బతుకే భారమైన వేళ.. LRS కొత్త టెన్షన్..!

by Anukaran |
బతుకే భారమైన వేళ.. LRS కొత్త టెన్షన్..!
X

రాష్ట్ర ప్రభుత్వం LRS స్కీమ్ ప్రవేశ పెట్టినప్పటి నుంచి పట్టణ ప్రాంతాల్లో ఇండ్లు కట్టుకున్న పేదలు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన భూములకూ ఎల్‌ఆర్‌ఎస్ స్కీమ్ వర్తిస్తుందని అధికారులు తేల్చి చెప్తుండడంతో ఏం చేయాలో అర్థం కావట్లేదని తలలు పట్టుకుంటున్నారు. తమకు మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నారు.

దిశ, వరంగల్‌ సిటీ: ప్రభుత్వం ఆదాయ వనరుగా ఎంచుకున్న LRS స్కీమ్‌పై పేదల్లో ఆందోళన నెలకొంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా శనివారం నాటికి ఏడు వేల దరఖాస్తులు అందాయి. ఆయా దరఖాస్తుల ద్వారా ప్రభుత్వానికి రూ.21 లక్షల ఆదాయం సమకూరింది. అయితే బడ్జెట్ సమావేశాలు, నూతన రెవెన్యూ చట్టం నేపథ్యంలో ప్లాట్ ఓనర్లలో అయోమయం నెలకొంది. ఇప్పటికే ప్రకటించిన LRS స్కీమ్‌లో ఏమైనా మార్పులు, చేర్పులకు అవకాశాలు ఉంటాయా అని ఎదురు చూస్తున్నారు.

పంచిన స్థలాల సంగతి ఏంటి?

2008లో నాటి వైఎస్ సర్కార్ హయాంలో వేయి గజాలలోపు స్థలాల క్రమబద్ధీకరణకు కేవలం రూ.15 చెల్లించాలని నిర్ణయించారు. 2015లో TS సర్కారు సైతం మురికి వాడల్లో స్థల పరిమాణంతో సంబంధం లేకుండా కేవలం రూ.5 చెల్లిస్తే సరిపోతుందని ప్రకటించింది. అయితే 2020లో మరోసారి టీఆర్ఎస్ సర్కారు ప్రకటించిన LRS స్కీమ్‌లో 100 గజాలలోపు స్థలాలకు కూడా గజానికి రూ.200 చెల్లించాలని నిర్ణయించింది. 101 నుంచి 300 గజాలలోపు స్థలాలకు రూ.400 చెల్లించాలని పేర్కొంది. ఈ క్రమంలో GWMC, GHMC పరిధిలో గతంలోని ప్రభుత్వాలు వేల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాయి. ఇప్పుడు వాటికి కూడా ఎల్ఆర్ఎస్ అవసరం అంటూ ప్రభుత్వం నిబంధనలు విధించింది. దీంతో బతకడమే కష్టంగా ఉందని.. వేల రూపాయలు ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలని వాపోతున్నారు.

పెరిగిన చార్జీలు..

లేఅవుట్ ప్లాట్లు కాకుండా నాలా కన్వర్షన్ స్థలాలను మధ్యతరగతి ప్రజలు కొనుగోలు చేశారు. ఇలాంటి అక్రమ వెంచర్లు తెలంగాణలో దాదాపు లక్షకుపైగా ఉన్నట్లు ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిలో తేలింది. అయితే నిధుల అన్వేషణలో ఉన్న సర్కారు ఇదే అదనుగా భావించి రిజిస్ట్రేషన్ల ప్రక్రియను నిలిపివేసి, LRS స్కీమ్‌ను ప్రకటించింది. అయితే గతంలో వెయ్యి గజాలలోపు స్థలానికి కేవలం రూ.15 చెల్లిస్తే సరిపోయేది. తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం మొదటిసారి ప్రకటించిన అక్రమ లేఅవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణలో 100 గజాలలోపు రూ.200, 101 నుంచి 300 గజాలలోపు రూ.400, 301 నుంచి 500 గజాలలోపు రూ.600, 500 గజాలకు పైగా రూ.750 చెల్లించాలని నిర్ణయించింది. ఇక 3,000 గజాలకు మార్కెట్ ధరపై 20 శాతం, 3,001 నుంచి 5,000 గజాలకు మార్కెట్ ధరపై 30 శాతం, 5,001 నుంచి 10,000 గజాలకు మార్కెట్ ధరపై 40 శాతం, 10,001 నుంచి 20,000 గజాలకు మార్కెట్ ధరపై 50 శాతం, 20,001 నుంచి 30,000 గజాల వరకు 60 శాతం, 30,001 నుంచి 50,000 గజాలకు మార్కెట్ ధరపై 80 శాతం, 50,000 గజాలకు పైగా ఉన్న స్థలాలకు మార్కెట్ ధరపై 100శాతం ధరను క్రమబద్ధీకరణకు చెల్లించాలంది.

పెండింగ్‌లో 6 వేల దరఖాస్తులు..

2015లో తెలంగాణ సర్కారు మొదటిసారి LRS ప్రక్రియను ప్రకటించింది. ఉమ్మ డి జిల్లా వ్యాప్తంగా ప్లాట్ల క్రమబద్ధీకరణ కోసం జీడబ్ల్యూఎంసీ, కుడా, 9 మున్సిపాలిటీల్లో దాదాపు 7వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. వాటిలో ఇప్పటి వరకు 6 వేల దరఖాస్తులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. రెండు వేల దాకా BRS దరఖాస్తులు జీడబ్ల్యూఎంసీ పరిధిలో పెండింగ్‌లో ఉన్నాయి.

పదివేల గజాలకు..

2015లో యాభై వేల గజాలకు పైగా ఉంటే 100 శాతం మార్కెట్ ధర చెల్లించాల్సి ఉంది. ఈసారి మాత్రం పదివేల గజాలకు పైగా ఉంటేనే 100 శాతం మార్కెట్ ధరను చెల్లించాలని నిర్ణయించారు. దానితో పాటు వ్యక్తిగత LRSకు రూ.వెయ్యి, లేఅవుట్ ఎల్ఆర్ఎస్‌కు దరఖాస్తు ధరను రూ.పదివేలుగా నిర్ణయించారు. 2020లో ప్రకటించిన ప్లాట్ల విషయంలో ఎల్ఆర్ఎస్ ధరలు మూడు వేల గజాలకు 25 శాతం, ఐదు వేల గజాలకు పైగా ఉంటే 50 శాతం, పదివేల గజాలలోపు 75 శాతం, పదివేల గజాల కంటే అధికంగా ఉంటే 100 శాతం మార్కెట్ ధరను చెల్లించాల్సి ఉంటుందని నిర్ణయించింది. దీంతో అటు ప్లాట్లు కొన్న వ్యక్తులకు, ఇటు నాలా కన్వర్షన్‌తో ప్లాట్లు చేసిన రియల్టర్లకు ఎల్ఆర్ఎస్ స్కీమ్ మరింత భారంగా మారింది.

Advertisement

Next Story

Most Viewed