రాజ్యసభకు ప్రియాంకా..?

by Shamantha N |
రాజ్యసభకు ప్రియాంకా..?
X

ఢిల్లీ ఫలితాల తర్వాత ఆత్మపరిశీలన చేసుకున్న కాంగ్రెస్.. తక్షణ దిద్దుబాటు చర్యలకు పూనుకుంది. సంస్థాగతంగా పార్టీ పునర్నిర్మాణంపై దృష్టిసారించడంతో పాటు రాజ్యసభకు పంపే తరువాతి బ్యాచ్ నాయకుల ఎంపికకు కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. అంబికా సోని, గులాం నబీ ఆజాద్, దిగ్విజయ్ సింగ్‌తో పాటు పలువురు సీనియర్ నాయకుల రాజ్యసభ పదవీకాలం త్వరలోనే ముగియనుంది. ఈ ఖాళీలను ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, జార్ఖండ్ కోటా నుంచి భర్తీ చేయనుంది. అయితే ప్రియాంకా గాంధీని రాజ్యసభకు పంపనున్నారనే ఊహాగానాలు అధికమవడంతో.. తిరిగి పాత నాయకులను కొనసాగిస్తారా లేదా కొత్తతరానికి అవకాశం ఇస్తారా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఛత్తీస్‌గఢ్ నేతలు కూడా ప్రియాంకను ఎగువసభకు పంపాలని సూచించడం ఇందుకు బలం చేకూరుస్తోంది.
అయితే ఈ నిర్ణయం వల్ల ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే విషయంలో కాంగ్రెస్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే బీజేపీని ఎదుర్కొనేందుకు లోక్‌సభలో రాహుల్ గాంధీ, రాజ్యసభలో ప్రియాంకా గాంధీ నేతృత్వం వహించడం వరకు మంచి నిర్ణయమే. కానీ అదే సమయంలో కాంగ్రెస్ వారసత్వ రాజకీయాలపై విమర్శలు ఎదుర్కోక తప్పదు. అంతేకాకుండా ప్రియాంక గాంధీని రాజ్యసభకు పంపడం..ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో ఆమె ప్రచారాన్ని బలహీనపరుస్తుందా లేదా రాజకీయంగా లాభం చేకూరుస్తుందా అనే అంశాన్ని పరిగణించాల్సిన అవసరం ఉంది. అయితే ఈ విషయంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని పార్టీ వర్గాల సమాచారం.

Advertisement

Next Story

Most Viewed