కరోనాపై కరీంనగర్ విజయం వెనుక కథేంటి..?

by Sridhar Babu |   ( Updated:2020-04-26 07:44:22.0  )
కరోనాపై కరీంనగర్ విజయం వెనుక కథేంటి..?
X

దిశ, కరీంనగర్: అది మార్చి 16, 2020. ప్రపంచమంతా కరోనా వైరస్ కారణంగా అల్లకల్లోలం అవుతోంది. అప్పుడప్పుడే తెలంగాణలోనూ కరోనా బాధితులు వెలుగులోకి వస్తున్నారు. కానీ, కరీంనగర్‌వాసులు మాత్రం కరోనా గురించి పట్టించుకోలేదు. తమ ప్రాంతంలో ఆ మహమ్మారి రాలేదనే ధీమాతో సాధారణ జీవనం గడుపుతున్నారు. అంతలోనే పిడుగులాంటి వార్త నగరమంతా వ్యాపించింది. అంతే.. అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న కరీంనగర్‌వాసుల్లో ఒక్కసారిగా కలవరం మొదలైంది. ఇండోనేషియాకు చెందిన తబ్లిఘీ జమాతే మత ప్రచారకులు కరీంనగర్‌కు వచ్చారని, వారికి కరోనా లక్షణాలు ఉన్నాయని ఓ వార్త దావానలంలా వ్యాపించడమే ఇందుకు కారణం. అప్పటివరకు కరోనా ఊసే లేని కరీంనగర్‌వాసులను ఈ వార్త ఉలిక్కిపడేలా చేసింది. పలువురు స్థానికులను హైదరాబాద్ తరలించడం, ఆ తరువాత పరీక్షల్లో వారికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కావడం, ఈ కాలనీని కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించడం చకాచకా జరిగిపోయాయి. కరోనా కేసులను నియంత్రించిన కంటైన్మెంట్‌ జోన్‌‌గా కరీంనగర్ గుర్తింపు పొందింది.

కంటైన్‌మెంట్ జోన్‌గా…

ఇండోనేషియన్లు బస చేసిన ప్రార్థనామందిరమున్న ప్రాంతాన్ని కంటైన్‌‌మెంట్ జోన్‌గా జిల్లా అధికారులు ప్రకటించారు. దాదాపు 4 వేల కుటుంబాలుండే ఈ ప్రాంతాన్ని దిగ్బంధించారు. ఈ కాలనీకి ఎవరూ రాకుండా కట్టడి చేశారు. ప్రజలెవరూ వీధుల్లో కూడా తిరగవద్దంటూ అధికారులు ప్రచారం చేశారు. దీంతో కాలనీవాసులు షాక్‌కు గురయ్యారు. ఆశావర్కర్లు, డాక్టర్లు టీమ్‌లుగా ఏర్పడి ప్రతి ఇంటికీ వెళ్లి థర్మల్ స్క్రీన్ టెస్ట్ చేశారు. 28 రోజులపాటు దిగ్బంధనంలో ఉన్న ఈ ప్రాంతంలోని కిరాణ షాపులను కూడా మూసివేశారు. ఉన్నట్టుండి క్వారంటైన్ జోన్ కావడంతో కాలనీవాసులు తీవ్ర ఉద్వేగానికి గురయ్యారు. ఉదయం మునిసిపల్ వర్కర్స్ వచ్చినప్పుడు చెత్త బుట్టలు ఇవ్వడానికి, మెడికల్ టీమ్స్ వస్తే చెకప్ చేయించుకోవడానికి, కూరగాయలు వస్తే తీసుకునేందుకు మెయిన్ గేటు వద్దకు రావాలే తప్ప మిగతా సమయమంతా కూడా ఇళ్లలోనే ఉండాల్సి వచ్చింది. ఒకవేళ బయటకు వస్తే పై నుండి డ్రోన్ కెమెరా నిఘా, కాలనీలో గస్తీ కారణంగా బయటకు రావడానికే వెనుకంజ వేశారు మెజార్టీ ప్రజలు.

