ఒకే గొడుగు కిందకు నీటిపారుదల శాఖలు

by Shyam |   ( Updated:2020-07-14 00:04:46.0  )
ఒకే గొడుగు కిందకు నీటిపారుదల శాఖలు
X

దిశ, న్యూస్ బ్యూరో: రాష్ట్రంలో నీటి పారుదల శాఖలన్నీ ఒకే గొడుగు కిందకు రానున్నాయి. సీఎం కేసీఆర్ ఆదివారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారని అధికారులు వెల్లడించారు. ఇప్పటికే ఈ ప్రక్రియ మొత్తం పూర్తి చేసినా ఇద్దరు చీఫ్ ఇంజనీర్ల మధ్య నెలకొన్న విభేదాలతో వాయిదా పడింది. ఈఎన్సీలతోపాటు అధికారులు కూడా ఈ అంశం మీద వర్గాలుగా విడిపోయి రచ్చకెక్కడంపై సీఎం మండిపడినట్లు తెలుస్తోంది. శాఖల పునర్ వ్యవస్థీకరణపై వివరాలను ఆరా తీయడంతో అధికారులు సీఎంకు విషయాలన్నీ వెల్లడించారు. దీంతో ఆగ్రహించిన ఆయన వెంటనే ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్ బుధవారం ఇందుకోసం ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. ఇదే రోజున విలీనానికి సంబంధించిన ఉత్తర్వులు వెలువడనున్నట్లు తెలుస్తోంది. దీని ప్రకారం, వేర్వేరుగా ఉన్న నీటి పారుదల శాఖలన్నీ ఏకం కానున్నాయి. దీంతో పని సులభంగా మారుతుందని, నిర్వహణ ఇబ్బందులుండవని భావిస్తున్నారు.

వరద కాల్వ నుంచి రుద్రంగికి

వరద కాల్వ నుంచి ఒకే లిఫ్ట్ ద్వారా రుద్రంగి చెరువును నింపేందుకు సీఎం నిర్ణయం తీసుకున్నారు. దీనిపై సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ప్రస్తుతం 0.15 టీఎంసీ సామర్థ్యమున్న రుద్రంగి చెరువును 0.45 సామర్థ్యానికి పెంచనున్నారు. ఎల్లంపల్లి నుంచి తరలిస్తే ఐదు లిప్ట్ లు ఏర్పాటు చేయాల్సి ఉంది. వరద కాల్వ నుంచి నేరుగా ఒకే లిప్ట్ తో ఎత్తిపోసేందుకు అవకాశం ఉంది. దాదాపు 40 వేల ఎకరాల ఆయకట్టుకు రుద్రంగి రిజర్వాయరు నుంచి నీటిని అందించనున్నారు. జూరాల ప్రాజెక్టుకు వరద వస్తుండటం, ప్రాజెక్టులో నీటి నిల్వ ఉండటంతో ఇప్పటికే బీమా, నెట్టెంపాడు కాల్వల నుంచి నీటిని వదులుతున్నారు. కల్వకుర్తి మోటర్లను ఎందుకు ప్రారంభించడం లేదని సీఎం అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. వెంటనే కల్వకుర్తి మోటర్లను ప్రారంభించాలని ఆదేశించారు.

లిప్ట్ ల కోసం రూ. 50 కోట్లు

రాష్ట్రంలో లిప్ట్ ల నిర్వహణ కోసం సీఎం కేసీఆర్ రూ.50 కోట్లను అత్యవసరంగా విడుదల చేశారు. పలు లిప్ట్ లు నిర్వహణ లోపాలతో ఉన్నాయని, మెరాయిస్తున్నాయని అధికారులు చెప్పడంతో వాటికి నిధుల విడుదలకు ఆదేశాలిచ్చారు. ఓంకారేశ్వర ప్రాజెక్టును పరిశీలించేందుకు నీటిపారుదల శాఖ ఉన్నతాధికారుల బృందం మధ్యప్రదేశ్ కు వెళ్లనుంది. ఆ ప్రాజెక్టు మాదిరిగానే ఇక్కడ కాళేశ్వరం పనులు చేస్తున్నారు. ప్రస్తుతం ప్యాకేజీ 21లో పైపులైన్ పనులు మొదలవుతున్న నేపథ్యంలో అక్కడ మరోసారి అధ్యయనం చేయాలని సీఎం కేసీఆర్ సూచించారు.

Advertisement

Next Story