ప్రతి ఇంటికి ఆరు మొక్కలు.. పండుగలా హరితహారం

by Shyam |
ప్రతి ఇంటికి ఆరు మొక్కలు.. పండుగలా హరితహారం
X

దిశ, మేడ్చల్: మే 27వ తేదీన సీఎం కేసీఆర్ రాజీవ్ రహదారి మీదుగా ఎర్రవెల్లిలోని తన ఫాంహౌజ్‌కు వెళ్తుండగా రహదారికి ఇరువైపుల హరితహారం మొక్కలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో వెంటనే స్థానిక మంత్రి, అధికారులకు స్వయంగా ఫోన్ చేసి రహదారికి ఇరువైపుల పెద్ద చెట్లు నాటి పచ్చదనం ఉట్టిపడేలా చేయాలని, అలాగే శామీర్‌పేట ఆసుపత్రిని ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. దీంతో వెంటనే అప్రమత్తమైన జిల్లా అధికార యంత్రాంగం ఈ నెల 25 నుంచి చేపట్టబోయే ఆరో విడుత హరితహారంలో భాగంగా అన్ని ప్రాంతాల్లో విరివిగా మొక్కలు నాటాలని నిర్ణయించింది. జిల్లాలోని 61 గ్రామ పంచాయితీలు, 13 పురపాలక సంఘాల పరిధిలో పెద్ద ఎత్తున మొక్కలు నాటేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులకు మంత్రి మల్లారెడ్డి, జిల్లా కలెక్టర్ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రజలను భాగస్వాములను చేసేందుకు పురపాలక, గ్రామ పంచాయతీల్లో కుటుంబానికి ఆరు మొక్కలు పంపిణీ చేసి, హరితహారాన్ని పండుగలా నిర్వహించేందుకు కార్యచరణ సిద్ధం చేశారు. స్మశాన వాటికలు, డంపింగ్ యార్డులు, పార్కులు, లే అవుట్లు, ప్రభుత్వ స్థలాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇందుకోసం 71 ప్రాంతాల్లో నర్సరీలను అందుబాటులో ఉంచారు. జిల్లాలో 7.5శాతంగా ఉన్న అడవులు 13 శాతానికి పెంచే లక్ష్యంగా జిల్లా యంత్రాంగం పనిచేస్తున్నట్టు అటవిశాఖ అధికారులు చెబుతున్నారు.

Advertisement

Next Story