ఊరట వైపు…

మొదట కంటైన్‌మెంట్ జోన్‌గా ప్రకటించి కాలనీ చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేయడంతో ఆందోళన వ్యక్తం చేసిన కాలనీవాసులు రోజులు గడుస్తున్నకొద్దీ అలవాటు పడ్డారు. వారి కోసం కూరగాయలను బల్దియా సిబ్బంది ఒక్కో ఇంటికి ఆరు కిలోల చొప్పున సరఫరా చేశారు. నిత్యావసరాల కోసం కొన్ని ప్రత్యేకమైన షాపులను ఏర్పాటు చేసిన అధికారులు డోర్ డెలివరీ చేసే విధంగా చర్యలు చేపట్టారు. కంటైన్‌మెంట్‌వాసులు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వగానే వారికి సంబంధించిన సామగ్రిని సదరు ఇంటికి పంపించే ఏర్పాటు చేశారు. పాలు కూడా ఇంటింటికీ సరఫరా చేసేందుకు కొంతమందిని అనుమతించారు. దీంతో ఈ ప్రాంత వాసులకు నిత్యావసరాల కొరత తీరిపోయింది. కొన్నిషాపులవారు మెడిసిన్స్ కూడా డోర్ డెలివరీ చేశారు. బ్యాంకులో డబ్బులు ఉండి కూడా నిత్యవసరాలను కొనుగోలు చేసుకోలేని వారి కోసం ప్రత్యేకంగా కేడీసీసీ బ్యాంకుకు చెందిన మొబైల్ ఏటీఎంను కూడా అధికారులు ఏర్పాటు చేశారు. తరచూ వచ్చే మెడికల్ టీమ్స్‌తో చెకప్ చేయించుకోవడంతోపాటు నిత్యావసరాల సమస్య కూడా పరిష్కారం కావడంతో ఊరట చెందారు. దాదాపు వారం రోజుల తరువాత కంటైన్‌మెంట్‌కు అలవాటు పడిన ఆ ప్రాంతవాసులు కరోనా వ్యాధి ప్రబలుతున్న తీరును ప్రసార మాధ్యమాల్లో గమనించడంతో తాము ఇళ్లకే పరిమితం కావాలన్న నిర్ణయానికి వచ్చేశారు. ప్రభుత్వం అందించిన ఉచిత బియ్యం కూడా అందడంతో దినసరి కూలీ పనిచేసుకుని జీవనం సాగించే కుటుంబాలకు భరోసా దొరికినట్టయింది. ఉన్నత వర్గాలు కూడా ఆ ప్రాంతంలోని పేదలను ఆదుకునేందుకు ముందుకు రావడం, బల్దియా కమిషనర్ వల్లూరి క్రాంతి స్వచ్ఛంద సంస్థల ద్వారా ఆర్థిక సాయం అందించేలా చొరవ చూపడం వారికి మరింత ఊరటనిచ్చింది. మొదట్లో అనూహ్య నిర్బంధం కొంత ఇబ్బందిగా అనిపించినా కరోనా వైరస్ బారిన పడకుండా ఉండాలంటే స్వీయ నిర్బంధమే మేలన్న భావనకు చేరుకున్నారు.

నియంత్రణ చర్యలు…

కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు మొట్టమొదటి కంటైన్‌మెంట్ జోన్‌లో స్పెషల్ శానిటైజేషన్ చర్యలు చేపట్టారు. సోడియం హైపో క్లోరైట్ ద్రావకాన్ని పిచికారి చేయించారు. ఐదు ట్రాక్టర్లతో జెట్ స్ప్రే, పవర్ స్ప్రేయర్స్‌తో ప్రతి ఇంటిని శానిటైజ్ చేశారు. నిరంతరాయంగా వారంపాటు శానిటైజ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మెడికల్ టీమ్స్ వెళ్లినప్పుడు పరీక్షలు చేయించుకోవడానికి నిరాకరించిన వారికి కరోనా గురించి వివరించి ఒప్పించే ప్రయత్నం చేశారు. ఈ జోన్‌లో మూడుసార్లు పరీక్షలు చేయించడంతోపాటు శానిటైజేషన్ కార్యక్రమంలో భాగంగా ప్రతి రెండు రోజులకోసారి మునిసిపల్ వర్కర్స్‌చే చెత్త సేకరణ చేయించారు. ఈ ప్రాంతం నుండి సేకరించిన చెత్తను వేరుగా డీకంపోజ్ చేయించడం, రోజూ రోడ్లను శుభ్రం చేయించారు. వైరస్ బయటకు స్ప్రెడ్ కాకుండా ఉండేందుకు తీసుకున్న చర్యలు ఒకటికి రెండుసార్లు జరిగాయని చెప్పవచ్చు. దీంతో ఇండోనేషియన్లు సంచరించిన ప్రాంతాల్లో వైరస్ ఉన్న సమూలంగా అంతరించిపోయే విధంగా అధికార యంత్రాంగం, బల్దియా సంయుక్తంగా చేపట్టిన కార్యాచరణ సఫలం అయింది.

