఈ-స్కూటర్!

by Harish |   ( Updated:2021-09-17 07:17:39.0  )
Ola e-scooters
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ సంస్థ మరోసారి రికార్డులను నమోదు చేసింది. బుధవారం నుంచి కంపెనీ తన ఓలా ఈ-స్కూటర్ల విక్రయాలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. మొదటి 24 గంటల వ్యవధిలో అత్యధికంగా రూ. 600 కోట్ల విలువైన విక్రయాలను కంపెనీ సాధించింది. అయితే, రెండో రోజు సైతం రికార్డు స్థాయిలో అమ్మకాలు నమోదయ్యాయని సంస్థ సీఈఓ భవిష్ అగర్వాల్ చెప్పారు. కేవలం రెండు రోజుల్లో ఓలా మొత్తం రూ. 1,100 కోట్ల విలువైన స్కూటర్లను విక్రయించిందన్నారు. భారీస్థాయిలో ఆర్డర్లు వచ్చిన నేపథ్యంలో ప్రస్తుతానికి అమ్మకాల ప్రక్రియను నిలిపేశామని, దీపావళి పండుగ కోసం తిరిగి నవంబర్ 1న తిరిగి ప్రారంభించనున్నట్టు కంపెనీ వివరించింది.

అయితే, రెండో రోజు విక్రయాల్లో కూడా మొదటిరోజు స్థాయిలోనే రూ. 500 కోట్ల విలువైన అమ్మకాలు కంపెనీ నమోదు చేసింది. ఇది దేశీయ వాహన పరిశ్రమ చరిత్రలోనే అతిపెద్ద రికార్డు అని భవిష్ అగర్వాల్ అభిప్రాయపడ్డారు. ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా ఒక ఉత్పత్తికి విలువ పరంగా ఈ స్థాయిలో వినియోగదారుల నుంచి స్పందన రావడం రికార్డు అని ఆయన తెలిపారు. కాగా, ఓలా తన మొదటి ఈ-స్కూటర్ ఎస్1, ఎస్1 ప్రో వేరియంట్లను జూలై నుంచి ముందస్తు బుకింగ్‌లను ఆహ్వానించింది. వీటి ధరలు ఎస్1 రూ. 99,999 ఉండగా, ఎస్1 ప్రో రూ. 1,29,999గా కంపెనీ నిర్ణయించింది. ఆ తర్వాత ఈ నెల 15 నుంచి రూ. 20 వేలు చెల్లించి ఓలా ఈ-స్కూటర్ అమ్మకాలను ప్రారంభించింది. మిగిలిన నగదును ఈ-స్కూటర్ డెలివరీ సమయంలో చెల్లించే అవకాశాన్ని కంపెనీ వినియోగదారులకు ఇచ్చింది.

Advertisement

Next Story