మరో పదేళ్ల దాకా ఆ పని చేయడం కుదరదట.. ఇక పెట్రోల్ ధరలకు అడ్డుకట్ట వేయడం కష్టమేనా..?

by Shamantha N |
మరో పదేళ్ల దాకా ఆ పని చేయడం కుదరదట.. ఇక పెట్రోల్ ధరలకు అడ్డుకట్ట వేయడం కష్టమేనా..?
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో చాపకింద నీరులా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యులపై మోయలేని భారాలు మోపుతున్నాయి. ముఖ్యంగా గత కొద్దిరోజులుగా దేశంలోని పలు ప్రాంతాల్లో లీటరు పెట్రోల్ ధర రూ. 100 దాటింది. దీని ప్రభావం ప్రజలపై ప్రత్యక్షంగానే గాక పరోక్షంగా పడుతున్నది. నిత్యావసరాల వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. పెరిగిన ఇంధన ధరలను తగ్గించాలని, పెట్రోలియం ఉత్పత్తులను గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ) పరిధిలోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మరో పదేళ్ల వరకు ఇంధన దరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడం కుదరదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇదే విషయమై బీజేపీ నాయకుడు, రాజ్యసభ ఎంపీ సుశీల్ కుమార్ మోడీ రాజ్యసభలో వివరణ ఇచ్చారు.

రాజ్యసభలో ఆర్థిక బిల్లుపై చర్చ సందర్భంగా సుశీల్ కుమార్ మోడీ మాట్లాడుతూ.. పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడం కుదరదని అన్నారు. వచ్చే 8-10 సంవత్సరాల కాలంలో కూడా అది సాధ్యం కాబోదని చెప్పారు. అలా చేస్తే కేంద్ర, రాష్ట్రాలు ఆదాయం కోల్పోతాయని తెలిపారు. పెట్రోలియం ఉత్పత్తులపై పన్నుల ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రతి యేటా రూ. 5 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని అన్నారు. వాటిని జీఎస్టీలోకి చేరిస్తే రాష్ట్రాలు సంవత్సరానికి రూ. 2.5 లక్షల కోట్ల ఆదాయం కోల్పోతాయని తెలిపారు.

చమురు ఉత్పత్తుల మీద ప్రస్తుతం 60 శాతం పన్నులను విధిస్తుండగా.. జీఎస్టీ పరిధిలోకి తెస్తే దానిని 28 శాతానికి కుదించాలి. అంటే ఉదాహరణకు ప్రస్తుతం పెట్రోల్ లీటరుకు రూ. 100 ఉంటే దానిపై పన్నులే (కేంద్ర, రాష్ట్రం విధించేవి కలిపి) రూ. 60 గా ఉన్నాయి. ఒకవేళ దానిని జీఎస్టీ పరిధిలోకి తెస్తే అది రూ. 14 మాత్రమే అవుతుంది. తద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారీ ఆదాయం కోల్పోతాయి.

Advertisement

Next Story

Most Viewed