పకడ్బందీగా చర్యలు తీసుకున్నాం: వై.సునీల్ రావు, కరీంనగర్ మేయర్

మొదట్లో కరోనా గురించి వినడమే తప్ప అది కరీంనగర్‌ను తాకుతుందని ఊహించలేదు. ఒకేసారి పెద్దఎత్తున కరోనా బాధితులు కరీంనగర్ నుండే వస్తారని కూడా అనుకోలేదు. ఊహించని పరిణామమే అయినా సమర్థవంతంగా ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నాం. ఇందుకు జిల్లా కలెక్టర్, పోలీసు కమిషనర్, బల్దియా కమిషనర్‌ల సహకారం, ఎప్పటికప్పుడు వారందించే సూచనలు పాటించడం వల్లే సత్ఫలితాలు సాధించాం. జిల్లా మంత్రి గంగుల కమలాకర్, ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్‌ల‌ దిశానిర్దేశం కూడా మాకు లాభించింది. ఆన్‌లైన్ ద్వారా కరోనా గురించి ఎప్పటికప్పుడు అప్‌డేట్ అయ్యాం. ఇందుకు అవసరమైన సామగ్రిని తెప్పించుకోవడంపై కూడా చొరవ తీసుకున్నాం. నియంత్రణకు కావల్సిన కాలనీల్లో పారిశుధ్య సమస్యల పరిష్కారం, కంటైన్‌మెంట్ ఏరియావాసులకు నిత్యావసరాల పంపిణీలో మా కార్మికులు అందించిన సేవలు మరవలేనివి. ఆయా కాలనీల ప్రజలు కూడా మాకు సంపూర్ణంగా సహకరించడం కలిసివచ్చిన అంశం. కరోనా కట్టడి కోసం ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల భాగస్వామ్యం కూడా బాగుంది. అన్ని వర్గాల ప్రజలు కూడా ప్రభుత్వ యంత్రాంగానికి అనుకూలంగా వ్యవహరించడం వల్లే కరోనా ప్రబలకుండా కట్టడి చేయగలిగాం. కరోనా మహమ్మారి గురించి చాలామంది బయట తిరగవద్దని సూచించారు కానీ కష్టకాలంలో ప్రజల్లో భరోసా కల్పించాలన్న లక్ష్యంతో స్వీయ రక్షణ చర్యలు తీసుకుని నగర ప్రజలకు అందుబాటులో ఉంటూ ముందుకు సాగాం.

మొదట్లో కొంత ఇబ్బందిపడ్డ మాట వాస్తవం: మహ్మద్ అఖిల్, కార్పొరేటర్, కరీంనగర్

కరోనా కారణంగా మేమంతా కంటైన్‌మెంట్‌లో 28 రోజులు ఉండాలా అని ఆందోళన చెందాం. కానీ, జిల్లా అధికారులు అందించిన సహకారానికి తోడు అంతర్జాతీయంగా కరోనా వల్ల ప్రాణాలు కొల్పోతున్న విషయాన్ని కాలనీవాసులు గుర్తించారు. దీంతో ఈ వ్యాధి బారిన పడవద్దన్న ఆలోచనతో ప్రతిఒక్కరూ కూడా సహకరించారు. కంటైన్‌మెంట్ జోన్‌లో ఉన్నవారికి కావల్సిన అన్ని రకాల సాయం అందించడంతోపాటు, వైద్యసేవలు కూడా అందుబాటులో ఉంచే విధంగా జిల్లా అధికారులు చొరవ తీసుకోవడం మాకు ఆనందాన్ని ఇచ్చింది. ప్రత్యక్ష్యంగా నేను ఇంటింటికీ తిరిగాను. రోజులు గడుస్తున్నకొద్దీ కాలనీవాసుల్లో మార్పును గమనించాను. ఇలా కట్టడి చేయడం వల్లే కరోనాను నిలువరించుకోగలిగామన్న ఆనందం అయితే ఇప్పుడు మాలో కనిపిస్తోంది. ప్రాణాలు హరించే కరోనా కట్టడి కోసం కంటైన్‌మెంట్ జోన్ ప్రజలు కూడా సెల్ఫ్ క్వారంటైన్ లో ఉండాలన్న నిర్ణయానికి వచ్చారు.

జాగ్రత్తగా ఉండాలని నిర్ణయించుకున్నాం: మహ్మద్ లైఖ్ మోహిద్దీన్, కంటైన్‌మెంట్ జోన్‌వాసి

కరోనా మహమ్మారి వల్ల కంటైన్‌మెంట్ జోన్‌గా తమ ప్రాంతాన్ని ప్రకటించడంతో కొంత ఇబ్బంది పడ్డాం. వారం తరువాత కొంత సర్దుకోగలిగాం. అంతర్జాతీయంగా కరోనా చూపుతున్న ప్రభావం గురించి తెలియడంతో నెమ్మదిగా అర్థం చేసుకుని ఇంట్లోనే ఉండాలని భావించాం. కాలనీలో నివాసం ఉండే పేదలకు సమస్యలు ఎదురైనా ఉచిత బియ్యం అందడంతో ఊరట కల్గింది. నేను కూడా మా కాలనీలో సర్వీస్ చేశా. ఈ సమయంలో కాలనీవాసుల్లో మార్పు రావడం గమనించాను. అత్యవసర పరిస్థితుల్లో మెడిసిన్స్ కూడా అందుబాటులో ఉంచడంతో అనారోగ్యంతో ఉన్నవారికి కూడా ఇబ్బంది లేకుండా పోయింది. ఏది ఏమైనా కరోనా వ్యాధి విషయంలో జాగ్రత్తగా ఉండాలన్న సంకల్పం మాత్రం మాలో బలంగా నాటుకుపోయింది. మనుషుల ప్రాణాలకే గ్యారెంటీ లేని పరిస్థితి కల్పించిన కరోనా విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్న నిర్ణయానికి వచ్చాం.

Tags: Telangana’s Karimnagar, COVID-19, coronavirus, containment zone

Advertisement

Next Story

Most Viewed