- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పోలీసు స్టేషన్లకు పోటెత్తిన విద్యార్థులు
దిశ, న్యూస్ బ్యూరో: దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కారణంగా బ్యాచ్‌లర్ హాస్టల్స్ మూతపడటంతో హైదరాబాద్‌లోని విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి, పొరుగు జిల్లాల నుంచి చదువు, ఉద్యోగాల నిమిత్తం నగరానికి వచ్చినవారు హాస్టళ్లు మూతపడటంతో ఇక్కడ ఉండలేక స్వస్థలాలకు వెళ్ల లేక వేల సంఖ్యలో విద్యార్థులు రోడ్డుమీద పడ్డారు. దీంతో నగర పోలీసులు ప్రత్యామ్నాయ చర్యలపై దృష్టి పెట్టారు. స్వస్థలాలకు వెళ్లేందుకు ఒక్కసారికి మాత్రమే ఉపయోగపడే ‘వన్ టైమ్’ పాస్‌లను జారీ చేశారు. ఈ పాస్‌లు తీసుకోవడానికి విద్యార్థులు పంజాగుట్ట, కూకట్‌పల్లి, మాదాపూర్ తదితర పోలీసు స్టేషన్లకు పోటెత్తారు. నగరమంతా లాక్‌డౌన్ కారణంగా నిర్మానుష్యంగా మారిపోతే పోలీసు స్టేషన్ల దగ్గర మాత్రం వేల సంఖ్యలో విద్యార్థులు పాస్‌ల కోసం క్యూ కట్టారు.
సీఎం ఆదేశాలూ బేఖాతరు..
హాస్టళ్లను మూసివేయవద్దంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేసినా వాటిని హాస్టల్ యాజమన్యాలు బేఖాతరు చేశాయి. మెస్ సౌకర్యాన్ని కూడా బంద్ పెట్టాయి. విద్యార్థులకు తిండి లేక, నిలువ నీడ లేక రోడ్డున పడ్డారు. ఈ పరిస్థితి మంత్రి కేటీఆర్ దృష్టికి వెళ్లింది. విద్యార్థులను అర్ధాంతరంగా రోడ్డున పడేసి ఆందోళనకు గురిచేయవద్దనీ, హాస్టళ్లను తెరిచే ఉంచాలని ఆయన స్పష్టం చేశారు. నగర మేయర్ సహా స్థానిక కార్పొరేటర్లు హాస్టల్ యజమానులకు పరిస్థితిని అర్థం చేయించాలని స్పష్టం చేశారు. అయితే, అప్పటికే చాలా మంది విద్యార్థులు స్వస్థలాలకు వెళ్లడానికి పోలీసు స్టేషన్లకు ‘వన్ టైమ్’ పాస్‌ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్ర సరిహద్దులు దాటేంత వరకు అనుమతి ఇవ్వడంతో వేల రూపాయలకు టాక్సీలను మాట్లాడుకుని చాలా మంది వెళ్లిపోయారు. పొరుగు రాష్ట్రంలోని పోలీసులు ఏ మేరకు అనుమతి ఇస్తారనే సందేహం ఉన్నప్పటికీ ఇక్కడి హాస్టళ్లు మూతపడటంతో మరో మార్గంలేక విద్యార్థులు సొంతూరుకు పయనమయ్యే ఆలోచనలో పడ్డారు. పోలీసు స్టేషన్ పరిసరాలను గమనిస్తే ‘లాక్ డౌన్’ ఉందన్న భావనే కలగనంత రద్దీ కనిపించింది.
పరిస్థితి సమీక్షించిన హోం మంత్రి
స్వయంగా హోం మంత్రి మహమూద్ అలీ సైతం రంగంలోకి దిగి పరిస్థితిని సమీక్షించారు. పోలీసులకు తగిన ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూడాలని స్పష్టం చేశారు. హాస్టళ్లను తిరిగి తెరిపించడంతో పాటు స్వస్థలాలకు వెళ్లాలనుకునేవారికి ఆటంకాలు లేకుండా చూడాలని స్పష్టం చేశారు. నగర పోలీసులు సైతం విద్యార్థుల బాధలను అర్థం చేసుకుని పాస్‌ల జారీపై దృష్టి పెట్టారు. లాక్‌డౌన్ ఎన్ని రోజులు ఉంటుందో తెలియని గందరగోళంతో విద్యార్థులు చాలా మంది స్వస్థలాలకు వెళ్లడానికే మొగ్గుచూపారు. ఇక్కడ కోచింగ్ సౌకర్యం లేక, ప్రైవేటు కంపెనీలు తెరిచే పరిస్థితి లేకపోవడంతో హాస్టల్‌లో ఉండటానికి డబ్బుల ఇబ్బంది కూడా ఉండటంతో వారు వెళ్లిపోవాలనే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
యథావిధిగా సౌకర్యాలు కల్పించాలని ఆదేశాలు..
పరిస్థితి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ఇలాంటి రాకపోకల వల్ల కరోనా వైరస్ వ్యాప్తికి ప్రమాదం పొంచి ఉందని డీజీపీ అభిప్రాయపడ్డారు. ఎట్టి పరిస్థితుల్లో విద్యార్థులకు హాస్టల్ యాజమాన్యాలు ఇబ్బంది కలిగించరాదనీ, యథావిధిగా హస్టళ్లు తెరిచి వారికి సౌకర్యాలు కల్పించాలని ఆదేశాలు జారీ చేశారు. ఒకవేళ మూసివేసినట్లయితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలు రోడ్లమీదకు రావడం, ప్రయాణాలు చేయడం ద్వారా కరోనా వ్యాప్తికి అవకాశం ఇచ్చినట్లవుతుందనీ, తద్వారా లాక్ డౌన్ నీరుగారుతుందనీ, అటువంటి చర్యలు వద్దని స్పష్టం చేశారు. స్థానిక పోలీసు ఏసీపీలు, కార్పొరేటర్లు, జీహెచ్ఎంసీ అధికారులు ఆయా హాస్టళ్ల యజమానులతో సమావేశం ఏర్పాటు చేసి అర్థం చేయించాలని డీజీపీ కోరారు.
Tags: Telangana, LockDown, Hostel, Students, One Time Pass, Police, KTR, Home Minister